Suryaa.co.in

Andhra Pradesh

‘కొల్లేరు’కు శాశ్వత పరిష్కారం దిశగా ప్రణాళికలు

– ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వెల్లడి

కైకలూరు: కొల్లేరు సమస్యకు శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్టు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. ఏలూరు జిల్లా కైకలూరు మండలం శృంగవరప్పాడులో కొల్లేరు ప్రాంత ప్రజల ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్ రావు, కొల్లేరు పరిరక్షణ సమితి ప్రతినిధులతో కలిసి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తొలిసారి తాను కైకలూరు నియోజకవర్గం పర్యటనకు వచ్చిన సందర్భంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, పెద్దలు కొల్లేరు సమస్యను తన దృష్టికి తీసుకువచ్చారని ఎంపీ తెలిపారు.

ప్రజల ఆశీస్సులతో ఎంపీగా విజయం సాధించిన అనంతరం కొల్లేరు ప్రాంత వాసుల సమస్యపై పూర్తి అవగాహన చేసుకున్నట్టు పేర్కొన్నారు. కొల్లేరు సమస్య పరిష్కారానికి నోచుకోదని, ఆ విషయంలో జోక్యం చేసుకోవద్దని కొందరు సన్నిహితులు తనను వారించినా, కొల్లేరు ప్రజలకు న్యాయం జరగాలని కోరుకున్న తాను వారి పక్షాన నిలబడినట్టు ఎంపీ స్పష్టం చేశారు. సమస్య ఎప్పటిలోగా పరిష్కారం అవుతుందనే నిర్దిష్టమైన గడువు తాను చెప్పలేనని, కొల్లేరు సమస్యకు మాత్రం శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఎంపీ ఘంటాపథంగా తెలిపారు.

తొలిసారి తమ గ్రామానికి వచ్చిన ఎంపీ కు స్థానిక పెద్దలు, ప్రజాప్రతినిధులు పుష్పగుచ్చాలు అందజేసి, శాలువాలు కప్పి సన్మానించారు. అనంతరం ఎంపీ కొల్లేటికోటలో కొలువైన శ్రీశ్రీ పెద్దింటి అమ్మవారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.

LEAVE A RESPONSE