శ్రీలంక నూతన అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంక నూతన అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే బాధ్యతలు చేపట్టడం తెలిసిందే. విదేశాలకు పారిపోయిన గొటబాయ రాజపక్స అధ్యక్ష పదవికి రాజీనామా చేయగా, పార్లమెంటు కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘేను ఎన్నుకుంది. ఈ నేపథ్యంలో, భారత ప్రధాని నరేంద్ర మోదీ శ్రీలంక నూతన అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలియజేశారు.

శ్రీలంక ప్రజలకు భారత్ నుంచి మద్దతు కొనసాగుతుందని, శ్రీలంక స్థిరత్వం సాధించేందుకు, ఆర్థికంగా కోలుకునేందుకు ప్రజాస్వామిక మార్గాల్లో సహకరిస్తామని మోదీ భరోసా ఇచ్చారు. ఈ మేరకు కొలంబోలో భారత హైకమిషన్ వెల్లడించింది.

శ్రీలంక, భారత్ ప్రజల పరస్పర ప్రయోజనాల కోసం శ్రీలంక అధ్యక్షుడితో కలిసి కృషి చేస్తామని మోదీ పేర్కొన్నట్టు భారత దౌత్య వర్గాలు తెలిపాయి. శ్రీలంక, భారత్ ల మధ్య ఏళ్ల తరబడి కొనసాగుతున్న సన్నిహిత మైత్రిని మరింత బలోపేతం చేసుకునే దిశగా ముందుకు వెళతామని మోదీ వివరించినట్టు వెల్లడించాయి.