Suryaa.co.in

Features

శతవసంతాల ‘రావి’ చెట్టు!

సాహిత్యమంటే ఆలోచన..
సాహిత్యమంటే వివేచన..
సాహిత్యమంటే
బక్కచిక్కినోడి ఆవేదన…
సాహిత్యమంటే
అన్యాయానికి
గురైనోడి రోదన..
సాహిత్యమంటే జనహితం..
అచ్చంగా అదే సాహిత్యం
రావి శాస్త్రి విరచితం..!

పేదోడి కన్నీరు
రావి శాస్త్రి
కలం సిరా..
అది విప్పేసింది
దుర్మార్గాల..దౌర్జన్యాల
గుట్టుమట్లు కసిదీరా..
‘నిజం’.. అలా కుండ బద్దలు కొట్టడమే
ఆయన నైజం..
నచ్చనిది మొహమాటం లేకుండా తిప్పికొట్టడం..
నచ్చింది మొహం మీదే చెప్పేయడం శాస్త్రిజం..
అదే రావిశాస్త్రీయం..
అకాడమీ అవార్డును..
డాక్ట’రేటు’ ను వద్దన్న
రాచకొండ నిండుకుండ..
ఆయన అంతరంగం
వెండికొండ..
అదే ఆయన రచ్చబండ..!

సర్కారోడు దోసిళ్ళతో ఒలకబోసిన సారా..
నిషేధం పేరిట ఆపేస్తూ..
మరలా మరోలా ఒంపేస్తూ..
ఎన్నెన్ని ప్రమాణాలు…
ఇంకెన్ని విపరిణామాలు..
చట్టంలోని లొసుగులు..
పెద్దోళ్ల ముసుగులు..
నిషేధం మాటున మందు
ఏరులై పొంగితే..
జనం మత్తులో పొర్లితే..
ఆ కాలం..నాటి కలకలంపై
రావి శాస్త్రి కలం కురిపించింది
ఆరుసారా కధలు..
నిషేధం తెచ్చిపెట్టిన వ్యధలు
కట్టలు తెగిన బాధలు…
రావిశాస్త్రి సంబోధలు..
ఎలుగెత్తి సంబోధనలు..!

రావి శాస్త్రి జీవితమే కథాసా’గరం’..
సారా కథలతో పాటు
ఆరు సారోకధలు
సొమ్ములు పోనాయండి..
గోవులొస్తున్నాయి జాగ్రత్త
రత్తాలు – రాంబాబు
రాజు మహిషి..
బానిస కధలు
బుక్కులు..
ఆయన దృక్కులు..
అంపశయ్యపైనా
విశ్రాంతి కోరని పెన్ను
ఇల్లు
ఎక్కి కూసింది..
ఎన్ని రాసినా అల్పజీవి
ఆయన రచనల్లో చిరంజీవి!

ఈ అతివాది
పేరెన్నిక గన్న
న్యాయవాది..
న్యాయం తరపున వకాల్తా..
కేసు విజయం వైపే చల్తా..!
రచనలు..వచనలు…
వాదనలు..పేదోడి పక్షమే..
బ్రతుకంతా ధర్మ రక్షణే..!!

రావి శాస్త్రి
ఇప్పటివరకు
బ్రతికి ఉంటే
శతవసంతం…
బడుగు బ్రతుకు నిత్యవాసంతం..
కొత్త పొద్దుకు సుప్రభాతం..
మరిన్ని మంచి రచనలు
నవ సమాజానికి అంకితం!

ఎలిశెట్టి సురేష్ కుమార్
విజయనగరం
9948546286

LEAVE A RESPONSE