Suryaa.co.in

National

ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ

లోక్‌స‌భ‌ మూడో దశ పోలింగ్‌లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గాంధీనగర్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని అహ్మదాబాద్‌లో ఓటేశారు. ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైన కాసేపటికే ఆయన రాణీప్‌ ప్రాంతంలోని నిషాన్‌ హయ్యర్ సెకండరీ స్కూల్‌ లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌కు చేరుకుని ప్ర‌ధాని ఓటు వేశారు. అనంత‌రం ఓట‌ర్ల‌ను క‌లుస్తూ ఆప్యాయంగా ప‌ల‌క‌రించారు. వారితో క‌ర‌చాల‌నం చేశారు.

ఈ క్ర‌మంలో ముందు కంటిచూపులేని ఓ యువ‌తి ద‌గ్గ‌రికి వెళ్లి మాట్లాడారు. ఆమె ప్ర‌ధానిని ద‌గ్గ‌ర‌కు తీసుకునేందుకు ప్ర‌య‌త్నించ‌గా ఎస్‌పీజీ గార్డ్ అడ్టుకున్నారు. దీంతో ప్ర‌ధాని అత‌డిని వారించారు. అనంత‌రం మోదీ ఓ చిన్నారిని ఎత్తుకుని కొద్దిసేపు ఆడించి, ముద్దాడారు.

ఆ త‌ర్వాత ఓ వృద్ధురాలు మోదీకి ఆప్యాయంగా రాఖీ క‌ట్టారు. ఇలా ఓటు వేసిన త‌ర్వాత ప్ర‌ధాని మోదీ పోలింగ్ బూత్ వెలుపల పెద్ద సంఖ్యలో గుమికూడిన జనాలతో మ‌మేకమ‌య్యారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

మ‌రోవైపు ప్ర‌ధాని మోదీ ఓటు హ‌క్కు వినియోగించుకున్న త‌ర్వాత దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశిస్తూ మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ కోరారు. ప్రజాస్వామ్యంలో ఓటుకు చాలా ప్రాధాన్యత ఉందని, అందుకే అందరూ తరలి వచ్చి ఓటు వేయాలని దేశ పౌరులను కోరారు.

LEAVE A RESPONSE