– ప్రజాభిప్రాయం కోసం ఈ-మెయిల్ ఏర్పాటు
– వినియోగం లోకి తీసుకురావలని ఇప్పటికే క్యాబినెట్ సబ్ కమిటీ సూచన
– భవనాల వినియోగం పై ప్రభుత్వ కీలక నిర్ణయం
అమరావతి: జగన్ జమానాలో ఆయన సతీమణి ముచ్చట కోసం వందల కోట్లతో నిర్మించిన విశాఖ రుషికొండ ప్యాలెస్‌పై కూటమి సర్కారు ఎట్టకేలకు కీలక నిర్ణయం తీసుకుంది.
వైసీపీ హయాంలో నిర్మించిన ఈ భవనాల వినియోగం పైన కొంత కాలంగా కూటమి ప్రభుత్వం అనేక చర్చలు చేసింది. ఇందు కోసం మంత్రివర్గ ఉప సంఘం నియమించింది. కాగా, కేబినెట్ సబ్ కమిటీ ప్రజాభిప్రాయ సేకరణ చేసి, భవనాలను వినియోగంలోకి తీసుకురావాలని సూచన చేసింది. దీంతో.. ప్రభుత్వం ఇప్పుడు ఈ భవనాల విషయంలో తాజాగా ప్రకటన చేసింది.
రుషికొండ భవనాల వినియోగం పై ప్రజల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం ప్రత్యేకంగా మెయిల్ ఐడీ ప్రకటించింది. ఏడు రోజుల్లోగా సూచనలు ఇవ్వాలని కోరింది. 15 నెలలుగా రుషికొండ ప్యాలెస్ భవనాలు నిరుపయోగంగా మిగిలాయి. వీటి నిర్వహణ కోసం రూ.25 లక్షల చొప్పున ఏడాదికి రూ.3 కోట్లు ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సి వస్తోంది.
భవనాల వినియోగం పైన మంత్రులు కందుల దుర్గేశ్, పయ్యావుల కేశవ్, డోలా బాల వీరాంజనేయ స్వామితో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ భవనాలను వినియోగంలోకి తీసుకురావటం తో పాటుగా ఆదాయ మార్గాలపై చర్చించారు. తాజాగా ప్రకటన చేశారు.
రుషికొండ భవనాల్లో అత్యుత్తమ ఆతిథ్యం కల్పించేలా సకల అంతర్జాతీయ స్థాయిలో హంగులు ఉన్నాయి. 13,542 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రూ.451.67 కోట్ల వ్యయం చేసి వీటిని నిర్మించారు. నాలుగు మేజర్ బ్లాక్‌లుగా విభజించి వాటిలో జీప్లస్ 1 స్థాయిలో 7 ప్యాలెస్ లను నిర్మించారు.
విజయనగర బ్లాక్ – 3 యూనిట్లు , గజపతి బ్లాక్ – 1 యూనిట్ ,కళింగ బ్లాక్ – 1 యూనిట్, వేంగి బ్లాక్ 2 యూనిట్లుగా నిర్మించారు. వీటిలో విలాసవంతమైన గదులు, విందు ఇచ్చేందుకు బాంకెట్ హాల్స్, అధునాతన రెస్టారెంట్లు, స్పా, జిమ్‌లు, సమావేశ మందిరాలు, లాంజ్‌లు, స్టాఫ్ అకామిడేషన్ వసతులు ఉన్నాయి. పర్యాటక కేంద్రంగా, ఆతిథ్య కేంద్రంగా ఉంచేందుకు ఆవకాశాలు ఉండటంతో విజయవాడలో ప్రత్యేకంగా ఆతిథ్య రంగం ప్రముఖులతో ఈ నెల 17న సమావేశానికి ప్రభుత్వం నిర్ణయించింది.
ఎవరైనా సూచనలు, సలహాలు ఇవ్వాలనుకునే వారు rushikonda@aptdc.in మెయిల్ అడ్రస్‌కు ఏడు రోజుల్లోగా పంపాలని ఏపీ టూరిజం అథారిటీ స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ భవనాల పైన 8 ప్రముఖ సంస్థలు ఆసక్తి కనపరిచాయి. 5 సంస్థలు సవివరమైన ప్రాజెక్టు రిపోర్టు డీపీఆర్‌లను ఇప్పటికే అధికారులకు పంపాయి. వీటిని మంత్రి వర్గ ఉపసంఘం పరిశీలిస్తోంది. వీటితో పాటు జాతీయ, అంతర్జాతీయ సంస్థలనూ ప్రభుత్వం ఆహ్వానించింది. తమ ఆలోచనలతో ముందుకు రావాలని కోరింది.