Suryaa.co.in

Features Telangana

ప్రవళిక – (ఆత్మ) హత్య..!

‘ఆత్మహత్యలు వ్యక్తిగతం కాదు, వాటి వెనుక అనేక సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలు వుంటాయి. అవి ప్రభుత్వ విధానాల వైఫల్యం’ అని ఈ దేశంలో గృహహింస బాధిత మహిళల ఆత్మహత్యల నుంచి రైతు ఆత్మహత్యల వరకూ పదేపదే మహిళా, సామాజిక ఉద్యమాలు స్పష్టంగా ప్రకటిస్తూనే వున్నాయి.

పదిహేను వందలకు పైగా విద్యార్థుల బలవన్మరణాల పునాదిగా కదిలిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఆ విషయాన్ని మరింత బలంగా నొక్కిచెప్పింది. అధికారంలో లేనప్పుడు చావుని సెంటిమెంట్ చేసి మరింత మంది ఆ మార్గం పట్టేలా రెచ్చగొడుతూ మాట్లాడిన ప్రస్తుత అధికారపక్ష నాయకులు, ఇప్పుడు వ్యవస్థ వైఫల్యంతో భవిష్యత్తు అయోమయంగా కనిపిస్తున్నప్పుడు నిరాశకు గురయి చనిపోయిన ప్రవళిక బలవన్మరణాన్ని అవమానపరుస్తూ స్టేట్మెంట్లు ఇస్తున్నారు.

విచారణ జరిపి న్యాయస్థానం ముందు సాక్ష్యాధారాలతో దోషులను ప్రవేశపెట్టాల్సిన పోలీసు అధికారులు తామే తీర్పరులుగా మీడియా సమావేశాలు నిర్వహిస్తూ ‘రూల్ ఆఫ్ లా’ని అతిక్రమిస్తున్నారు. సాక్ష్యాధారాలను తుడిచిపెట్టేయడానికి, పూలాభిషేకాలూ- పాలాభిషేకాలూ చేయించుకోవటానికి, కౌబాయ్ ఇమేజ్ తో మీడియాలో చెలామణి కావటానికి ‘ఎన్ కౌంటర్’ కట్టుకథ అల్లగలిగిన వాళ్లకి ఒక అమ్మాయి చావుని ‘అమర్యాద’ చేయటం, ‘అవమానించడం’ నల్లేరు మీద బండి నడక.

అసలే అమ్మాయి, అందునా పేద బహుజన కుటుంబం. ఆ అమ్మాయేమీ తెలంగాణ బతుకమ్మకి బ్రాండ్ అంబాసిడర్ కాదు. అందుకే ఆ అమ్మాయి వ్యక్తిత్వాన్ని కించపరచగల అధికార, ఆధిపత్య, పురుషాధిపత్యం రంగంలోకి దిగుతుంది. తర్వాత ఆ అమ్మాయి ఒక అబ్బాయితో కలిసి హోటల్ లో టిఫిన్ చేస్తున్న సిసిటివి ఫుటేజ్ దొరుకుతుంది. (పోలీస్ స్టేషన్ లలో జరిగే మరియమ్మల చావులు, లక్ష్మిలపై జరిగే చిత్రహింసల సమయంలో ఎందుకో సరిగ్గా అప్పుడే సిసిటివీలు పనిచేయవు!?) లాక్ చేయని సెల్ ఫోన్, అందులో వాట్సప్ చాటింగ్ కూడా వెంటనే దొరుకుతుంది.

ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి పోటీపరీక్షలకు ఎదురుచూస్తూ అనేక విధాల సామాజిక వొత్తిళ్లకు గురవుతూ, పేలటానికి సిద్ధంగా వున్న ప్రెషర్ కుక్కర్ లాంటి నిరుద్యోగుల నుంచి, ప్రతిపక్షాల నుంచి ప్రవళిక మరణంపై తీవ్ర ప్రతిఘటన ఎదురవటంతో దాన్ని అణచటానికి దుర్మార్గమైన కొత్త కథనాలు ముందుకి వస్తాయి. ముందు ఆ అమ్మాయి అసలు ఏ పోటీ పరీక్షలూ రాయలేదంటారు.

‘ఆధునికత’ను అణువణువునా వొంటబట్టించుకున్న మంత్రులు ఆ చావు మీద తమ సంతకాన్ని ట్విటర్ సాక్షిగా పెడతారు. ఇరవై నాలుగు గంటలు కూడా గడవకుండానే మరణానికి దారితీసిన తమ వ్యవస్థీకృత వైఫల్యం పక్కకు వెళ్లిపోయేలా స్క్రిప్ట్ రెడీ అవుతుంది. ‘చావు’ని రాజకీయం చేస్తున్నారంటూ అందరి మీదా తిరుగు దాడి మొదలవుతుంది. బాధిత కుటుంబానికి మేమే సాయం చేస్తున్నామని అంటారు.

అనేక కష్టాలతో తినీతినకా, బిడ్డకు ఉద్యోగం వస్తే బతుకు బాగుపడుతుందని నమ్మిన తల్లిదండ్రులు బిడ్డ శాశ్వతంగా దూరమైందని తెలిసిన మరుక్షణం సహజంగానే కన్నీరుమున్నీరు అయ్యారు. వారి బాధ, వ్యథ, గోడు, మొత్తుకోళ్ళు- అన్నీ ప్రచార, ప్రసార మాధ్యమాల ద్వారా బయటకు వెళ్లడయింది. సోషల్ మీడియా వుండటం వల్ల విస్తృత ప్రపంచానికి కూడా వార్త చేరుకుంది.

రెండు రోజులు కూడా తిరగకుండానే ప్రజల్లో బదనాం అవుతున్నామని మండిపడిన ప్రభుత్వాధినేతల కనుసన్నల్లో ‘తమ బిడ్డ చావుకి పోలీసులు వెల్లడించిన ఫలానా అబ్బాయే కారణమంటూ, తమది కాని కృత్రిమ భాష, యాసలో అతన్ని ఉరితీయాలి’ అంటున్న ప్రవళిక తల్లి, తమ్ముడుల వీడియో బయటకు వచ్చింది. ప్రవళిక చనిపోయిన వెంటనే వచ్చిన వీడియోలలో వారి సహజత్వం, నిర్భయత్వం కనిపిస్తూ వుంటే, తర్వాత వచ్చిన వీడియోల్లో ఒక బెదురు, పదేపదే ఎవరివంకో చూస్తూ వారి ఆదేశాల కనుగుణంగా మాట్లాడుతున్నట్లు బేషుగ్గా కనిపిస్తోంది.

తెలంగాణలో మారుమూల ప్రాంతాల్లో వున్న ప్రతి ఒక్కరూ కూడా మారుతున్న ఈ సంఘటన పూర్వాపరాలను, అందులో ప్రభుత్వం, పోలీసులూ చేస్తున్న రాజకీయాలను చర్చించుకుంటున్నారు. ఆ తల్లిదండ్రులు రెండురోజుల్లో మాట మార్చటం ఏమిటి అని కొంతమంది విసుగుపడొచ్చు కానీ, అధికార బలాన్ని ఎదిరించి పోరాడే శక్తి వాళ్లకుంటుందని మనమేమీ ఆశించాల్సిన అవసరం లేదు. కంటికి రెప్పలా పెంచుకున్న కూతురు శాశ్వతంగా దూరమయితే తల్లడమల్లడమవుతున్న ఆ తల్లిదండ్రులకు, మిగిలిన ఆ ఒక్క కొడుకు భవిష్యత్తు, తమ భద్రత ఏమవుతుందో అనే భయం వుండటం సహజం.

వారిని విమర్శించాల్సిన అవసరం లేదు. పైగా పోలీసులు ఆ అమ్మాయి ప్రేమ విఫలం అవటం వల్లే చనిపోయిందని, అందుకు కారణంగా భావిస్తున్న శివరాం రాథోడ్ అనే అబ్బాయిపై కేసు పెట్టామని, అతను పరారీలో వున్నాడని ప్రకటించారు. ఈ వాదనే నిజమని కాసేపు అనుకుందాం. కానీ ఏదో, ఎక్కడో తేడా కొడుతోంది. అతన్ని ప్రాణాలతో పట్టుకుని (నిజంగా పరారీలో వుంటే!?) న్యాయస్థానం ముందు హాజరుపరుస్తారా? లేక సింగరేణి కాలనీ చిన్నపాప అత్యాచారం కేసులో నేరస్తుడు సాక్షులను పెట్టుకుని తనంతట తానే రైలుపట్టాల మీద పడి ‘ఆత్మహత్య’ చేసుకున్న కథ పునరావృతమవుతుందా? ఎన్నికల వేళ కాబట్టి అలా జరగదని ఆశిద్దాం.

ఇక్కడ చర్చించాల్సింది ప్రవళిక మరణానికి గల తక్షణ కారణం గురించి కాదు. బతుకుని అంతం చేసుకునే నిరాశా నిస్పృహలకి ఒక వ్యక్తి లోనయితే, దానికి కేవలం తక్షణ అంశాలే కారణాలుగా వుండవు. వాటి వెనుక సుదీర్ఘమైన అంశాలు పనిచేస్తూ వుంటాయి. వరంగల్ జిల్లాలో మారుమూల ఒక గ్రామంలో పుట్టిన ప్రవళిక ‘లెక్కలు’ ప్రధాన అంశంగా ఎనభై శాతం మార్కులతో డిగ్రీ చేసింది. మొదటితరం చదువుకున్న బహుజన కులాల బిడ్డ. ఇది తప్పనిసరిగా మనం గుర్తుంచుకుని తీరాలి.

చదువు ఒక్కటే జీవితాన్ని మారుస్తుందని, చిన్నదైనా పెద్దదయినా బతుకు భరోసాకు ప్రభుత్వ ఉద్యోగం వుండాలి అని, అందుకోసం వూరు కాని వూరిలో, తల్లిదండ్రులకు భారం ఎక్కువ కాకుండా తక్కువ ఖర్చుతో వుండే హోస్టళ్లలో వుండి, తినీతినకా కష్టపడి, ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనే లక్ష్యంతో పోటీ పరీక్షలకు తయారవుతోంది. అందుకే, కేవలం ఒక పరీక్షకు మాత్రమే కాదు.. అనేక పరీక్షలకు తయారవుతోంది.

పదేపదే వాయిదా పడుతున్న పరీక్షలు, స్పష్టత లేని, జీవన భరోసా కల్పించని ప్రభుత్వ విధానాలు నిరుద్యోగ యువతని ఒక నిరాశలోకి నెడుతున్నాయి. ‘అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా సాధ్యం?’ అని గంభీరంగా ఇప్పుడు కొంతమంది మేథావులు ప్రశ్నిస్తూ వుండొచ్చు. కానీ, ‘నీళ్లు- నిధులు- నియామకాలు’ అంటూ ఉవ్వెత్తున సాగిన ఉద్యమాన్ని అప్పుడు నిలబెట్టింది, ఇప్పుడు తాము కూర్చున్న అధికార పీఠాలకి పునాది ఈ సబ్బండ కులాల, వర్గాల విద్యార్థులూ, నిరుద్యోగులే అని మర్చిపోతే ఎలా?

చివరగా, ప్రవళిక బలవన్మరణంలో నిరాశాజనకంగా వున్న తమ భవిష్యత్ చిత్రపటాన్ని నిరుద్యోగులు చూశారు. అందుకే అంత తీవ్రంగా స్పందించారు. అధికార వ్యవస్థ తమ ఈ వైఫ్యల్యాన్ని హుందాగా ఒప్పుకోకుండా ప్రవళిక వ్యక్తిత్వాన్ని బజారులో పెట్టి మళ్లీమళ్లీ చంపటం సహించరానిది.

ఈ సందర్భంలో బతుకు భరోసా నిచ్చే రాజకీయ ఆచరణ, కుల మత విద్వేషాలకు, అసమానత్వాలకు తావులేని పాలన, జెండర్ వివక్షను సమూలంగా నిర్మూలించే కార్యాచరణ, అందుకోసం పాటుపడే చిత్తశుద్ధి వున్న పాలకులను జాగ్రత్తగా ఎంచుకోవటం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వారే కాకుండా, అన్ని రాజకీయ పార్టీల కార్యాచరణను పై విధంగా వుండేలా డిమాండ్ చేయటం కూడా మన బాధ్యతే అని మరొక్కసారి గుర్తుచేసుకోవటం ఇప్పుడు అత్యంత అవసరం.

– రామకృష్ణ మనిమద్దె

LEAVE A RESPONSE