Suryaa.co.in

Andhra Pradesh

విద్యార్థుల మృతి విషాదకరం: పవన్ కల్యాణ్

అనకాపల్లి జిల్లా పూడిమడక బీచ్ లో విద్యార్థులు గల్లంతైన ఘటన విషాదాంతంగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. ఉమ్మడి విశాఖ జిల్లా పూడిమడక వద్ద సముద్రతీరంలో చోటుచేసుకున్న దుర్ఘటనలో ఆరుగురు విద్యార్థులు మృతి చెందడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇంజినీరింగ్ సెమిస్టర్ పరీక్షలు పూర్తిచేసుకున్న ఆ విద్యార్థులు మృత్యువాతపడడం ఆవేదన కలిగించిందని తెలిపారు.

ఆ విద్యార్థుల భవిష్యత్ గురించి ఎన్నో ఆశలు పెట్టుకున్న వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు ఈ విషాదం శోకాన్ని మిగిల్చిందని పవన్ కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు తన తరఫున, జనసేన తరఫున ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నట్టు వెల్లడించారు. సముద్ర తీరాలకు, నదీ తీరాల వద్దకు విహారానికి వెళ్లే విద్యార్థులు, యువత తగు జాగ్రత్తలు పాటించాలని పవన్ సూచించారు.

LEAVE A RESPONSE