Home » మహిళా ఉద్యోగులపై రాజకీయ పెత్తనం తగదు

మహిళా ఉద్యోగులపై రాజకీయ పెత్తనం తగదు

– బెదిరింపుల సంస్కృతిని సమాజం హర్షించదు
– గోపాలపురం నియోజకవర్గ మాజీ ఉప సర్పంచి బెదిరింపుల ఆడియో కలకలం
– మహిళా కమిషన్ చైర్ పర్సన్ గజ్జల వెంకట లక్ష్మి

అమరావతి: ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల పట్ల రాజకీయ నేతల పెత్తనం తగదని ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గజ్జల వెంకట లక్ష్మి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గోపాలపురం నియోజకవర్గం జగన్నాధపురం మాజీ ఉప సర్పంచి స్థానిక సచివాలయ మహిళా ఉద్యోగినిపై ఫోన్ లో బెదిరించిన ఆడియో గురువారం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యింది. దీనిపై కమిషన్ చైర్ పర్సన్ తీవ్రంగా స్పందించారు.

ఉద్యోగినుల పట్ల అమర్యాదగా వ్యవహరించడం రాజకీయ నేతలకు మంచిది కాదన్నారు. పౌరసేవలకు పనిచేసే కార్యాలయ ఉద్యోగినులను, నేతల ఇళ్లకు రావాలని కోరడం వంటి కొత్త సాంప్రదాయాలను ప్రోత్సహించ రాదన్నారు. జగన్నాధపురం సచివాలయ ఉద్యోగినికి ఎదురైన ఘటనను మహిళా కమిషన్ తీవ్రంగా ఖండిస్తున్నట్లు చైర్ పర్సన్ గజ్జల వెంకట లక్ష్మి తెలిపారు. ఇలాంటి బెదిరింపుల సంస్కృతిని సమాజం హర్షించదన్నారు. ప్రభుత్వ శాఖల ఉద్యోగినులకు రాజకీయాలను పులిమి వేధించే నాయకుల వైఖరిని ప్రతీ ఒక్కరూ తప్పుబట్టాలని ఆమె పిలుపునిచ్చారు.

సచివాలయాల్లోనూ అంతర్గత ఫిర్యాదుల కమిటీలు
అన్ని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు గ్రామస్థాయి సచివాలయాల్లోనూ మహిళా ఉద్యోగులపై వేధింపులకు సంబంధించి ఫిర్యాదుల పెట్టెలు పెడతామన్నారు. వాటి ద్వారా అందే ఫిర్యాదులపై లోకల్ కంప్లైంట్స్ కమిటీ (ఎల్ సీసీ), అంతర్గత ఫిర్యాదుల కమిటీ విచారించి చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ఆయా కమిటీలను జిల్లా కలెక్టర్లు పర్యవేక్షిస్తారని… ఇకనుంచి కలెక్టరేట్ కార్యాలయాల్లోనూ మహిళా కమిషన్ తరఫున జిల్లాస్థాయి సమీక్షలు జరపనున్నట్లు కమిషన్ చైర్ పర్సన్ గజ్జల వెంకట లక్ష్మి వెల్లడి చేశారు

Leave a Reply