– గైడ్ ఎవరో తెలియదు, డాక్టోరల్ కమిటీ ఉండదు
– ఏ ఒక్క కోర్సుకు ఐ కార్ అనుమతి లేదు
– చోద్యం చూస్తున్న ఉన్నత విద్యాధికారులు
– రీసర్చ్ సూపర్వైజర్లు లేకున్నా పి హెచ్ డి లు
రౌతు మెత్తగుంటే గుర్రం మూడు కాళ్లతో పరుగెత్తిందంటారు. యుజిసి, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయ్యర్ ఎడ్యుకేషన్ ఇతర నియంత్రణ సంస్థల పర్యవేక్షణ లేకపోవడంతో ప్రైవేటు విశ్వవిద్యాలయాల అడ్డు అదుపు లేకుండా పోయింది. అడుగు వ్యవసాయ భూమి లేకపోయినా అగ్రికల్చర్, హార్టికల్చర్, పారెస్ట్రీ, అగ్రికల్చర్ మేనేజిమెంట్ కోర్సులు నడుపుతూ ఎలాంటి గుర్తింపు లేకున్నా, విద్యార్థుల జీవితాలను అంధకారంలోకి నెడుతున్న విశ్వవిద్యాలయాలపై ప్రభుత్వాలకు అదుపు లేకుండా పోయింది. మరియొక వైపు ఇలాంటి చెత్త కళాశాలలను అడ్మిషన్ పోర్టల్ లో ఉంచి ప్రభుత్వమే వీటి సీట్లను భర్తీ చేస్తున్నారు.
దొంగ సర్టిఫికెట్లు, దొంగ చలాన్లు ముద్రించిన వారిపై ఉక్కుపాదం మోపుతున్న ప్రభుత్వం, ఇంకొకవైపు బడా బాబులు అన్ని అరాచక పద్ధతులలో అక్రమంగా డబ్బు దండుకుంటుంటే వారిని ప్రోత్సహిస్తున్నారు. దొంగ సర్టిఫికెట్లు, దొంగ నోట్ల చలామణి ఎంత నేరమో .. విద్యా సంస్థలను, విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేసి అమాయక విద్యార్థులనుండి కోటాను కోట్ల డబ్బు వసూలు చేసి, మూడు నాలుగు సంవత్సరాల తరువాత ఎందుకు పనికిరాని ఎక్కడ గుర్తింపు లేని సర్టిఫికెట్ ఇచ్చి బయటకు పంపుతున్నా, ఏమాత్రం చర్యలకు ఉపక్రమించని ఉన్నత విద్య అధికారులు అంతే నేరానికి పాల్పడుతున్నారు.
డబ్బే పరమావధిగా భావించే ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. రాష్ట్రంలో కొన్ని నర్సింగ్, బి ఎస్సి అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ కళాశాలలు, గైడ్ ఎవరో తెలియదు, డాక్టోరల్ కమిటీ ఉండదు, ఉంటున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సువిశాలమైన అత్యాధునిక వసతులతో శాశ్వత భవనాలు అని ప్రచారం చేస్తూ ఏడు సంవత్సరాలుగా కాలం వెళ్ళబుచ్చుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. ఇలాంటి విశ్వవిద్యాలయంలో ఎక్కడా లేని దిక్కుమాలిన కోర్సులు ఉంటున్నాయి . బి ఎస్సి అగ్రికల్చర్, బి ఎస్సి హార్టికల్చర్, బి ఎస్సి ఫారెస్ట్రీ, ఎంబిఏ అగ్రికల్చర్.
ఏ ఒక్క కోర్సుకు ఐ కార్ అనుమతి లేదు. ఇండియన్ కౌన్సిల్ ఫార్ అగ్రికల్చర్ రీసర్చ్ గుర్తింపు ఉండాలంటే కనీసం వంద ఎకరాల వ్యవసాయ భూమి ఉండాలి. ఇలాంటి విశ్వవిద్యాలయాలకు సెంటు భూమి లేదు, కళాశాలలో అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ కోర్సులు బోధించడానికి పట్టుమని నలుగురు అధ్యాపకులు ఉండరు. ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, కులపతులు ఎక్కువగా నియంత్రణ మండళ్లల్లో పని చేసి, రిటైర్ అయిన వ్యక్తులు నియమించడం జరుగుతుంది.
ఎందుకంటే వీరి పరపతి ఉపయోగించి కోర్సులకు అప్రూవల్ తెస్తారని ధీమా. ఇలాంటి విశ్వవిద్యాలయంలో మూడు సంవత్సరాల విద్యనభ్యసించే విద్యార్థులకు వ్యవసాయం పై కనీస అవగాహన ఉండదు, అగ్రానమి, సాయిల్ సైన్స్, క్రాప్ ప్రొడక్షన్, హార్వెస్టింగ్, పెస్ట్ కంట్రోల్ , ప్లాంట్ పాథాలజీ, వీడ్ మేనేజిమెంట్, పెస్ట్ మేనేజ్మెంట్ పై అవగాహన లేదు. సుదూర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి పిల్లలు ఇలాంటి విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసిస్తున్నారు.
మూడు నాలుగు సంవత్సరాల తరువాత ఐ కార్ గుర్తింపు లేని, వ్యవసాయం పై కనీస అవగాహన లేని విద్యార్థులు వీళ్ళీచ్ఛే సర్టిఫికెటు తో ఎవరికి ఉద్యోగం రాదు. కనీసం వీరికి ఏమైనా వ్యవసాయం, ఫలసాయం, ఫారెస్ట్రీ పై ఏమైనా ప్రవేశం ఉన్నదా అంటే అది లేదు. రాష్ట్రంలో చాలా ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, రీసర్చ్ సూపర్వైజర్లు లేకున్నా పి హెచ్ డి లు నడుపుతున్నాయి. రీసర్చ్ విభాగం ఉండదు, గైడ్లు ఉండరు, 2020 లో చేరిన విద్యార్థికి 2018 లో అడ్మిషన్ అయినట్లు చేసి 2021 లో పిహెచ్డి ప్రధానం చేస్తున్నారు. ఎక్కడో ఉత్తరాదిన ఇలాంటి బోగస్ విశ్వవిద్యాలయాలు ఉండేవి.
అనంతపురంలో వెలసిన ప్రైవేటు విశ్వవిద్యాలయం పట్టుమని ముగ్గురు డాక్టరేట్లు లేరు 28 కోర్సులలో పిహెచ్డి ప్రవేశ పరీక్షలు నిర్వహించింది. ఐదువేలు అప్లికేషన్ ఫీజు, 25000 అడ్మిషన్ ఫీజు, ప్రతి సంవత్సరం లక్ష రూపాయలు ట్యూషన్ ఫీజు. విదేశాల నుంచి విద్యార్థులు రీసర్చ్ స్కాలర్లు గా ఉన్నారు. ఇప్పటికైనా మొద్దు నిద్ర మాని ఇలాంటి పనికిమాలిన విద్యాలయాల భరతం పట్టమని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలను కోరడమైనది. వినే వాడు వెర్రి వెంగళప్ప అయితే హరికథ చెప్పే వాడు పడుకొని చెప్పాడు. ఇంటర్మీడియెట్ బైపీసీ పాసైన విద్యార్థులకు మెడిసిన్ సీట్లు చాలా తక్కువ, నీట్ కోచింగ్ వెళ్లి సఫలీకృతులు కాని రిపీటర్స్ ఇలాంటి చెత్త కోర్సులలో చేరుతున్నారు.
బిహెచ్ఎంఎస్ ఎలెక్ట్రో హోమియోపతి, ఆయుర్వేద రేఖీ ఆయుష్ లో లేని ప్రభుత్వ గుర్తింపు లేని కోర్సులలో చేరి విద్యార్థులు విలువైన సమయాన్ని డబ్బు వృథా చేసుకుంటున్నారు. మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపంగి నూనె అన్న చందంగా మారింది విశ్వవిద్యాలయాల పరిస్థితి. అసలు నిధులు లేక, రీసర్చ్ గ్రాంట్లు, బ్లాక్ గ్రాంట్లు లేక, అధ్యాపకులు లేక కొట్టుమిట్టాడుతున్న విశ్వవిద్యాలయాలు ఎవరికి ఉపయోగపడని కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. జేఎన్టీయూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఏర్పడి 13 సంవత్సరాలు అవుతున్న, సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది.
నాలుగు వందల అరవై అధ్యాపకులు ఉండవలసిన చోట కేవలం 52 మంది అధ్యాపకులతో కాలం వెల్లదీస్తున్నారు. వందకు పైగా అదనపు బాధ్యతలు – రిజిస్ట్రార్, రెక్టార్ , డైరెక్టర్ డిఎపి, అకడమిక్ అడిట్, స్కిల్ డెవలప్మెంట్, ఎవాల్యుయేషన్, కంట్రోల్ల్ర లు, ప్రిన్సిపాల్స్ , వైస్ ప్రిన్సిపాల్, ప్లేసెమెంటాఫిసర్ ఇలా చెప్పుకుంటూ పోతే తనివి తీరదు. ఇంతవరకు నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడేషన్ రాక సతమతమవుతోంది. ఐదు సంవత్సరాల కిందట జరిగిన నియామకాలు లోపభూయిష్టంగా ఉన్నాయి అందులో కేవలం ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు ప్రాధాన్యం కల్పించారని చెప్తున్నా ఇంతవరకు దొడ్డి దారిన వచ్చిన వారిపై చర్యలకు ఉపక్రమించింది లేదు.
విశ్వవిద్యాలయానికి రీసర్చ్ గ్రాంట్లు లేవు, ఉన్న అరకొర నిధులు బ్లాక్ గ్రాంట్లు జీతభత్యాలకు సరిపోవడం లేదు. ఒక్కటంటే ఒక్కటి రీసర్చ్ గ్రాంట్లు లేవు, అధ్యాపకులు మేజర్, మైనర్, మోర్డ్ రాబ్స , ఉమెన్ సైంటిస్ట్ గ్రాంటులు లేని ఏకైక విశ్వవిద్యాలయం. 20 కి పైగా ఎంటెక్ ప్రోగ్రాంలు పెట్టారు సరిపడా అధ్యాపకులు లేరని నేషనల్ అక్రిడేషన్ బోర్డు తేల్చిచెప్పిన ఢిల్లీలో ఏఐసీటీఈ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు కానీ లోపం ఎక్కడుందో గ్రహించడం లేదు. ఎంసీఏ, ఎంబీఏ కోర్సులు పెట్టి పాతిక సంవత్సరాలు కావస్తున్నా శాశ్వత అధ్యాపకులు నియమించని విశ్వవిద్యాలయం.
ఇక ప్రైవేటు కళాశాలలో పీజీ చదివే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించక చాలా కళాశాలలు మూతపడ్డాయి. 2015 నుంచి యూజీసీ రీసెర్చ్ కోర్సులు కఠిన నిబంధనలు పెట్టిన తుంగలో తొక్కి డిగ్రీలు ప్రధానం చేస్తున్నారు. రీసర్చ్ లో చేరిన విద్యార్థులు మరియు సూపర్వైజర్ అదే విశ్వవిద్యాలయానికి చెంది ఉండాలి కానీ హైదరాబాదులో ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో పనిచేసే అధ్యాపకులు గుంటూరు, విజయవాడ, విశాఖ కు చెందిన విశ్వవిద్యాలయాలలో ఫుల్ టైం పిహెచ్డి చేస్తున్నారు.
దాదాపు రెండు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న మగధ, మేవార్, మిథిలా, సన్ రైజ్, జబల్పూర్ జంబనియా, టైబ్రేవాలా , శిక్ష ఓ అనుసంధాన, జైపూర్ నేషనల్ యూనివర్సిటీ, సామ్ హిగ్గిన్స్ అండ్ బోథమ్ యూనివర్సిటీ, సెయింట్ పీటర్స్ యూనివర్సిటీ, జై ప్రకాష్ నారాయణ యూనివర్సిటీ, శ్రీ సాయి, సత్య సాయి మెడికల్ యూనివర్సిటీ, శ్రి వెంకటేశ్వర యూనివర్సిటీ – గాజ్రోల ఇలా ఎన్నో పాల్తూ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. కోటాను కోట్ల రూపాయలు డబ్బు కట్టి పరిశోధకులు చేరుతున్నారు. గైడ్ ఎవరో తెలియదు, డాక్టోరల్ కమిటీ ఉండదు, ఈ విశ్వవిద్యాలయంలో విభాగాలు ఉండవు, అధ్యాపకులు ఉండరు. వీరికి తెలిసిందల్లా డబ్బు వసూలు చేసుకోవడమే.