Suryaa.co.in

Family

అమ్మానాన్న.. తలరాతనూ మార్చగలరు

-టీనేజర్లకు వారే కావాలి తొలి స్నేహితులు
-ఉద్వేగాల నియంత్రణ నేర్పించండి
-తప్పు చేసినప్పుడు ఎలా వ్యవహరించాలి?
-తిడితే, కొడితే.. ఏమవుతుంది?
-అనుమానంగా చూడొద్దు
-మార్గదర్శకులుగా ఎలా ఉండాలి?
-యుక్త వయసు పిల్లల పెంపకంపై మనస్తత్వ నిపుణుల సూచనలు

అవును. పిల్లల్ని కనడమే కాదు, వారి తలరాతనూ తీర్చిదిద్దే శక్తి తల్లిదండ్రులకు ఉందంటున్నారు మనస్తత్వ పరిశోధకులు. పసిబిడ్డలకు ఉగ్గిపాలు పట్టించడం మొదలు వారికి నడక, మాటలు, ఆటపాటలు నేర్పించే తొలి గురువులు అమ్మానాన్నలే. బడికి వెళ్లే వయసులో ఎవరైనా తిట్టినా, కొట్టినా బుంగమూతి పెట్టుకుని ఇంటికి వచ్చాక చెప్పుకొనేది తల్లిదండ్రులకే. అలాంటిది… యుక్తవయసు రాగానే చాలామంది పిల్లలు కన్నవాళ్లకు చెప్పకుండా కొన్ని విషయాలను మనసులో దాచుకుని కుమిలిపోతుండటం ఇటీవల ఎక్కువవుతోంది.

చిన్న విషయాలకే తీవ్ర ఉద్వేగానికి లోనై విపరీత నిర్ణయాలు తీసుకుంటున్నవారూ పెరుగుతున్నారు. ఇవన్నీసరైన పెంపకంతో సరిదిద్దగలవేంటున్నారు పేరెంటింగ్‌ నిపుణులు. యుక్తవయసు పిల్లలతో తల్లిదండ్రులు ఎలా మెలగాలి? వారి భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దవచ్చు? అన్న విషయాలపై నిపుణులు కొన్ని సూచనలు చేశారు.

అప్పటివరకూ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చెప్పినట్టు నడిచే పిల్లలు… యుక్తవయసు రాగానే సొంతంగా వ్యవహరించడం ప్రారంభిస్తారు. ఇది అత్యంత సహజం కూడా. ఇతరులు చెప్పే మాటలకన్నా, వారి చేతలనే టీనేజర్లు ఎక్కువగా గమనించి, అనుకరిస్తుంటారు. అందుకే బాధించే, అసభ్యకర పదాలను తల్లిదండ్రులు ఉపయోగించకూడదని చెబుతున్నారు.

జీవితమంటే… హాయిగా, సుఖంగా బతకడమనే భావనతో పిల్లల్ని పెంచడం సరికాదు. దేన్నయినా కష్టపడి సాధించాల్సిందేనని, అందుకు ఓర్పుతో ఎప్పటికప్పుడు అన్ని రకాలుగా సిద్ధపడాలని, కష్టాలు సుఖాలు కలిసే ఉంటాయని వారికి నేర్పాలి. సమస్యలు ఎదురైనప్పుడూ, కోపం, భయం, ఆందోళన వంటి ఉద్వేగాలు తలెత్తినప్పుడూ తల్లిదండ్రులు సావధానంగా ఉండటం టీనేజర్ల జీవితంలో మార్గదర్శనం చేస్తూనే ఉంటుందని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ నిపుణులు పేర్కొన్నారు.

టీనేజ్‌లో తెలిసో తెలియకో తప్పు చేశారు. ఇప్పుడు తల్లిదండ్రులు చేయాల్సింది… దండించడం కాదు. వారితో కలిసి సమీక్షించుకోవడం.ఏ పరిస్థితుల్లో అలా వ్యవహరించాల్సి వచ్చింది? దానివల్ల వ్యక్తిగతంగా, కుటుంబానికి, ఇతరులకు ఎలాంటి నష్టం, కష్టం కలుగుతాయి? అన్నది వివరించాలి. మరోసారి ఇలా చేయకూడదని చెప్పాలి. తప్పును హృదయపూర్వకంగా అంగీకరించి, క్షమాపణ కోరేలా వారిని ప్రోత్సహించాలి. ఇలా చేయడం వారిలో నైతికతను, క్రమశిక్షణను పెంపొందిస్తుంది. మనసును తేలికపరిచి, భావోద్వేగాల నియంత్రణకూ దోహదపడుతుంది.

యుక్త వయసు పిల్లలు ఎలాంటివారితో స్నేహం చేస్తున్నారు? మొబైల్‌ ఫోన్లలో ఎలాంటి కంటెంట్‌ చూస్తున్నారన్నది తల్లిదండ్రులు తెలుసుకోవాలి. ఈ విషయాల్లో వారికి జాగ్రత్తలు చెప్పాలి. కానీ కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలు చేయరాని నేరమేదో చేస్తున్నట్టు, చేయి జారిపోతున్నట్టు అపోహపడి, వారిని నిఘా కళ్లతో వెంటాడుతుంటారు. అదేపనిగా తప్పుపడుతూ, అనుమానిస్తూ ప్రశ్నలతో వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటారు. ఇలాంటి వైఖరి వారి సంబంధాలను కచ్చితంగా దెబ్బతీసేదేనని హెచ్చరిస్తున్నారు నిపుణులు. పిల్లలు పెడదోవ పడుతున్నట్టు కచ్చితమైన సమాచారం ఉంటే తప్పనిసరిగా వారిని మానసిక నిపుణుల వద్దకు తీసుకువెళ్లాలి.

మాట వినడంలేదని, చెప్పింది చేయడం లేదని యుక్తవయసు పిల్లల్ని విచక్షణారహితంగా తిట్టడం, కొట్టడం చేయకూడదు. ఇలా చేస్తే తల్లిదండ్రుల పట్ల వారిలో వ్యతిరేక భావన నాటుకుంటుంది. పెద్దల పట్ల భయం పెంచుకుని, అబద్ధాలు చెబుతారు. మంచైనా, చెడైనా పిల్లలు తమతో ఎలాంటి అరమరికలు లేకుండా మాట్లాడేలా వారితో మెలగాలి. తమకు కష్టం వచ్చినప్పుడు చెప్పుకొనే మొదటి స్నేహితులు తల్లిదండ్రులే కావాలని ‘క్లినికల్‌ చైల్డ్‌ అండ్‌ ఫ్యామిలీ సైకాలజీ’ పత్రిక అధ్యయనంలో పేర్కొంది.

పిల్లల్ని కార్పొరేట్‌ బడుల్లో చేర్పించి, ఖరీదైన వస్తువులు సమకూర్చి, కావాల్సినంత పాకెట్‌ మనీ ఇవ్వడాన్ని చాలామంది తల్లిదండ్రులు గొప్పగా భావిస్తుంటారు. అంతకుమించి చేయాల్సింది… సరైన జీవనశైలిని అందించడం. అమ్మానాన్నలు వేళకు సరైన పోషకాహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ప్రకృతితో మమేకం కావడం, ఇతరులతో గౌరవభావంతో మెలగడం, వాయిదాలు వేయకుండా పనులను పూర్తిచేయడం వంటివి చేస్తే పిల్లలూ వాటినే అనుసరిస్తారు. కుటుంబ వ్యవహారాల్లో పాలుపంచుకునేలా, స్నేహితులు, బంధువులతో కలివిడిగా ఉండేలా పిల్లలను ప్రోత్సహించాలి. తల్లి తండ్రుల దినోత్సవం అనుకోగానే సరిపోయిందా!! ఆలోచించండి..

– మంజరి

LEAVE A RESPONSE