భట్టికి అవకాశానికి అవకాశం!?

తెలంగాణ లో కాంగ్రెస్ ను విజయ తీరాలకు నడిపించిన సారధులుగా గుర్తింపు పొందిన ఇద్దరిలో ఒకరైన మల్లు భట్టి విక్రమార్కను ముఖ్యమంత్రి పదవి వరించే అవకాశాలు లేవు అని చెప్పడానికి అవకాశం లేదు.

అటు రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష హోదాలో ; ఇటు భట్టి విక్రమార్క కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ లీడర్ హోదాలోనూ బాధ్యత తీసుకుని శ్రమించారు. ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి పేరే మీడియా లోనూ, సోషల్ మీడియా లోనూ మారుమోగి పోతున్నది. సోమవారమే ప్రమాణ స్వీకారం అన్నారు. అప్పటికప్పుడు రాజ్ భవన్ లో ఏర్పాట్లు చేశారు. లీకులతో టీవీ ఛానళ్ళు ఓ రేంజ్ లో ఇరగ దీశాయి.

నిజానికి, ఢిల్లీ పెద్దలు అయిదు నిముషాల్లో రేవంత్ రెడ్డి పేరును క్లియర్ చేసి ఉండాల్సింది. కానీ చేయలేదు. ఎందుకంటె, తెలంగాణ ఉత్సాహం తెలంగాణ కాంగ్రెస్ వారిది. జాతీయ ధృక్పథం కాంగ్రెస్ ది. అందుకే, రాష్ట్ర కాంగ్రెస్ వాదులు ఆశించినట్టు ఢిల్లీ నుంచి ఏ ప్రకటనా విడుదల కాలేదు. దానితో, రాజ్ భవన్ కార్యక్రమం వాయిదా పడింది.

కర్ణాటక లో కూడా డీ కే శివకుమారే కాంగ్రెస్ గెలుపులో అతి ముఖ్య పాత్ర పోషించారు. కానీ, సిద్ధ రామాయ్యను చేశారు. రెండున్నరేళ్ల తరువాత శివకుమార్ ను చేస్తామని ఢిల్లీ పెద్దలు చెప్పి ఒప్పించారు. అదే ఫార్ములాను తెలంగాణ కు కూడా వర్తింప చేస్తారా అనిపిస్తున్నది, ప్రకటన చేయడం లో జరుగుతున్న జాప్యం గమనిస్తుంటే.

బీహార్ లో జరిగిన జన గణన ను, దాని వివరాలను రాహుల్ గాంధీ ఆహ్వానించారు. ఎస్ సీ లు, ఓబీసీ లకు కాంగ్రెస్ నిలబడుతుందని ఆయన ప్రకటించారు కూడా. మరో మూడు, నాలుగు నెలల్లో జాతీయ ఎన్నికలు జరగనున్న తరుణం లో…., కాంగ్రెస్ కు దక్కిన ఒక్కగాని ఒక్క రాష్ట్రం లో ముఖ్యమంత్రి పదవి ఒక అగ్రవర్ణ నేతకు అప్పగిస్తారా అన్న అనుమానం లేక పోలేదు. పక్క రాష్ట్రం లో కూడా మరో రెడ్డి నేత అధికారంలో ఉన్నారు. అంటే రెండు తెలుగు రాష్ట్రాల లోనూ అగ్రవర్ణాల చేతుల్లో ఉన్నట్టు అఉతుందనే భావన….; రేవంత్ రెడ్డి కి అడ్డం పడవచ్చునేమో అనిపిస్తున్నది.

అందుకే, భట్టి విక్రమార్క కు అవకాశం లేకపోలేదనే భావన కూడా ఉంది. భట్టి…. పుట్టు కాంగ్రెస్ వాది. సౌమ్యుడు. దూకుడు లేదు. దళిత వర్గాలకు చెందిన నేత. భట్టి కి ముఖ్యమంత్రి పదవి అప్పగించడం ద్వారా…. దేశ వ్యాప్తం గా దళితుల దృష్టిని కాంగ్రెస్ ఆకర్షించే అవకాశాలు ఉన్నాయి. అందుకే, తెలంగాణ లో ఏమి చేయాలి అనే విషయమై కాంగ్రెస్ పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నట్టు కనబడుతున్నది.

చివరికి, కర్ణాటక ఫార్ములా నే తెలంగాణ లో అమలు చేసినా ఆశ్చర్యం లేదు. అయితే, ఒక అంచనా మట్టుకు వాస్తవానికి దగ్గరగా ఉండవచ్చు. వీరిద్దరిలో ఒకరు ముఖ్య మంత్రి అయితే, రెండవ వారు డిప్యూటీ ముఖ్యమంత్రి అవుతారు. అయితే, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ లో కిటకిటలాడుతున్న మిగిలిన ముదుళ్ళు ఏమి చేస్తారనేది ఆసక్తికరం.

భోగాది వేంకట రాయుడు
medhomadhanam@gmail.com

Leave a Reply