Suryaa.co.in

Telangana

ఉద్యోగుల‌కు బాస‌ట‌గా ప్ర‌జా ప్ర‌భుత్వం

– దీర్ఘ‌కాలంగా పెండింగ్ స‌మ‌స్య‌ల‌కు మోక్షం
– రెండు డీఏల చెల్లింపుకు అంగీకారంతో ఊర‌ట‌
– ఆరోగ్య పథకం అమ‌లుకు ట్ర‌స్ట్ ఏర్పాటుతో లాభం
– త్రిస‌భ్య క‌మిటీ దృష్టికి వ‌చ్చిన ఇత‌ర అంశాల‌ను సైతం ప‌రిశీలించాలి
– ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
– మంత్రి పొంగులేటిని కలిసిన రెవెన్యూ ఉద్యోగులు
– కాబినేట్ నిర్ణ‌యాల ప‌ట్ల సీఎం, ఇత‌ర మంత్రుల‌కు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు
– మీడియా స‌మావేశంలో ఉద్యోగుల‌ జేఏసీ ఛైర్మ‌న్ ల‌చ్చిరెడ్డి

హైదరాబాద్: రాష్ట్రంలో ప్ర‌జా ప్ర‌భుత్వం ఉద్యోగుల‌కు బాస‌ట‌గా నిలుస్తుంద‌ని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఛైర్మ‌న్ వి.ల‌చ్చిరెడ్డి పేర్కొన్నారు. ఉద్యోగుల అభివృద్ధి, సంక్షేమ‌మే ల‌క్ష్యంగా ప్ర‌భుత్వం చేయూత‌గా నిలుస్తుంద‌న్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న స‌మ‌స్య‌ల‌ను ద‌శ‌ల వారీగా ప‌రిష్క‌రిస్తుంద‌న్నారు.

రాష్ట్ర కాబినేట్ ఉద్యోగుల విష‌యంలో గురువారం తీసుకున్న నిర్ణ‌యాల ప‌ట్ల హ‌ర్షం వ్య‌క్తం చేశారు. రెండు డీఏల చెల్లింపు, ఆరోగ్య ప‌థకం అమ‌లుకు ట్ర‌స్ట్ ఏర్పాటు, పెండింగ్ బిల్లుల చెల్లింపుకు ప్ర‌తి నెల రూ.700 కోట్ల విడుద‌ల‌, ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌రిగిన బ‌దిలీ అయిన ఉద్యోగులు సొంత జిల్లాల‌కు తిరిగి వెళ్లెలా, త‌దిత‌ర అంశాల‌పై తీసుకున్న నిర్ణ‌యాల ప‌ట్ల‌ సీఎం రేవంత్‌రెడ్డికి, మంత్రుల‌కు, ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు ధ‌న్యవాదాల‌ను తెలిపారు.

నాంప‌ల్లి సీసీఎల్ఏ కార్యాల‌యం ప్రాంగ‌ణంలోని డిప్యూటీ క‌లెక్ట‌ర్స్ అసోసియేష‌న్ కార్యాల‌యం శుక్ర‌వారం ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఛైర్మ‌న్ వి.ల‌చ్చిరెడ్డి, జేఏసీ నాయ‌కులు మాట్లాడారు. రాష్ట్రంలో ఫ్రెండ్లీ ప్ర‌భుత్వం న‌డుస్తుంద‌న్నారు. దీంతోనే ప్ర‌భుత్వం ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌పై ముగ్గురు ఐఏఎస్ అధికారుల‌తో ఛైర్మ‌న్‌గా న‌వీన్‌మిట్ట‌ల్ సార‌ధ్యంలో త్రి స‌భ్య క‌మిటీని ఏర్పాటు చేసి రాష్ట్రంలోని అన్ని ఉద్యోగ సంఘాలతో చ‌ర్చ‌లు జ‌రుప‌డ‌మే కాకుండా విన‌తుల‌ను తీసుకుంద‌న్నారు.

తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు, కాంటిజెంట్ ఉద్యోగులు మరియు పెన్షనర్ల సమస్యలను పరిగణలోకి తీసుకుని ఆమోదించిన‌ తీర్మానాలను మూడు విభాగాలుగా చేసి అత్యవసర, ఆర్థికేతర, ఆర్థిక సమస్యలు అధికారులకు వివ‌రించ‌డం జ‌రిగింద‌న్నారు.

ఉద్యోగులందరికీ నగదు రహిత వైద్యం అందించాలని, పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని, నూతన పెన్షన్ విధానం(CPS) రద్దు చేసి, పాత పెన్షన్ (OPS) పునరిద్దంచాలని, పొరుగు సేవల ఉద్యోగుల కొరకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, 317 GO ద్వారా మరి కొన్ని రకాల బదిలీలకు అవకాశం కల్పించాలని కోరామ‌న్నారు. ఇదే కాకుండా ప్రభుత్వ ఖజానా పై తక్షణ భారం పడని 24 అంశాలను తొలుత పరిష్కరించి, ఆ తర్వాత మిగిలిన 14 పైగా ఆర్థిక భారం పడే అంశాలను దశల వారీగా పరిష్కరించాలని కోర‌డం జ‌రిగింద‌న్నారు.

రూ.10 లక్షల లోపు బిల్లులను ఈ-కుబేర్ ద్వారా క్లియరెన్స్ చేయాల‌ని కోరామ‌న్నారు. దీనికి ప్ర‌భుత్వం ప్ర‌తి నెల‌లో రూ.700 కోట్లు క్లియ‌ర్ చేసేందుకు అంగీకారం తెలిపింద‌న్నారు. ఇది ప్ర‌తి ఉద్యోగికి ఎంతో లాభ‌మ‌న్నారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS) ద్వారా క్యాష్‌లెస్ వైద్య చికిత్స అందించేందుకు అత్యుత్త‌మ ఆరోగ్య ప‌థ‌కం కోసం ట్ర‌స్ట్‌ను ఏర్పాటు చేయ‌నుంద‌న్నారు. ఈ ట్ర‌స్ట్‌లో ఉన్న‌తాధికారులు, ఉద్యోగులే స‌భ్యులుగా ఉండే విధంగా రూపొందించ‌డంతో ఇబ్బందులు త‌లెత్త‌వ‌న్నారు.

సాధారణ బదిలీలు, మరియు సాధారణ ఎన్నికల సమయంలో బదిలీ అయిన అధికారులను పూర్వ జిల్లాల‌కు బ‌దిలీ చేయాల‌ని కోరామ‌న్నారు. దీనిపై కూడా కాబినేట్ సానుకూలంగా స్పందించ‌డంతో చాలా మంది ఉద్యోగుల‌కు లాభం జ‌రుగుతుంద‌న్నారు.

మ‌రో కొన్ని అంశాల‌ను కూడా ప్ర‌భుత్వ పెద్ద‌ల దృష్టికి తీసుకెళ్లామ‌న్నారు. వాటిని కూడా త్వ‌ర‌లోనే ప‌రిష్క‌రిస్తార‌ని ఆశిస్తున్నామ‌న్నారు. వాటిలో ప్ర‌ధానంగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు, సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్) రద్దు చేసి, ఓపీఎస్ (ఓల్డ్ పెన్షన్ స్కీమ్) పునరుద్ధరణ చేయాల‌న్నారు.

జీ.ఓ. 317 ప్రకారం, అంతరజిల్లా దంపతుల కేసులను భవిష్యత్తులో ఖాళీల్లో పరిగణనలోకి తీసుకోవాలన్నారు. అలాగే సీనియారిటీ ఆధారంగా ఇతర జోన్లు/జిల్లాలకు బదిలీ అయిన ఉద్యోగులను, వారు ముందుగా పనిచేసిన ప్రాంతాలలో భవిష్యత్‌లో వచ్చే ఖాళీల్లో తిరిగి తీసుకోవాలని కోరారు.

మంత్రి పొంగులేటికి ధన్యవాదాలు..

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని సైతం రెవెన్యూ ఉద్యోగ సంఘాల నాయకులు కలిసి క్యాబినేట్ నిర్ణయం పట్ల ధన్యవాదాలు తెలిపారు. మిగిలిన రెవెన్యూ ఉద్యోగుల సమస్యలను కూడా పరిష్కరించేలా చొరవ చూపాలని కోరారు.

 

LEAVE A RESPONSE