Suryaa.co.in

Andhra Pradesh

నేటి నుండి మూడు రోజులపాటు విజయవాడలో పాలిటెక్ ఫెస్ట్

-సాంకేతిక విద్యా శాఖ సంచాలకురాలు చదలవాడ నాగరాణి
-ప్రారంభోత్సవానికి హాజరుకానున్న బుగ్గన, బొత్సా
-ఎంపిక చేసిన 253 వినూత్న ప్రాజెక్టుల ప్రదర్శన

విద్యార్థుల సృజనాత్మకత, వినూత్న ఆలోచనలను ఉత్తేజపరిచే క్రమంలో గురువారం నుండి మూడు రోజుల పాటు విజయవాడలోని ఎస్ ఎస్ కన్వెన్షన్‌లో రాష్ట్ర స్థాయి పాలీ టెక్‌ఫెస్ట్ – 2022 నిర్వహిస్తున్నట్టు సాంకేతిక విద్యా శాఖ సంచాలకురాలు చదలవాడ నాగరాణి తెలిపారు. మేక్ ఇన్ ఇండియా, నైపుణ్యం ఆంధ్రప్రదేశ్ ప్రచారాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ఆవిష్కరణలు, పరిశోధనలను సులభతరం చేస్తూ పాలిటెక్నిక్ విద్యార్దులకు దిక్సూచిగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆర్దిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్సా సత్యన్నారాయణ ముఖ్య అతిధులుగా హాజరు కానున్నారని పేర్కొన్నారు.

డిప్లొమా విద్యార్థులు టెక్నోక్రాట్‌గా రూపాంతరం చెందడానికి ఇది సోపానం వంటిదని నవంబర్ 14 నుండి 17 వరకు నోడల్ ప్రిన్సిపాల్స్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 13 ప్రదేశాలలో ప్రాంతీయ పాలీ టెక్ ఫెస్ట్ లు నిర్వహించామన్నారు. దాదాపు 4310 మంది విద్యార్థులు టెక్‌ఫెస్ట్‌లో పాల్గొని 1084 వినూత్న ప్రాజెక్టులను ప్రదర్శించారని, వాటిలో ఎంపిక చేసిన 253 ప్రాజెక్ట్‌లు విజయవాడలో ప్రదర్శితం కానున్నాయని నాగరాణి తెలిపారు. రాష్ట్ర స్థాయి పాలీ టెక్ ఫెస్ట్ ఉత్తమ ప్రాజెక్టులకు మొదటి బహుమతిగా లక్ష రూపాయలు, ద్వితీయ బహుమతిగా యాభైవేలు, తృతీయ బహుమతిగా 25వేలు అందిస్తామన్నారు. ప్రతిరోజూ రాష్ట్రంలోని పాలిటెక్నిక్‌లు, పాఠశాల విద్యార్థుల 5000 మంది సందర్శించగలిగేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

LEAVE A RESPONSE