– హామీల అమలుపై ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించాలి
– బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపు
– ప్రభుత్వ పాఠశాలలో విషాహారం తిని మరణించిన శైలజ కుటుంబానికి 2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్ : బూటకపు హామీలతో తెలంగాణ యువతను కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసం చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. యువకులకు ఇచ్చిన హామీలు ఏమైయ్యాయని ప్రశ్నించారు. హామీలు ఏమైయ్యాయని కాంగ్రెస్ పార్టీ నాయకులను గట్టిగా ప్రశ్నించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన తెలంగాణ జాగృతి నాయకులతో శుక్రవారం నాడు తన నివాసంలో ఎమ్మెల్సీ కవిత సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ… యువ వికాసం కింద రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామని, విద్య జ్యోతుల పథకం కింద ఎంఫిల్, పీహెచ్డీ పూర్తి చేసిన ఎస్సీ, ఎస్టీ యువతకు రూ 5 లక్షలు ఇస్తామని చెప్పి ఓట్లు దండుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వాటి ప్రస్తావనే చేయకపోవడం శోచనీయమని విమర్శించారు. అలాగే, రూ 3 లక్షల లోపు ఆదాయం ఉన్న బీసీలకు 100 శాతం ఫీజు రియింబర్స్ మెంట్ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ… కనీసం అసలు రియింబర్స్ మెంట్ మొత్తాన్నే ఇవ్వడం లేదని ఎండగట్టారు.
ఫీజు రియింబర్స్ రాక అనేక మంది ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ నియామకాలపై రాష్ట్ర ప్రభుత్వం కాకి లెక్కలు చెబుతోందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్న నియామక లెక్కల్లో అనేక వాటికి బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే పరీక్షలు జరిగాయని గుర్తు చేశారు.
మహిళలకు నెలకు రూ. 2500 ఎప్పటి నుంచి చెల్లిస్తారో సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. లీటర్ పెట్రోలు రూ. 40 కే ఇస్తామన్న హామీ ఎప్పుడు అమలు చేస్తారని అడిగారు. విద్యార్థినులకు స్కూటి ఇస్తామన్న హామీ ఏమైందని నిలదీయాలని సూచించారు.