నమ్మి ఓట్లు వేసిన మహిళలను నట్టేట ముంచిన జగన్
ఈనాడు దినపత్రికలో వేసిన కార్టూన్ జోకులా అనిపించిన అదే నిజం
రాజ్యాంగ విరుద్ధమైన పనులనే జగన్ ప్రభుత్వం చేస్తుంది
దేశ చరిత్రలోనే న్యాయ వ్యవస్థ పై జగన్మోహన్ రెడ్డి చేసినంత దరిద్రమైన వ్యాఖ్యలు మరెవరు చేయలేదు
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు
రాజ్యాంగం పై కక్షగట్టినట్టుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తూ, అందులోని ప్రతి నిబంధనకు తూట్లు పొడుస్తోందని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు విమర్శించారు. రాజ్యాంగంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రమాణం చేశారని, ప్రజాప్రతినిధులుగా తాము కూడా ప్రమాణం చేశామని… రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘనలను గురించి ఉండబట్ట లేక ప్రశ్నిస్తే వాళ్లు వీళ్ళ చేత తిట్టించడమే కాకుండా, ఇంకా మొండిగా ప్రశ్నించిన వారిని పోలీసుల చేత కొట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… జగన్మోహన్ రెడ్డి తో పాటు నేను కూడా చట్టసభల ప్రతినిధినే. ముఖ్యమంత్రిగా ఎన్నికైన ఆయనను , రాజ్యాంగము, చట్టము, నిబంధనలను సక్రమంగా అమలు చేయాలని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టి చిత్రహింసలకు గురి చేయిస్తున్నారు. నాలాంటి ప్రజా ప్రతినిధికే రాష్ట్రంలో ఇటువంటి దుస్థితి ఎదురైతే, ఇక సామాన్యుని పరిస్థితి ఏమిటని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు.
ఎలాగో ఓడిపోబోతున్నామని తెలిసి వై నాట్ 175 అంటూ ప్రగల్బాలను పలుకుతున్నారు. రానున్న ఎన్నికల్లో ఎలాగో ఓటమి ఖాయమని తెలిసి అందర్నీ ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారు. రేపు తమని ఓడించబోయే ప్రజలను కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేయాలన్న దృక్పథంతో దాడులు చేస్తున్నట్లుగా స్పష్టమవుతుంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వారంలో సిపిఎస్ రద్దు చేస్తామని చెబితే, ఉద్యోగులంతా మా పార్టీకి మద్దతునిచ్చారు.
తెలుగుదేశం పార్టీకి, నా ప్రస్తుత పార్టీకి 10 శాతం వ్యత్యాసం ఉందని అనుకుంటే, తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకోవడంతో, ఆ వ్యత్యాసం అన్నదే ఇప్పుడు లేకుండా పోయింది . గత అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపికి 27% పోస్టల్ ఓట్లు పోలు కాగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పోస్టల్ ఓట్లు అధికంగా వచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులకు ఓట్లు 50 లక్షల పైచిలుకు ఉంటాయి. ఇప్పుడు వారంతా మా పార్టీకి వ్యతిరేకమే. రానున్న ఎన్నికల్లో ఒక్కరు కూడా ఓటు వేసే పరిస్థితి లేదని రఘు రామ కృష్ణంరాజు అన్నారు.
అంగన్వాడీ టీచర్లు, మహిళలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలనపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని రఘు రామ కృష్ణంరాజు తెలిపారు . గత ఎన్నికలకు ముందు మద్యం సేవించి మీ భర్తలు ప్రాణాలను కోల్పోతుంటే, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇచ్చే పసుపు, కుంకుమ అవసరమా? అంటూ ప్రశ్నించిన జగన్మోహన్ రెడ్డి, అధికారంలోకి రాగానే దశలవారీగా మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తానని చెప్పారు.
నమ్మి ఓట్లు వేసిన మహిళలను ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి నట్టేట ముంచారు. రాష్ట్రంలో విక్రయిస్తున్న నాణ్యత లేని మద్యం వల్ల మద్యపాన ప్రియులు ప్రాణాలను కోల్పోతున్నారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సహాయ మంత్రి భారతి పవార్ అన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి అందజేసిన నివేదికలను పరిశీలించిన ఆమె, స్వతహాగా వైద్యురాలు కూడా కావడంతో నాణ్యత లేని మద్యం విక్రయాలపై తీవ్రంగా స్పందించారు. ఈనాడు దినపత్రికలో వేసిన కార్టూన్ జోకులా అనిపించిన అదే నిజం. నాసిరకం మద్యం విక్రయాల వల్ల ప్రజల ప్రాణాలు పోతున్నాయని భారతి పవార్ మాట్లాడారు… నిన్న రచ్చబండ లో నేను కూడా అదే విషయాన్ని చర్చించాను.
మగువలకు మాట ఇచ్చి, వారి మాంగల్యాలతో ఆటలాడుకుంటున్న జగన్ ను రాష్ట్రంలోని 20% మహిళలు అసహ్యించుకునే అవకాశం ఉంది. ఇందులో తక్కువలో తక్కువగా 15% ఓట్లలో ఒకటి రెండు శాతం ఇతర పార్టీలకు వెళ్లినా, 13 శాతం ఓట్లు టిడిపి జనసేన కూటమికి పోలయ్యే అవకాశాలు ఉన్నాయి. రానున్న ఎన్నికల్లో మా పార్టీ 35% ఓట్లకు పరిమితం అయితే, టిడిపి జనసేన కూటమి 47+13= 60 శాతం ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
తాజాగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న ఒక జిల్లాలో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు అనంతరం పరిణామాల నేపథ్యంలో శాంపిల్ సర్వే నిర్వహించగా టిడిపి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య పది శాతం ఓటు బ్యాంకు తేడా ఉన్నట్లు స్పష్టమైనది. అన్నం ఉడికిందని చెప్పడానికి… అన్నం అంతా పట్టి చూడాల్సిన అవసరం లేదు అన్నట్టుగా ఈ శాంపిల్ సర్వే ద్వారా రానున్న ఎన్నికల్లో నా ప్రస్తుత పార్టీ ఎంత దారుణంగా ఓడిపోతుందో అర్థమవుతుంది. అందుకే ప్రస్తుతం తాత్కాలిక పాలకులు ప్రతిపక్ష నేతలను అరెస్టు చేస్తూ, ప్రజలను నానా ఇబ్బందులకు గురి చేయాలని చూస్తున్నారు. అయినా శాంతియుతంగానే నిరసన తెలియజేద్దామని రఘురామ కృష్ణంరాజు సూచించారు.
గ్రామ పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ, రాజ్యాంగ విరుద్ధమైన సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడాన్ని కాగ్ తప్పు పట్టింది. రాష్ట్ర ప్రభుత్వానికి చెడమడ అక్షితలు వేసింది. ఇదే విషయమై నేను గతంలో గిరీష్ ముర్ము ను కలిసినప్పుడు సచివాలయ వ్యవస్థ అనేది రాజ్యాంగ విరుద్ధమని ఆయన చెప్పారు. రాజ్యాంగ విరుద్ధమైన పనులనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తోంది. రాజ్యాంగబద్ధమైన పనులను ఈ ప్రభుత్వం ఏవి కూడా చేయదు. రాష్ట్రంలో భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టేశారు. ప్రజల ప్రాథమిక హక్కులను హరిస్తున్నారు.
సొంత కాంపౌండ్ లో శాంతియుతంగా నిరసన తెలియజేసే స్వేచ్ఛ అన్నది లేకుండా పోయింది. తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ, మాజీ మంత్రి పరిటాల సునీత తన ఇంట్లో నిరాహార దీక్ష చేపట్టగా, ఒక్కరోజు కాకముందే ఆమె దీక్ష ను భగ్నం చేశారు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులలో భాగంగా శాంతియుతంగా కొవ్వొత్తుల నిరసన ర్యాలీ చేపడితే పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్రంలో శాంతియుత నిరసనలకు కూడా తావే లేకుండా పోయింది.
అంగన్వాడీలు ఒకవైపు నిరసన తెలియజేస్తుండగా, మరొకవైపు ప్రభుత్వ ఉద్యోగులు ఓ పి ఎస్ కావాలి… ఏమాత్రం గ్యారెంటీ లేని జిపిఎస్ వద్దు అంటూ ఆందోళన చేస్తున్నారు. రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘనలకు అంతు అన్నదే లేకుండా పోయింది. విద్యావ్యవస్థ కోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 350A లో కల్పించిన హక్కులకు భిన్నంగా ప్రస్తుత పాలకులు వ్యవహరిస్తున్నారు. అప్పుల విషయంలోనూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 293లో చెప్పిన దానికి పూర్తిగా రివర్స్ పద్ధతిలో వెళ్తున్నారు. రాష్ట్రంలో భారత రాజ్యాంగానికి పూర్తి భిన్నంగా ప్రస్తుత పాలకులు వ్యవహరిస్తున్నారని రఘురామ కృష్ణంరాజు మండిపడ్డారు.
దేశ చరిత్రలోనే న్యాయ వ్యవస్థలపై పులివెందులవాసి, ఏడుగురి సందింటి జగన్మోహన్ రెడ్డి చేసినంత దరిద్రమైన వ్యాఖ్యలు మరెవరు చేయలేదని రఘురామ కృష్ణంరాజు తెలిపారు . న్యాయమూర్తులపై సోషల్ మీడియా వేదికగా కొంతమంది చేసిన వ్యాఖ్యలపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్పందించడం శుభ పరిణామం. ఇదే విషయంపై న్యాయస్థానంలో అడ్వకేట్ జనరల్ ఒక పిటిషన్ దాఖలు చేశారు.
న్యాయమూర్తులపై వ్యక్తిగత వ్యాఖ్యానాలు చేయడం మంచి పద్ధతి కాదు. కోర్టు ధిక్కరణ పై 1971 సెక్షన్ 10 ప్రకారం కన్ స్ట్రక్టివ్ క్రిటిసిజం టు ఇంప్రూవ్ ది సిస్టం అని పేర్కొనడం జరిగింది. వ్యక్తిగత దూషణలు మంచివి కావు. ప్రతి ఒక్కరూ నిగ్రహం పాటించాలి. ఎవరు కూడా అటువంటి చర్యలకు దిగవద్దు. లోయర్ కోర్టు కాకపోతే, హైకోర్టులో… అక్కడ కాదంటే సుప్రీం కోర్టులో న్యాయం జరిగి తీరుతుంది. ఇదే విషయాన్ని నేను పదే పదే ప్రస్తావిస్తూ వస్తున్నాను. గతంలో న్యాయమూర్తుల గురించి, న్యాయ వ్యవస్థ గురించి నీచంగా మాట్లాడిన వారిపై కేసులు నమోదు చేశారు.
అయితే అమెరికాలో కొందరు, ఇక్కడున్న మరి కొంతమంది ఎంపీలపై కేసులు నమోదైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కోర్టు ధిక్కరణ అనేది అత్యంత దారుణమైనతప్పు. 20 20 అక్టోబర్ ఆరవ తేదీ లేదంటే 10వ తేదీన మూడేళ్ల క్రితం మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి న్యాయ వ్యవస్థ గురించి, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన ఎన్వి రమణ పై దారుణమైన వ్యాఖ్యలు చేశారు.
అప్పటికే సుప్రీంకోర్టులో నెంబర్ 2 పొజిషన్లో ఉన్న ఎన్వి రమణ పై దరిద్రమైన వ్యాఖ్యలు చేసిన వ్యక్తి వైయస్ జగన్మోహన్ రెడ్డి. హైకోర్టు వ్యవస్థనే ఎన్వి రమణ మేనేజ్ చేస్తున్నారని, హైకోర్టు న్యాయమూర్తులు ఆయన చెప్పినట్లుగా నడుచుకుంటున్నారని, తన ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి , ఎన్ వీ రమణ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేయడానికి… నేరం చేసిన ప్రజాప్రతినిధులపై త్వరగా చర్యలు తీసుకోవాలని ఆర్డర్ ఇవ్వడమే .
అయితే, ఆ ఆర్డర్ ఇచ్చిన తరువాత కూడా విచారించింది లేదు. ఇక,తాను కోర్టుకు వెళ్లాల్సిన అవసరమే లేదన్నట్లుగా ఏకంగా జగన్మోహన్ రెడ్డి ఆర్డర్నే తెచ్చుకున్నారు. ఐదేళ్లుగా ఆయన కోర్టు విచారణకు హాజరే కావడం లేదు. ఎన్వి రమణ ఆర్డర్ ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి తనను తాను సంబాళించుకోలేక హైకోర్టు వ్యవస్థను, సుప్రీంకోర్టు న్యాయమూర్తిని అవమానపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిని అంత మాట అన్న జగన్మోహన్ రెడ్డి పై కోర్టు ధిక్కరణ పిటిషన్ జస్టిస్ యు వి లలిత్ బెంచ్ ముందుకు వచ్చింది. అయితే, అప్పటికే జగన్మోహన్ రెడ్డి కేసులు చేశానని చెప్పి, విచారణ బెంచ్ నుంచి జస్టిస్ యు వి లలిత్ తప్పుకున్నారు.
జస్టిస్ ఎన్వీ రమణ నే పెద్ద మనసు చేసుకొని … ఇటువంటి వ్యాఖ్యలకు న్యాయవ్యవస్థ చలించదని జగన్మోహన్ రెడ్డిని క్షమించారు . జగన్మోహన్ రెడ్డి న్యాయవ్యవస్థపై నెగిటివ్ క్రిటిసిజం చేశారు. పాజిటివ్ క్రిటిసిజం అనేది ఎప్పుడైనా ఆహ్వానించదగ్గదే. న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు గురించి మాట్లాడవచ్చు కానీ అదే న్యాయమూర్తి గురించి మాట్లాడడం సమంజసం కాదు. నేను ఎప్పుడూ గతంలో ఇచ్చిన తీర్పుల గురించి చెబుతూ , ప్రస్తుతం ఇచ్చిన తీర్పులను విశ్లేషిస్తూ మాత్రమే మాట్లాడాను. ఏనాడు కూడా న్యాయమూర్తుల గురించి మాట్లాడింది లేదు. కావాలంటే నా గత వీడియోలు అన్ని పరిశీలించవచ్చు.
నేను వృత్తి గతంగా ఫార్మసిస్టును అయినప్పటికీ, చట్టాలను, రాజ్యాంగాన్ని అధ్యయనం చేశాను. న్యాయ వ్యవస్థ పై తెలిసో తెలియకో సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసినవారిపై చర్యలు తీసుకునే ముందు, జగన్మోహన్ రెడ్డి న్యాయ వ్యవస్థలపై తాను చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కేసును రీఓపెన్ చేయించుకొని పత్రికా ముఖంగా సంజాయిషీ తెలిపి ముందుకు వెళితే బాగుంటుందేమో. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ గతంలో మాట్లాడుతూ కుక్కలు మొరుగుతాయి… కానీ న్యాయ వ్యవస్థ భయపడకుండా ధైర్యంగా పనిచేస్తుందని అన్నారు. ఎన్వి రమణ చేసిన ఈ పరోక్ష వ్యాఖ్యలు అందరికీ వర్తిస్తాయి.
న్యాయ వ్యవస్థ వల్లే సమాజం రక్షించబడుతోంది . న్యాయ వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగన్మోహన్ రెడ్డిని ముందు శిక్షించి, ఆ తరువాత అందరినీ శిక్షించాలి. న్యాయ వ్యవస్థను, సుప్రీంకోర్టు న్యాయమూర్తిని కించపరిచే విధంగా మాట్లాడిన వ్యక్తి బయట ఉంటే, మమ్మల్ని శిక్షిస్తారా? అని ఇతరులు అనకుండా, మా పార్టీకి అప్రతిష్ట రాకుండా ఉంటుందని రఘురామ కృష్ణంరాజు అన్నారు.
ఏసీబీ కోర్టు న్యాయమూర్తి సెలవుతో రేపటికి చంద్రబాబు బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
ఏసీబీ కోర్టు న్యాయమూర్తి వ్యక్తిగత కారణాలతో మంగళవారం సెలవు తీసుకోవడం వల్ల, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్ విచారణ బుధవారం నాటికి వాయిదా పడిందని రఘు రామ కృష్ణంరాజు తెలిపారు. 1992 సుప్రీంకోర్టు దిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పు ప్రకారం మొదటి 15 రోజుల వ్యవధిలోనే ముద్దాయి పోలీసు కస్టడీకి అనుమతించాలని, ఆ తరువాత అనుమతించరాదని స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అయితే ఈ తీర్పును త్రిసభ్య ధర్మసనానికి నివేదించాలని నిర్ణయించినప్పటికీ, బెంచ్ ఏర్పాటు కాలేదు.
వాదనలు జరగలేదు. స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడు ని మరోసారి పోలీస్ కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో సిఐడి పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ ను 1992 సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కొట్టివేస్తారని నా భావన.. అలాగే బెయిల్ అనేది ముద్దాయి హక్కు. జైలు అనేది తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమేనని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. ఏసీబీ కోర్టులో చంద్రబాబు నాయుడుకు బెయిల్ లభిస్తుందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మంగళవారం నాడు న్యాయమూర్తి సెలవు పెట్టి, కోర్టుకు హాజరు కాకపోవడం చంద్రబాబు నాయుడు అభిమానుల దురదృష్టం.
హైకోర్టులో చంద్రబాబు నాయుడు పై జారీ చేసిన పీటీ వారెంట్ల పై విచారణ జరగనుంది. అంగళ్లు అల్లర్ల కేసులు ఇప్పటికే 70 నుంచి 80 మంది బెయిల్ పొందారు. ఎన్ ఎస్ జి రక్షణ కలిగిన చంద్రబాబు నాయుడు పోలీసులను హత్య చేయడానికి ప్రయత్నించారని కేసు నమోదు చేయడం ఎబ్బెట్టుగా ఉంది. ఈ కేసులో చంద్రబాబు నాయుడుకి తప్పకుండా బెయిల్ లభిస్తుందని రఘురామ కృష్ణంరాజు ఆశాభావం వ్యక్తం చేశారు. ఔటర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు తో పాటు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను కూడా A14 గా చేర్చినట్లు టీవీలో చూశాను.
సాధారణంగా అయితే ఆరు నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రతిపక్ష నేతలపై కేసులు నమోదు చేయడం వెనుకనున్న అర్థం, పరమార్థం ప్రజలందరికీ తెలుసు. డిసెంబర్ లోనే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష పార్టీలను, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడానికే ఈ రకమైన కేసులను నమోదు చేయిస్తున్నారు. సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు తరఫున దాఖలు చేసినా రిమాండ్ రిపోర్ట్ క్వాష్ పిటీషన్ ఈరోజు లిస్ట్ కావలసి ఉండగా, రాజ్యాంగ ధర్మాసనం బెంచ్ ఏర్పాటు వల్ల లిస్ట్ కాలేదు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మెన్షన్ చేస్తానని హామీ ఇవ్వడం వల్ల, బుధవారం నాడు కచ్చితంగా కేసు లిస్ట్ అయ్యే అవకాశం ఉంది. బుధవారం నాడు కచ్చితంగా చంద్రబాబు నాయుడుకి సుప్రీంకోర్టులో ఉపశమనం లభిస్తుందన్న ఆశా భావాన్ని రఘురామకృష్ణం రాజు వ్యక్తం చేశారు. గతంలో సుప్రీంకోర్టు 17A నిబంధనను అనుసరించి ఇచ్చిన తీర్పులను మరోసారి ఆయన ప్రస్తావించారు. బుధవారంనాడు కేసు విచారణ జరిగితే, ఇంట్రీమ్ ఆర్డర్ లభిస్తుందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నట్లుగా ఆయన తెలిపారు