– బ్రాండెడ్ మందులతో పోలిస్తే జనరిక్ మందుల ధరలు చాలా తక్కువ
– జనరిక్ మందుల పట్ల గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది
– పేదల ఆరోగ్యం పట్ల గత ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
– రాష్ట్రంలో 215 ప్రధానమంత్రి భారతీయ జనౌ షధి కేంద్రాలు మాత్రమే ఉన్నాయి
– ప్రతి మండల కేంద్రంలో జనౌషధి కేంద్రాల్ని ప్రారంభించాలని సిఎం చంద్రబాబు నిర్ణయించారు
– శాసన సభలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి
అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి భారతీయ జనౌషధి కేంద్రాలు దేశవ్యాప్తంగా 13,822 ఉండగా, ఆంధ్రప్రదేశ్ లో 215 మాత్రమే ఉన్నాయని, ఇది పూర్తిగా గత ప్రభుత్వ నిర్లక్ష్యమేనని వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. జనరిక్ మందులపై గత ప్రభుత్వం దృష్టి సారించలేదని, ప్రజల ఆరోగ్యం పట్ల వారికి చిత్తశుద్ధి లేదని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో జనరిక్ మందులపై బుధవారంనాడు శాసనసభలో సభ్యులడిగిన ప్రశ్నకు మంత్రి సత్యకుమార్ సమాధానం చెప్పారు. పేదల ఆరోగ్య సంరక్షణకు సంబంధించి చాలా ముఖ్యమైన ప్రశ్నలేవనెత్తినందుకు, మంత్రి ఈ సందర్భంగా వారిని అభినందించారు. రాష్ట్రంలో ప్రత్యేకంగా 325 జనరిక్ మందుల దుకాణాలుండగా, ఇందులో ప్రధానమంత్రి జనౌషధి కేంద్రాలు 215, అన్న సంజీవని మొదలైనవి 73, ఎన్‌జిఓలు మరియు ఇతర సంస్థలకు నడుపుతున్నవి 37 ఉన్నాయన్నారు.
ప్రస్తుతం 34,761 చిల్లర మందుల దుకాణాల్లో బ్రాండెడ్ మందులతో పాటు జనరిక్ మందుల్ని కూడా విక్రయిస్తున్నారన్నారు. జనరిక్ మందుల గురించి ప్రజల్లో అవగాహన తక్కువగా ఉన్న మాట వాస్తవమేనని, ప్రైవేట్ ఆసుపత్రుల్లో డాక్టర్లు కూడా జనరిక్ మందుల్ని రాయడంలేదని మంత్రి వివరించారు. అన్ని మండల కేంద్రాల్లో ప్రధానమంత్రి జనౌషధి కేంద్రాల్ని ప్రారంభించేలా యువతను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల నిర్ణయం తీసున్నారన్నారని మంత్రి సభకు తెలిపారు. తద్వారా యువతకు ఉపాధి కల్పించాలన్నది ప్రభుత్వం భావిస్తోందన్నారు.
అన్ని ప్రభుత్వ ఆరోగ్య సంస్థల్లో వినియోగం కోసం 560 రకాల అనుమతి పొందిన అత్యవసర మందుల జాబితా ప్రకారం జనరిక్ మందుల్ని సేకరించి, సరఫరా చేస్తున్నామన్నారు. జనరిక్ మందుల దుకాణాల లైసెన్స్ లకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ 15 రోజుల్లో లైసెన్స్‌లు మంజూరు చేయడం ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ జనరిక్ మందుల్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సమర్ధవంతమైన చర్యల్ని వైద్య ఆరోగ్య శాఖ తీసుకుంటోందన్నారు.
జనరిక్ మందుల నాణ్యత గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి పెద్ద ఎత్తున ప్రచార(ఐఇసి-ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్) కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామన్నారు, జనౌషధి దుకాణాల్ని ప్రారంభించేందుకు గాను నిరుద్యోగ ఫార్మాసిస్టుల్ని ప్రోత్సహించాలని ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చామని మంత్రి పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో జనరిక్ మందుల్ని మాత్రమే రాస్తారని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బ్రాండెడ్ మందుల్ని కొనుగోలు చేయాలన్న ఆదేశాలిచ్చామని మంత్రి సత్యకుమార్ యాదవ్ సభకు వివరించారు.
17 టీచింగ్ ఆసుపత్రులతో పాటు జిల్లా ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో కూడా జనరిక్ మందుల దుకాణాల్ని ప్రారంభిస్తున్నామన్నారు. జనరిక్ మందుల విషయంలో ప్రజల్లో అపోహలున్నమాట వాస్తవమేనని, బ్రాండెడ్, జనరిక్ మందుల మధ్య తేడా ఎక్కువ ఉందనే అపోహ కూడా ఉందన్నారు. అయితే బ్రాండెడ్, జనరిక్ మందుల మధ్య ఎటువంటి తేడా లేదన్న విషయం ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
ఆయా మందుల కంపెనీలు రీసెర్చ్ మరియు డెవలప్మెంట్ (ఆర్ అండ్ డి) చేసి, రిపీటెడ్ గా క్లినికల్ ట్రయల్స్ చేయడం వల్ల ఆ ఖర్చు ఎక్కువగా ఉంటుందన్నారు. మందుల పేటెంట్ అయ్యాక ఎవరైనా సరే జనరిక్ మందుల్ని తయారు చేసుకోవచ్చన్నారు. జనరిక్ మందుల్లోని పదార్థాలు, బలం, డోసేజ్, పనితీరు బ్రాండెడ్ మందులతో సమానంగానే ఉంటాయనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.
దేశంలో 2 లక్షల 10 వేల కోట్ల రూపాయల మేర విలువైన మందులు విక్రయిస్తుండగా, రాష్ట్రంలో 10 వేల కోట్ల రూపాయల మేర విక్రయాలు జరుగుతున్నాయన్నారు. ఇందులో కేవలం 7 శాతం మాత్రమే జనరిక్ మందుల విక్రయం ఉండడం దౌర్భాగ్యమని మంత్రి అన్నారు. బ్రాండెడ్ మందులతో పోలిస్తే జనరిక్ మందుల ధరలు చాలా తక్కువగా ఉంటాయని, 30 నుండి 70 శాతం మేర తక్కువ ధర ఉంటాయన్నారు. దీనిపై ప్రత్యేక దృష్టిని సారించాల్సిన అవసరం ఉందన్నారు.
బ్రాండెడ్ మందుల ఎంఆర్‌పీ విషయంలో సరైన నిబంధనలు లేనందున ఈ తేడాలుంటున్నాయన్నారు. అందువల్ల డిస్కౌంట్ రేట్లలో మందుల దుకాణాల్లో అమ్ముతున్నారన్నారు. జనరిక్ మందుల దుకాణాల్లో కచ్చితంగా జనరిక్ మందుల్ని మాత్రమే అమ్మాలనీ, బ్రాండెడ్ మందుల్ని అమ్మే వారిపై డ్రగ్ కంట్రోల్ అథారిటీ (డిసిఎ) ద్వారా కఠిన చర్యల్ని తీసుకుంటామని మంత్రి సభకు వివరించారు.
ప్రభుత్వాసుపత్రుల్లో జనరిక్ మందులే ఇస్తారని, ఎపిఎంఎస్ ఐడిసి కూడా జనరిక్ మందుల్నే కొనుగోలు చేస్తుందని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే డిసెంట్రలైజ్డ్ ఫండ్ ద్వారా కొంత మొత్తాన్ని ఖర్చు చేసి బ్రాండెడ్ మందులు కొనుగోలు చేసేందుకు గాను సూపరింటెండెంట్లకు ఆదేశాలిచ్చామన్నారు. పేదల జేబు నుండి ఖర్చు తక్కువ ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని, ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు.