Suryaa.co.in

Andhra Pradesh

ఏపీలో ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలు నిషేధం

-సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం
-గుడ్డతో చేసిన ఫ్లెక్సీలకు మాత్రమే ఇకపై అనుమతి
-పర్యావరణాన్ని పరిరక్షిస్తూనే ఆర్థిక పురోగతి సాధించాలి
-పార్లే ఫర్‌ ది ఓషన్‌ సంస్థతో ప్రభుత్వం ఎంవోయూ
-ప్రపంచంలోనే అతిపెద్ద బ్లీచింగ్‌ కార్యక్రమం విశాఖలో జరిగింది
-76 టన్నుల ప్లాస్టిక్‌ను సముద్రం నుంచి తొలగించారు
-భూమిపై 70 శాతం ఆక్సిజన్‌ సముద్రం నుంచే వస్తోంది
-ప్లాసిక్‌ వల్ల 67 రకాల సముద్ర జీవరాశులు మృత్యువాత పడుతున్నాయి
-రాష్ట్రవ్యాప్తంగా 4,097 చెత్త సేకరణ వాహనాలు ఏర్పాటు చేశాం

విశాఖ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇకపై ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలు నిషేధిస్తూ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్లాస్టిక్‌ రహిత రాష్ట్రమే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నట్లు చెప్పారు. సముద్రాన్ని కాపాడుకునేందుకు, పర్యావరణాన్ని కాపాడుకునేందుకు పార్లే ఓషన్‌ సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లు సీఎం వైయస్‌ జగన్‌ ప్రకటించారు. ప్లాస్టిక్‌ వ్యర్థాలు సముద్ర జీవరాశులను హరించివేస్తున్నాయి. రాష్ట్ర పౌరులుగా సముద్ర తీరాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉందన్నారు. విశాఖ‌ బీచ్‌ పరిశుభ్రత కార్యక్రమాన్ని జీవీఎంసీ, జిల్లా కలెక్టరేట్, ఇతర స్వచ్ఛంద సంస్థల సహకారంతో2 శుక్రవారం ఉదయం 6 నుంచి 8 గంటల వరకు చేప‌ట్టి తీరం వెంట ఉన్న ప్లాస్టిక్‌ను తొల‌గించారు. ఆర్కే బీచ్‌ నుంచి భీమిలి వరకు సుమారు 28 కిలోమీటర్ల పొడవునా సాగరతీరంలో ప్లాస్టిక్, ఇతర వ్యర్థాల్ని సేకరించే కార్యక్రమంలో దాదాపు 20 వేల మంది వలంటీర్లు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా విశాఖ బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్‌ హాల్‌లో ‘పార్లే ఫర్‌ ది ఓషన్‌’ సంస్థ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ స్టాల్స్, బీచ్‌ పరిరక్షణకు నిర్వహించిన కార్యక్రమాలు, ప్లాస్టిక్‌ నియంత్రణకు సంబంధించి జీవీఎంసీ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సీఎం సందర్శించారు. అనంత‌రం ఏర్పాటు చేసిన మీటింగ్‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్రసంగించారు.

ఈ సందర్భంగా సీఎం వైయస్‌.జగన్‌ మాట్లాడుతూ ఏమన్నారంటే…:
ఈ రోజు గుర్తుండిపోయే రోజు. నీతి ఆయోగ్‌ మాజీ వైస్‌ ఛైర్మన్, లీడర్‌షిప్‌ కౌన్సిల్‌ జీఏఎస్‌పీ, రాజీవ్‌ కుమార్, సెక్రటరీ జనరల్‌, గ్లోబల్‌ అలయెన్స్‌ ఫర్‌ సస్టైనబుల్‌ ప్లానెట్‌ సత్య ఎస్‌ త్రిపాఠి, సీఈఓ పార్లే ఫర్‌ ది ఓషన్స్‌ సిరిల్‌ గచ్చ్‌ తో పాటు కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ హృదయపూర్వక అభినందనలు.

ప్రపంచంలోనే అతి పెద్ద బీచ్ క్లీనింగ్ కార్యక్రమం
ఈ ఉదయం పెద్ద సంఖ్యలో హాజరై భారీ ఎత్తున బీచ్‌ క్లీనింగ్‌ కార్యక్రమంలో పాల్గొన్న విశాఖప్రజలకు నా హృదయపూర్వక అభినందనలు. దాదాపు 22 వేల మంది ప్రజలు, 40 ప్రాంతాల్లో ఈ కార్యక్రమంలో పాల్గొని దాదాపు 28 కిలోమీటర్లు మేర గోకుల్‌ బీచ్‌ నుంచి భీమిలి బీచ్‌ వరకు శుద్ధి చేశారు. 76 టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్ధాలను సేకరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద బీచ్‌ క్లీనింగ్‌ కార్యక్రమం ఇది. ఈ సామాజిక స్ఫూర్తి చాలా అద్భుతమైనది, అదే వైజాగ్‌ను ప్రత్యేక నగరంగా నిలబెట్టింది.

పర్యావరణ పరిరక్షణ దిశగా…
పర్యావరణం, ఎకానమీ రెండూ కూడా నాణేనికి రెండు కోణాలు.
పర్యావరణాన్ని పరిరక్షించకపోతే.. మనకు మనుగడ ఉండదు. సుస్ధిరత, సమగ్రత అన్నవి మన ప్రధాన లక్ష్యాలు. మనం స్వల్పకాలిక లక్ష్యాల కోసం రాజీపడితే.. దీర్ఘకాలికంగా మనుగడ సాగించలేం. అందుకే మన ప్రభుత్వం మానవ, ఆర్దిక వనరులతో ఈ దిశలోనే సుస్ధిర ప్రగతి కోసం ప్రయత్నిస్తోంది. అదే సమయంలో పర్యావరణాన్ని, ప్రకృతిని కూడా పరిరక్షిస్తోంది. దాన్ని రాబోయే తరాల ఉత్తమ భవిష్యత్తుకు కూడా అందించాలి.

క్లీన్ ఆంధ్రప్రదేశ్‌ (క్లాప్) కార్యక్రమం…
ఆ దిశగా ఏం చర్యలు తీసుకుంటున్నాం, దీన్ని ఎలా సాధించాలన్నదే ముఖ్యమైన అంశం. మనముందు సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలివి. గత కొన్ని నెలలుగా చూస్తే… ప్రభుత్వం క్లాప్‌ కార్యక్రమాన్ని తీసుకువచ్చింది. అక్టోబరు 2, 2021న క్లాప్‌ ప్రొగ్రాం ప్రారంభించింది. 4097 చెత్త సేకరణ వాహనాలను1 ప్రారంభించింది. గ్రామ, వార్డు సచివాలయాల కేంద్రంగా ఈకార్యక్రమాలను ప్రారంభించాం. దీనివల్ల గ్రామాల్లో చెత్త సేకరణ 22 శాతం నుంచి 62 శాతం పెరిగింది. 100 శాతం సేకరణ లక్ష్యంగా అడుగులు వేస్తున్నాం.

వాస్తవాలు తెలుసుకోవాలి
అయితే కొన్ని వాస్తవాలను కూడా మనం తెలుసుకోవాలి. భూమి మీద మనకు లభించే ఆక్సిజన్‌లో 70 శాతం మెరైన్‌ ప్లాంట్స్‌ నుంచే వస్తోంది. అంటే మన రెయిన్‌ ఫారెస్ట్స్ నుంచి కేవలం 28 శాతం ఆక్సిజన్‌ మాత్రమే లభిస్తోంది. అంటే ఫైటో ప్లాంక్టన్, కెల్ఫ్, ఆల్గల్‌ ప్లాంక్టన్‌ వంటి ప్లాంట్స్‌ కిరణజన్యసంయోగక్రియలో ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ ఫైటో ప్లాంక్టన్‌లో ముఖ్యమైనది ప్లో క్లోరో కాకస్‌. వాతావరణంలోకి అత్యధిక ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తున్న ప్లాంట్‌ ఇది. చాలా కొద్ది మందికి మాత్రమే అవగానహన ఉన్న వాస్తవాలు ఇవి. వీటిని మనం తెలుసుకోవాలి. ఈ వాస్తవాలు తెలుసుకున్న మీదట… మనం మన పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి.

సముద్ర పరిరక్షణ దిశగా…
సముద్రాల్ని కాపాడుకోవాలి. సముద్రంలోకి వస్తున్న ప్లాస్టిక్‌ వ్యర్ధాలు నానాటికీ పెరుగుతున్నాయి. ఇవి సముద్రంలోకి 40–50 కిలోమీటర్ల వరకూ విస్తరిస్తున్నాయి. ప్లాస్టిక్‌ వ్యర్దాల వల్ల మత్స్య సంపద, సముద్రపక్షులు, సముద్ర క్షీరదాలు వంటి దాదాపు 267 జాతులు ప్రపంచ వ్యాప్తంగా దెబ్బతింటున్నాయి.
ఇండోనేషియా, ఇండియాల్లో మైక్రో ప్లాస్టిక్‌ పొల్యూషన్‌ ప్రభావం ప్రజలపై తీవ్రంగా పడుతోంది. ఇది వాస్తవం.
ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే రెండో అతిపెద్ద తీరరేఖ ఉన్న రాష్ట్రంగా ఉంది. 975 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. విశాలమైన ఇసుక బీచ్‌లు, వన్యమృగాలు, పక్షుల కేంద్రాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ పౌరులుగా తీర ప్రాంతాన్ని పరిరక్షించడం మన విధి. ప్లాస్టిక్‌ వ్యర్దాలు లేని సముద్రాలు అనేవి మన లక్ష్యం కావాలి.

ఎందుకు మనం ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం ?
ఎందుకు ప్లాస్టిక్‌ను ఏరివేయాలి అని చెప్పి గొప్ప ఆలోచన, నిర్ణయం తీసుకుంటున్నాం ? మన సముద్రతీరాలు, సముద్రం క్లీన్‌గా ఉండాలన్న ఆలోచనలు ఎందుకు చేస్తున్నామన్నది ప్రతి మెదడులోనూ తిరగాలి. ఈ రోజు వాస్తవం ఏమిటంటే.. మనం పీల్చుకుంటున్న గాలిలో 70 శాతం ఆక్సిజన్‌ సముద్రంలో ఉన్న మొక్కలు నుంచే వస్తుందన్నది గొప్ప సత్యం. మిగిలినది మాత్రమే భూమి మీద ఉన్న మొత్తం చెట్లు అన్నీ కలిపి ఇస్తున్నాయి. అంటే 70 శాతం ఆక్సిజన్‌ సముద్రంలోని మొక్కల నుంచే వస్తుందన్నది మర్చిపోలేని సత్యం. ఇటువంటి సత్యం కాబట్టే దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మన సముద్ర తీరాలు, సముద్రం ఎక్కడ చూసినా ప్లాస్టిక్‌ కనిపిస్తోంది. సముద్రంలోపలా కూడా ప్లాస్టిక్‌ కనిపిస్తోంది. ప్లాస్టిక్‌ డెబ్రిస్‌ కూడా ఎక్కడంటే అక్కడ సముద్రంలోకి వదిలేస్తున్న పరిస్థితి.

స్ధిరమైన పరిష్కారం దిశగా- ఏపీ
రాష్ట్రంలోనూ, దేశంలోనూ కూడా సముద్ర గర్భంలో కూడా ప్లాస్టిక్‌ కనిపిస్తున్న పరిస్థితులు. బహుశా ప్రపంచంలో కూడా చాలా చోట్ల ఇలాంటి పరిస్థితి ఉన్న నేపధ్యంలో.. వీటికి ఒక స్ధిరమైన పరిష్కారం వెదికే దిశగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అడుగులు ముందుకు వేస్తోంది. ఇందులో భాగంగానే ఏపీ ప్రభుత్వం రెండు కంపెనీలను భాగస్వామ్యులుగా ఆహ్వానించింది. ఒకటి గ్లోబల్‌ అలయెన్స్‌ ఫర్‌ సస్టైనబుల్‌ ప్లానెట్‌ వర్క్స్‌(జీఏఎస్‌పి) కాగా, రెండోది పార్లే ఫర్‌ ది ఓషన్స్‌ కంపెనీతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం భాగస్వామ్యం అయింది. గ్లోబల్‌ అలయెన్స్‌ ఫర్‌ సస్టైనబుల్‌ ప్లానెట్‌ వర్క్స్‌ ఏం చేస్తారంటే… భాగస్వామ్యులను ఎంపిక చేయడం, ఆలోచనలను రూపొందించడం, ఆర్ధిక వనరులను సమకూర్చడంలో కీలకంగా వ్యవహరిస్తూ.. పర్యావరణ హితమైన మార్పులు కోసం కృషి చేస్తారు.
పార్లే కంపెనీ ప్రతినిధిగా సెరిల్‌ మాట్లాడుతూ… కొన్ని విషయాలు చెప్పారు. నేను చూపిస్తున్న ఈ బూటు రీసైకిల్డ్‌ ప్లాస్టిక్‌ నుంచి తయారవుతుంది. ప్రఖ్యాత స్పోర్ట్స్‌ కంపెనీ ఆడిడాస్‌ బ్రాండ్‌తో ఇది మార్కెట్‌లోకి విడుదల అవుతుంది. అందమైన బ్యాగుల దగ్గర నుంచి కంటి అద్దాల వరకూ… రీసైకిల్డ్‌ ప్లాస్టిక్‌ నుంచి తయారవుతున్నాయి. ఇవన్నీ పార్లే ఫర్‌ ఓషన్‌ వర్క్స్‌ సంస్ధ తయారు చేస్తుంది. వీళ్లకు ప్రపంచంలోనే ప్రఖ్యాత గాంచిన కంపనీలు మెర్సిడెస్‌ బెంజ్, లూయిస్ విట్టన్‌, ఆడిడాస్, అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ వంటి కంపెనీలతో వ్యాపారం ఉంది. వారికి కావాల్సిన ఉత్పత్తులను పార్లే సంస్ధే డిజైన్‌ చేసి, తయారు చేసి ఇస్తోంది.

ప్లాస్టిక్ రహితంగా మారనున్న ఏపీ ముఖ్యచిత్రం
ఈ పార్లే ఓషన్‌ వర్క్స్‌కు చెందిన సిరిల్, గ్లోబల్‌ అలయెన్స్‌ వీళ్ల సహకారంతో రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నాం. ప్లాస్టిక్‌ లేని రాష్ట్రంగా, ప్లాస్టిక్‌ ఫ్రీ ఏపీగా తీర్చిదిద్దిడానికి ప్రయత్నిస్తున్నాం.

విశాఖపట్నంలో పార్లే ప్యూచర్‌ ఇనిస్టిట్యూట్‌ విశాఖపట్నంలో పార్లే ప్యూచర్‌ ఇనిస్టిట్యూట్‌ రాబోతుంది. ఇది దేశంలోనే కాదు ప్రపంచానికే దిక్సూచిగా తయారవుతుంది. అత్యాధునిక పద్ధతుల్లో కొత్త మెటీరియల్‌ను కనుక్కుంటారు. దానికి సంబంధించిన పరిశోధన ఇక్కడ జరుగుతుంది. అదే విధంగా ప్లాస్టిక్‌ వ్యర్ధాలతో బూట్లు, అద్దాలు వంటి మెటీరియల్‌ తయారు చేసే రీసైక్లింగ్‌ మరియు అప్‌ సైక్లింగ్‌ హబ్‌ కూడా ఏపీలో ఏర్పాటవుతోంది. దీని వల్ల రానున్న ఆరేళ్లలో రూ.16వేల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రానున్నాయి. అంతే కాకుండా స్ధానికంగా ఉద్యోగాలు కల్పన ఒక అంశం అయితే మరొక అంశం రాష్ట్ర వ్యాప్తంగా 20 వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. వాళ్లందరూ ఇందులో భాగస్వామ్యులవుతారు. అంతిమంగా ఆంధ్రరాష్ట్రంలో ప్లాస్టిక్‌ను నిర్మూలించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను.

క్లాత్ ఫ్లెక్సీల దిశగా…
నేను విశాఖనగరంలో కారులో వస్తున్నప్పుడు చాలా చోట్ల ఫ్లెక్సీలు కనిపించాయి. కలెక్టర్‌ గారిని అడిగాను. ప్లాస్టిక్‌ నిర్మూలించే కార్యక్రమానికి వచ్చినప్పుడు ఈ ప్లెక్సీలు ఏంటని అడిగాను.
తాను కూడా కొన్ని జాగ్రత్తులు తీసుకున్నారు. ప్లాస్టిక్‌ ప్లెక్సీలు కాదు బట్టతో తయారు చేసినవి అని చెప్పారు. ప్లాస్టిక్‌ కంటే బట్టతో చేసిన ఖరీదు ఎక్కువైనా పర్యావరణ హితం అని అవే ఏర్పాటు చేశామన్నారు.

ఫ్లాస్టిక్ ఫెక్సీలపై నేటి నుంచి నిషేధం..
ఈ రోజు నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలు నిషేధిస్తున్నాం. ఎవరైనా ఫ్లెక్సీలు పెట్టాలంటే కాస్త ఖర్చు ఎక్కువైనా బట్టతో తయారు చేసిన ఫ్లెక్సీలే పెట్టాలి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్లాస్టిక్‌ని నిర్మూలించే క్రమంలో మొట్టమొదటి అడుగు కింద ఇక్కడ నుంచే పిలుపునిస్తున్నాను.

తిరుమలలో ప్లాస్టిక్‌ రహితంగా ఇప్పటికే చేశారు. అక్కడ మంచి ఫలితాలు కూడా వస్తున్నాయి. ప్లాస్టిక్‌ బ్యాగులు బదులు గుడ్డ సంచులే వాడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మనమంతా కూడా ఆ దిశగా నెమ్మదిగా ఆడుగులు వేస్తూ పోవాలి. ఆ దిశగా ప్రజలందరినీ భాగస్వామ్యులను చేసుకుంటూ.. వారిని కలుపుకుంటూ వారికి అవగాహన కలిగించాలి. అలాగే ప్లాస్టిక్‌ లేనప్పుడు వాటికి బదులుగా.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి అందుబాటులోకి తీసుకువస్తున్నాం. ఒక పద్ధతి ప్రకారం ఏపీని ప్లాస్టిక్‌ రహితంగా తెస్తూ… 2027 చివరి నాటికి ప్లాస్టిక్‌ పొల్యూషన్‌ లేని రాష్ట్రంగా నిలబెట్టడానికి అడుగులు వేస్తున్నాం.
ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నానని సీఎం వైయస్‌.జగన్‌ తన ప్రసంగం ముగించారు.

LEAVE A RESPONSE