Suryaa.co.in

Andhra Pradesh

కరువుపై ఐక్యపోరాటాలకు సిద్ధం

` బలమైన వైసీపీ కేంద్రానికి సాగిలపడిరది: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
` జాతీయ విపత్తుగా ప్రకటించాలి: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
` కరువు మండలాలను ప్రకటించటానికి సీఎంకు నమోషీ: మాజీ మంత్రి దేవినేని ఉమా
`మోదీ, జగన్‌ కలిసి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు
`సీపీఐ దీక్షకు మద్దతు ప్రకటించిన రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు, ప్రజాసంఘాలు
` ముగిసిన సీపీఐ 30 గంటల నిరసన దీక్ష

విజయవాడ: రాష్ట్రంలో కరువు పరిస్థితులను ఎదుర్కోవటానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఐక్యపోరాటాలకు సిద్ధం కావాలని వక్తలు అభిప్రాయపడ్డారు. కరువు సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, కృష్ణాజలాల పున:పంపిణీకై కేంద్రం విడుదల చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ రద్దు చేయాలని సీపీఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో చేపట్టిన 30 గంటల నిరసన దీక్షకు రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు, ప్రజాసంఘాల నేతలు మద్దతు తెలిపాయి. విజయవాడ ధర్నా చౌక్‌ వద్ద రెండవ రోజు మంగళవారం జరిగిన దీక్షలో ఆయా పార్టీల నేతలు, సంఘాల ప్రతినిధులు పాల్గొని సంఫీుభావం ప్రకటించారు.

దీక్ష ముగింపు సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మాట్లాడుతూ ఏపీలో దాదాపు 18 జిల్లాలో కరువు ఉందన్నారు. సీపీఐ బృందాలు 18 జిల్లాఓ పర్యటించి కరువు పరిస్థితిని పరిశీలించిందన్నారు. దేశంలో వైసీపీ బలమైన పార్టీగా, పటిష్టమైన ప్రభుత్వంగా ఉండి కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రాన్ని నిలదీయలేకపోతుందన్నారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తన కుటుంబాన్ని కాపాడుకోవటం కోసం కేంద్రం వద్ద సాగిలపడుతున్నాడని ఆరోపించారు.

సుదీర్ఘకాలం బైయిల్‌పై ఉన్న వ్యక్తిగా సీఎం జగనే అన్నారు. కేంద్రం దయాదాక్షిణ్యాలపై ఆధారపడిన జగన్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ప్రయోజనాలను మోదీ దెబ్బతీసేలా నిర్ణయాలు తీసుకున్నా మాట్లాడటం లేదన్నారు. రాష్ట్రంలో కరువు పరస్థితిని ఎదుర్కొవటానికి అవసరమైతే రాష్ట్ర బంద్‌కు పిలుపునివ్వాలని సూచించారు.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్తగా కరువు మండలాలను ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. రైతుల రుణమాఫీ చేయాలని, వలసల నివారణకు ఉపాధి హామీ పనులు ప్రారంభించాలని కోరారు. కేంద్రం కూడా ఏపీలో కరువును పరిశీలించి జాతీయ విపత్తుగా ప్రకటించాలన్నారు. కరువు బారిన పడిన ప్రజలను ఆదుకునేందుకు తమతో కలిసి వచ్చే రాజకీయ పార్టీలను, ప్రజాసంఘాలను కలుపుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కరువు మండలాలను ప్రటించటానికి ముఖ్యమంత్రి జగన్‌కి నమోషీగా ఉందన్నారు. వాటర్‌ మేనేజ్‌మెంట్‌ తెలియని మంత్రులుగా వ్యవహరించటం రాష్ట్ర దౌర్భాగ్యం అన్నారు. ఇరిగేషన్‌ మంత్రి ఇరిటేషన్‌ మంత్రిగా మారాడని విమర్శించారు. ఏపీ జెన్‌కోలో లక్ష కోట్ల రుపాయల పంపకాలు జరిగాయని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న ఆస్తులను అమ్మేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వందో రోజుల్లో వైసీపీ ప్రభుత్వాన్ని సముద్రంలో కలిపేస్తామన్నారు.

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో జగన్‌మోహన్‌రెడ్డి కూడబలుక్కుని రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాలు, మతం అంశాలపై తప్ప మోదీ ప్రభుత్వం దేశంలోనే కరువు కటకాలు ఉన్నా పట్టించుకోవటం లేదన్నారు. కేంద్ర బృందాలు వచ్చి పరిశీలన చేసి నివేదిక ఇవ్వాల్సిన ఉంటే ఏమాత్రం పట్టించుకోవటం లేదన్నారు. మణిపూర్‌ అల్లర్లు గురించి స్పందించలేదన్నారు. అందరూ పలస్తీనాకు మద్దతు ఇస్తే మోదీ ఇజ్రాయేల్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ కృష్ణా జలాల పున:పంపిణీపై కేంద్రం ఇచ్చిన గెజిట్‌ నోటిఫికేషన్‌ వల్ల మిగులు జలాల్లో ఒక్క టీఎంసీ నీరు కూడా ఏపీకి కేటాయించకపోవటం అన్యాయం అన్నారు. పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో తెలియదని చెపుతున్న వైసీపీ ప్రభుత్వం మిగతా ప్రాజెక్టుల గురించి పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. జగన్‌ పాలన తుగ్లక్‌ పాలనను తలపిస్తుందని విమర్శించారు.

సీపీఐ (ఎంఎల్‌) లిబరేషన్‌ రాష్ట్ర నాయకులు హరనాధ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో కరువుతో ప్రజలు అల్లాడుతున్నా జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పట్టించుకోవటం లేదని విమర్శించారు. పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, జేవీ సత్యనారాయణమూర్తి, కార్యదర్శివర్గ సభ్యులు జల్లి విల్సన్‌, జి.ఓబులేసు, పి.హరినాధరెడ్డి, అక్కినేని వనజ, కేవీవీ ప్రసాద్‌, డి.జగదీశ్‌, పి.రామచంద్రయ్య, జంగాల అయజ్‌కుమార్‌, డేగా ప్రభాకర్‌ లతో రాజధాని అమరావతి జేఏసీ నాయకులు కల్లం రాజశేఖర్‌రెడ్డి, సాగునీటి సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్‌ ఆళ్ల గోపాలకృష్ణ, అమరావతి బహుజన జేఏసీ నాయకులు పోతుల బాలకోటయ్య, ప్రకాశం జిల్లా అభివృద్ధి వేదిక అధ్యక్షులు చుండూరు రంగారావు, పాటు వివిధ ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌ అండ్‌ ఏజెంట్స్‌ అసోసియేషన్‌ నాయకులు తిరుమలరావు వివిధ, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE