Suryaa.co.in

Editorial

తెలుగు పాలకులకు ‘పెట్రో’ సెగ

– ఇప్పటికే వ్యాట్ తగ్గించిన అనేక రాష్ట్రాలు
– వ్యాట్ తగ్గింపు డిమాండ్‌పై జగన్-కేసీఆర్ తగ్గుతారా?
– అటు తగ్గిస్తే కోల్పోయే ఆదాయం.. ఇటు తగ్గించకపోతే పెరిగే జనాగ్రహం
– అడకత్తెరలో ‘తెలుగు బ్రదర్స్’
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఎంకిపెళ్లి సుబ్బిచావుకొచ్చినట్లు.. కేంద్రం తగ్గించిన పెట్రో దరలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఇరకాటంగా మారింది. దీపావళి సందర్భంగా పెట్రోల్‌పై లీటరుకు 5 రూపాయలు, డీజిల్‌పై 10 రూపాయల ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ, మోదీ సర్కారు తీసుకున్న సంచలన నిర్ణయం.. విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులను సంకటంలోకి నెట్టివేసింది. మోదీ నిర్ణయానికి మద్దతుగా ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు కూడా, పెట్రో ధరలు తగ్గిస్తూ అంతే వేగంగా నిర్ణయం తీసుకుని, ఆయా రాష్ట్ర ప్రజల పెదువులపై చిరునవ్వులు పూయించాయి. దానితో ఆయా రాష్ట్రాలు కూడా… తమ వాటాగా వ్యాట్ రూపంలో వచ్చే ఆదాయాన్ని తగ్గించుకుని, పెట్రో ధరలు తగ్గించడం అనివార్యంగా మారింది.
ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా పెట్రో ధరల తగ్గింపునకు సంబంధించి… తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంపై, ప్రజలు, విపక్షాల నుంచి ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. దీనిపై రెండు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, జనసేన నుంచి వస్తున్న విమర్శలను.. ఏపీ సీఎం జగన్-తెలంగాణ సీఎం కేసీఆర్ ఎలా అధిగమిస్తారన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. నిజానికి కేంద్రం పెట్రో అమ్మకాలపై వచ్చే ఆదాయాన్ని రాష్ట్రాలకు 41 శాతం వరకూ పంచుతోంది.
ఇప్పటికే పక్కనే ఉన్న కర్నాటక, అసోం, మణిపూర్, త్రిపుర, గోవా, గుజరాత్‌లో పెట్రోలు 7 రూపాయలు, యుపి-హరియాణాలో 12, ఒడిషాలో 3, ఉత్తరాఖండ్‌లో 2 రూపాయలు, బీహార్‌లో 1.30 రూపాయలు, ఢిల్లీలో పెట్రోల్‌పై 6.07, డీజిల్‌పై 11.75 రూపాయలు తగ్గించిన వైనం జాతీయ, స్థానిక మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశమవుతోంది. దీనితో ఆంధ్ర- తెలంగాణ రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడు తగ్గిస్తారు? ఎంత తగ్గిస్తారన్న ఉత్కంఠ ప్రజల్లో నెలకొంది. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు, జనసేన దళపతి పవన్ కల్యాణ్, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, తెలంగాణ బీజేపీ దళపతి బండి సంజయ్ రెండు రాష్ట్రాల్లో పెట్రో ధరల తగ్గించాలని ఇప్పటికే డిమాండ్ చేశారు.
కాగా, మోదీ సర్కారు తన ఆదాయాన్ని తగ్గించుకున్నప్పుడు, తెలుగు రాష్ట్రాలు కూడా తమ ఆదాయాన్ని ఎందుకు తగ్గించుకోవడం లేదన్న చర్చ ‘తెలుగు బ్రదర్స్’ కేసీఆర్-జగన్‌కు శిరోభారంగా పరిణమించింది. ఇప్పటిదాకా పెట్రో ధరలు పెంచిన మోదీ సర్కారును విమర్శిస్తూ వస్తున్న ప్రజల దృష్టి, ఇప్పుడు సహజంగానే కేసీఆర్-జగన్‌పై పడింది. ఇటీవలి బద్వేల్, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్-వైసీపీ నేతలు.. కేంద్రం పెంచుతున్న పెట్రో, గ్యాస్ ధరలను ప్రచారాస్త్రంగా సంధించారు. అయితే, పెట్రోల్-డీజిల్‌పై కేంద్రం కంటే.. రాష్ట్రం విధించే పన్నులే ఎక్కువగా ఉన్నందున, ముందు వాటిని తగ్గించాలని బీజేపీ నేతలు బండి సంజయ్, సత్యకుమార్, కన్నా లక్ష్మీనారాయణ వంటి నేతలు ఎదురుదాడి ప్రారంభించారు.
రెండు రాష్ట్రాల్లో సానుకూల పరిస్థితులు లేని నేపథ్యంలో, పెట్రో ధరల తగ్గింపు వ్యవహారం రెండు రాష్ట్రాల ముఖ్య్యమంత్రులకు తలనొప్పిలా మారింది. నిజానికి తెలంగాణలో పెట్రోల్ లీటరుకు 34 రూపాయలు ఆదాయం వస్తుండగా, ఏపీలో అమరావతి టాక్స్ 4 రూపాయలతోపాటు ఒక రూపాయి రోడ్డు సెస్‌తో కలిపి 35 రూపాయలు వసూలుచేస్తోంది. కరోనా సమయంలో కూడా రెండు తెలుగు రాష్ట్రాలు సుంకాలు పెంచి, ప్రజలపై భారం వేసిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా, దేశంలో మాత్రం కేంద్రం-రాష్ట్రాలు పోటీపడి మరీ చమురు ధరలు, సుంకాలు పెంచడంపై అప్పట్లోనే విమర్శలు వెల్లువెత్తాయి.
ఇప్పుడు కేంద్రం చమురు ధరలపై సుంకం తగ్గించిన నేపథ్యంలో, ఏపీ-తెలంగాణ రాష్ట్రాలపై కూడా సుంకం తగ్గించాలన్న డిమాండ్ పెరుగుతుండంతో పాలకులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు పోటీలు పడి మరీ సంక్షేమ పథకాలు అమలుచేస్తుండటంతో, చేతిలో చిల్లి గవ్వలేని పరిస్థితి. రెండేళ్ల నుంచి పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులివ్వకపోవడంతో, రెండు రాష్ట్రాల్లో ‘మెగా ఇంజనీరింగ్’ తప్ప.. ఒక్క కాంట్రాక్టరు కూడా, కొత్త పనులు చేసేందుకు ముందుకు రాని పరిస్థితి నెలకొంది. ఏపీలో ప్రతి నెల 10వ తేదీ వరకూ జీతాలు ఇవ్వలేకపోతుండగా, తెలంగాణలో జిల్లాల వారీగా జీతాలిస్తున్న ఆర్ధిక దుస్థితి. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్‌పై సుంకం తగ్గిస్తే, ఆ భారం మళ్లీ ఖజానాపై పడటం ఖాయం. అలాగని మౌనంగా ఉంటే.. అటు ప్రజలు-ప్రతిపక్షాల నుంచి ఒత్తిళ్లు పెరిగి, ప్రజల ముందు పాలక పార్టీలు ముద్దాయిగా మారడమూ అంతే ఖాయమన్నది పరిశీలకుల విశ్లేషణ.

LEAVE A RESPONSE