అమ్మలగన్నయమ్మ

దుర్గమ్మను స్తుతిస్తూ ‘పోతన గారు’ చెప్పిన, మన అందరికీ ఎంతో సుపరిచితమైన ఈ పద్యంలోని అంతరార్ధం గురువు గారైన ‘శ్రీ సామవేదం’ వారి మాటల్లో తెలుసుకుందాం…
అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి బుచ్చెడియమ్మ…
దన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ, మాయమ్మ, కృపాబ్ధినిచ్యుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్

అంతరార్థం :-
అమ్మలగన్నయమ్మ :-
ఆ తల్లి, అమ్మలకు అమ్మ దుర్గమ్మ .
అమ్మ అంటే… మన జన్మకు కారణం, పోషకం, రక్షణ ఇస్తుందో వారిని అమ్మ అంటాము.
మన ఒక్కడినే పోషించి, ఈ జన్మకు మాత్రమే కారణమైన ఆమెనే అమ్మ అంటున్నామే, మరి అలా అన్ని జన్మలలో నీతో పాటు అందరినీ పోషించే అసలు అమ్మ ఆవిడ, ‘దుర్గమ్మ’.
ఎప్పటికి మారని అమ్మ. అమ్మ అంటే కారణం. మరి అమ్మలగన్న అమ్మ అంటే… కారణానికే కారణం.
( ఎంత అందమైన తెలుగో గమనించండి..)
అమ్మలగన్నయమ్మ అంటే ….. ఆ ‘మల’ గన్న అమ్మ ….( అట పోతన గారి గొప్పతనం ) అనగా …. మల అంటే కొండ, ఆ కొండ కన్న కూతురు, ‘పార్వతిదేవి’. *
అమ్మలగన్న యమ్మ ….ఆ మల గన్న యమ్మ.. *
లక్ష్మి, పార్వతి, సరస్వతి ఆ ముగ్గురు కలిస్తేనే ఆ ముగురమ్మల మూలపుటమ్మ. ఆ ముగ్గురూ ఒక్కటైన అమ్మ , ‘దుర్గమ్మ’.
మరి ఆవిడ ,ఎప్పట్నించి ఉందీ ??? తెలియదు. అమ్మ ఎప్పుడు పుట్టింది అంటే, ఎవరికీ తెలియదు. అందుకే ‘చాల’ ‘పెద్దమ్మ’.

“సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుల మనమ్ముల నుండేడి అమ్మ…. ఈ రెండే ఆవిడ పనులట..
(గురువు గారు మనకు ఇక్కడ ఒక సూచన ఇస్తున్నారు…
సురారులమ్మ కడుపారడి .. బుచ్చెడి యమ్మ వాక్యము మొత్తము కలిపి చదవాలి అన్నారు. మధ్యలో ఆపకూడదు అని చెప్పారు)
సురారులమ్మ – రాక్షసులతల్లికి కడుపుమంట పెట్టే తల్లి అంటే… *
రాక్షసులను సంహరించినది కాబట్టి ఆ రాక్షసుల తల్లి ఏడ్చిందట….
కడుపు అంటే జన్మస్థానం! అమ్మ అంటే కారణం .. అంటే సురారులమ్మ అనగా రాక్షసుల జన్మస్థానము ,. దానిని నశింపచేసింది.
అనగా దీనిలోని అంతరార్థం….”రాక్షస ప్రవృత్తికి జన్మస్థానమైన అవిద్యని నశింప చేసింది” అని అర్థము….
అలాంటి అమ్మని ఎవరు పూజించాలి అంటే వేల్పుటమ్మలే పూజించాలి … అంటే దేవకాంతలు కొలుచుకుoటారు. దేవతలు అంటే దైవీ సంపదలు కలవారు, సాత్విక గుణం కలవారు, దైవీగుణం కలవారు అని అర్ధం.
అనగా అమ్మని కొలుచుకోవాలి అంటే మనము కూడా దైవీ సంపదలు కలిగినవారుగా అవ్వాలి.
ఇంకా… తన్నులో నమ్మిన అనగా అమ్మవారిని లోపల నుండి మనస్ఫూర్తిగా నమ్మడం, పైపైన నమ్మడం కాదు అని అర్థము.
మనoబునఉండెడి అనగా అలా మనస్ఫూర్తిగా నమ్మిన వారి మనసులో అమ్మ కూర్చుంటుంది.
అలా ఎవరు కూర్చుంటారు??? దుర్గ ! మా అమ్మ ( గుండె మీద చేయి వేసుకుని ,అమ్మని మా అమ్మ అంటూ భావించoడి . ఆ ప్రభావం ఎలా ఉందో మీరే గమనించండి)
కృపాబ్ధి
ఆవిడ దయ అనే సముద్రము…
అలా నమ్మినవారికి అమ్మ ఏమిస్తుంది ? మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్…
మహత్వము అనగా అన్నీ గొప్పగా ఉండటం..
కవిత్వము ..అనగా బుద్ధిశక్తి ,జ్ఞానము..
పటుత్వము . … జ్ఞానం ఒక్కటే చాలదుగా ,శరీరానికి ,మనస్సుకి కూడా బలం ఉండాలి గా!!
సంపదల్ అమ్మ పై మూడిటి తో పాటు సంపదలు కూడా ఇస్తుంది …
ఇంకా కావాల్సినవి ఏమన్నా ఉన్నాయా ???
ఆలోచించండి ..
ఇక్కడ బీజాక్షరాలు కూడా పొందుపరిచారు పోతనగారు
మహత్వా అన్నది ఓం
కవిత్వ అంటే జ్ఞానము కనుక సరస్వతి బీజం ఐం
పటుత్వ అంటే శక్తి బీజ o హ్రీం
సంపదల్ లక్ష్మీ బీజం శ్రీం.
కలిపి ఓం ఐం హ్రీం శ్రీ o
ఇటువంటి చిన్న పద్యంలో ఇంతటి బీజాక్షరాలను నిక్షిప్తం చేశారు.
ఇప్పుడు పద్యాన్ని మళ్లీ ఒక్కసారి చదివి , భావించి, చక్కటి అనుభూతిని అందరూ పొందగలరు.
శ్రీ దుర్గా చరణారవిందార్పణ మస్తు

– సేకరణ- రమ.

Leave a Reply