Suryaa.co.in

Andhra Pradesh

రాజకీయ, సైద్ధాంతిక అవగాహనే కమ్యూనిస్టుల బలం

– సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ

రాజకీయ, సైద్ధాంతిక అవగాహన కమ్యూనిస్టులకు బలమని, అందుకే నిరంతరం కమ్యూనిస్టులకు చారిత్రక, రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలలో శిక్షణ కొనసాగుతూ ఉంటుందని, ఆ శిక్షణ ద్వారా కార్యకర్తలు కమ్యూనిస్టులుగా తీర్చిదిద్దబడతారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు.

సిపిఐ ఎన్టిఆర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో రెండు రోజులపాటు కార్యకర్తలకు రాజకీయ, సైద్ధాంతిక శిక్షణా తరగతులు ఈరోజు సిపిఐ ఎన్టిఆర్ జిల్లా కార్యదర్శి సిహెచ్ కోటేశ్వరరావు అధ్యక్షతన దాసరి నాగభూషణరావు భవన్ లో ప్రారంభమయ్యాయి. ఈ తరగతులను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, మాజీ శాసన సభ్యులు కె రామకృష్ణ ప్రారభించారు.

ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ భారతదేశంలో నేడు ప్రమాదకరమైన పరిస్థితులు దాపురించాయని, కమ్యూనిస్టులుగా ప్రస్తుత విపరీత పరిస్థితులను ఎదుర్కోవాల్సిన అవసరం కమ్యూనిస్టుల పైన ఉందన్నారు.

ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికలలో బిజెపి తన మతవాద ప్రచారాన్ని ఉదృతం చేసినా బిజెపికి భంగపాటు తప్ప లేదన్నారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు రద్దు చేస్తామని, లింగాయత్లకు 2 శాతం, వక్కలికి 2 రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, కేరళ స్టోరీ సినిమా చూడాలని, జై భజరంగబలి అంటూ ఓట్లు వేయాలని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, మైనార్టీలకు వ్యతిరేకంగా మత ప్రచారం చేశారని గుర్తుచేశారు.

భారతదేశంలో 3వసారి అధికారం కోసం కామన్ సివిల్ కోడ్ ముందుకు తెస్తున్నారన్నారు, ఈ కోడ్ ద్వారా భార్యాభర్తలకు వచ్చిన సమస్యలను, ఆస్తులు సమస్యలపై, సివిల్ మేటర్స్ ద్వారా, హిందూ ముస్లిం తగాదాల ద్వారా అధికారంలో రావటానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు.

ప్రపంచమంతా నరేంద్ర మోడీ గ్లోబల్ లీడర్ గా భారతదేశం వెలుగటానికి కారణం అని కొందరు నమ్ముతున్నారన్నారు. భారతదేశం 2014లో డాలర్ 53 నుంచి 59 వరకు ఉంటే, 2023లో డాలర్ 83 చేరిందని, ఇదేనా మోడీ సాధించిన అభివృద్దా అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్న 9 సంవత్సరాలలో రూపాయి విలువ పడిపోయిందని, ఆర్థిక వ్యవస్థలో ఐదవ స్థానానికి చేరిందన్నారు.

భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన నాటి పిదప తదుపరి 67 సంవత్సర కాలంలో ప్రభుత్వాలు రూ.55 లక్షల కోట్లు అప్పు చేస్తే, నరేంద్ర మోడీ కేవలం 9 సంవత్సరాల అధికారంలో ఉండి భారతదేశ అప్పును రూ.155 లక్షల కోట్లకు పెంచారన్నారు. అప్పులు చేసి దేశాన్ని దివాలా తీయించారని పేర్కోన్నారు. కటిక దరిద్ర దేశంగా భారతదేశాన్ని, నైజీరియా స్థాయికి తయారు దిగజార్చారన్నారు.

దేశంలో నిరుద్యోగులు పెరిగారని, అప్పులు పెరిగాయని, ఆర్థిక వ్యవస్థ అధోగతి పాలు అయిందన్నారు. రైతుల సమస్యలు పరిష్కారం కాలేదని, వ్యవసాయక దేశంగా పేరుగాంచిన భారతదేశంలో రైతు కష్టాలు ఎదుర్కొంటున్నాడన్నారు.

పాట్నాలో ఇటీవల నితీష్ కుమార్ ఆధ్వర్యంలో 15 రాజకీయ పార్టీలు సమావేశంలో సిపిఐ జాతీయ నాయకులు డి రాజా కూడా పాల్గొని, దేశాన్ని మోడీ నుండి కాపాడాలని పిలుపునిచ్చారన్నారు. ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీని దేశాన్ని కాపాడుకోవటానికి కలిసికట్టుగా ఉండాలని కోరారని తెలిపారు. మరో 10 పార్టీలు కూడా కలిసేందుకు ముందుకు రావడం శుభపరిణామమన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ నాలుగు సంవత్సరాల పాలన అప్పుచేసి పప్పుకూడు చందంగా ఉందన్నారు. రాష్ట్రంలో నీటిపారుదల, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు నిర్వీరమయ్యాయన్నారు. అరాచకాలు పెచ్చరిల్లి, రాష్ట్రం అధోగతి పాలయ్యే ప్రమాదం దాపురించిందన్నారు. రాష్ట్ర విభజన కాలంలో రూ.51 వేల కోట్లుగా ఉన్న తెలంగాణ ఆదాయం, ప్రస్తుతం రూ.159 వేలకోట్లకు పెరగగా, ఏపీలో ఆదాయం తెలంగాణ కంటే తగ్గిందన్నారు.

పరిశ్రమలు కొత్తవి రాకపోగా, అమర్ రాజా, జాకీ పరిశ్రమలు తరలిపోయాయన్నారు, అధికార పార్టీ ఎంపీ ఏంవివి సత్యనారాయణ తన వ్యాపారాలను హైదరాబాద్కు తరలిస్తానని ప్రకటించారన్నారు. తెలంగాణలో ఐటీ రంగంలో 1 లక్ష 81 వేల కోట్ల ఎగుమతులుండగా, దానిని 2 లక్షల 20 వేల కోట్ల ఐటి వ్యాపారం లక్ష్యంగా తెలంగాణ పెట్టుకున్నదని తెలిపారు. ఏపీలో కేవలం 962 కోట్లకు, 0.14 శాతం చాలా తక్కువగా ఐటి రంగం ఉందన్నారు.

35 శాతం నిరుద్యోగ సమస్య, తొమ్మిది లక్షల కోట్ల అప్పులు, రాష్ట్రం దివాలా దిశగా ఉందన్నారు. పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసి, దుర్మార్గానికి ఒడికడుతున్నారని, వైఎస్ సునీత రెడ్డి వలనే వివేకానందా రెడ్డి కేసు వెలుగులోకి వచ్చిందని తెలిపారు.

విజయవాడ నుండి కమ్యూనిస్టు ఉద్యమం ద్వారా రాష్ట్రంలో అనేక మంది నాయకులు బాధ్యత తీసుకొని కమ్యూనిస్టు ఉద్యమాన్ని బలోపేతం చేశారని గుర్తు చేశారు.భారతదేశాన్ని కాపాడుకునేందుకు కమ్యూనిస్టు ఉద్యమాన్ని పెంపుదల చేసి నిర్మాణం మెరుగుపరుచుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి గాయకులు ఆర్ పిచ్చయ్య, కే నజీర్, వీర్రాజు, విప్లవ అభ్యుదయ గీతాలను ఆలపించారు. సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు ప్రిన్సిపాల్ గా వ్యవహరించగా, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డిప్యూటి సెక్రెటరీ దోనేపూడి శంకర్, బుడ్డి రమేష్ పర్యవేక్షించారు. ఈ రాజకీయ క్లాసులలో ఎన్టీఆర్ జిల్లా మండల నాయకులు, పూర్తి కాలం కార్యకర్తలు, కార్యదర్శలు, నగర నాయకులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE