– రాజన్న బిడ్డపై దౌర్జన్యం ఏమిటన్న షర్మిల
– విజయమ్మదీ అదే ఆవేదన
– మేం చూడని పోలీసులా అని గతంలో విజయమ్మ ఆగ్రహం
– తెలంగాణలో పోలీస్‌రాజ్‌పై తల్లీకూతుళ్ల ఆగ్రహం
– పోలీసులను కుక్కల్లా వాడుకుంటున్నారని ఫైర్
– అటు ఆంధ్రాలోనూ దాదాపు ఇలాంటి దృశ్యాలే
– అమరావతి ఆడబిడ్డలపై పోలీసుల లాఠీచార్జి
– మహిళలను కడుపులో తన్నిన అరాచకం
– అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి అరెస్టులు
– ఏపీలో కొడుకు రాజ్యంలోనూ అవే దృశ్యాలు
– తెలంగాణలో పోలీసులపైనే చేయి చేసుకున్న షర్మిల, విజయమ్మ
– సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు
– పోలీసులను గాడిదలు కాస్తున్నారా అని షర్మిల ఫైర్
– ఆంధ్రాలో పోలీసులను పల్లెత్తు మాట అనని అమరావతి మహిళలు
– రంగనాయకమ్మ, గౌతు శిరీష, సాయి కల్యాణిపై పోలీసుల అనుచిత ప్రవర్తన
– రాష్ట్రం ఏదైనా పోలీసు లాఠీలకు అంతా సమానమే
– ఏపీలో మహిళపై ప్రభుత్వ దాడులను ఒక్కసారి కూడా ఖండించని షర్మిల, విజయమ్మ
– తెలంగాణలో మాత్రం కేసీఆర్ పాలనపై విసుర్లు
– తమపై సాధారణ పౌరులు దాడి చేస్తే పోలీసులు ఇంత ‘గౌరవం’గా స్పందిస్తారా?
– షర్మిల-విజయమ్మ తీరుపై పౌర సమాజంలో చర్చ
( మార్తి సుబ్రహ్మణ్యం)
నేను రాజశేఖర్‌రెడ్డి బిడ్డను. బోనులో పెట్టినా పులి.. పులే. ఇక్కడున్నది రాజశేఖర్‌రెడ్డి బిడ్డ. ఎవరికీ భయపడం తెలీదు. నేను రాజన్న బిడ్డనని చూడకుండా నాపై పోలీసులు అగౌరవంగా ప్రవర్తించారు. ఆత్మరక్షణ కోసం నేను వారిని అడ్డుకునే ప్రయత్నం చేశా.నాపై పోలీసులు మళ్లీ దాడి చేస్తారన్న భయంతోనే వారిని తోసివేశా. నన్ను చూసేందుకు అమ్మ వస్తే తప్పా? ఆవిడ పెద్దావిడ అన్న ఇంగితం లేదు. మా అమ్మ పోలీసుపై చిన్న వేటు వేసింది. ఆమె వేసిన వేటుకు కనీసం ఈగయినా చస్తుందా? మహిళలు అనే ఇంగితం కేసీఆర్ ప్రభుత్వానికి లేదు. ఇలాంటి కేసీఆర్ పాలనను తాలిబన్లతో పోలిస్తే తప్పేంటి? రాజశేఖర్‌రెడ్డి బిడ్డను జైల్లో పెట్టించాడు. రాజశేఖర్‌రెడ్డి భార్యను అవమానించిన కేసీఆర్ ఇంతకు ఇంత అనుభవిస్తాడు.
– చంచల్‌గూడ జైలు వద్ద మీడియాతో వైఎస్ కుమార్తె, వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల
ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే తప్పా? ప్రశ్నించే గొంతుకను అరె స్టు చేసి జైల్లో పెట్టారు.
– షర్మిల తల్లి విజయమ్మ ఆగ్రహం
తెలంగాణలో పోలీసు ఆటవిక రాజ్యం నడుస్తోందంటూ.. వైఎస్ కూతురు షర్మిల చేసిన ఆరోపణలు రెండు తెలుగురాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. సిట్ ఆఫీసుకు వెళుతున్న షర్మిలను పోలీసులు ఆపడం, ఆ క్రమంలో ఆమె పోలీసులపై చేయి చేసుకోవడం… ఆ తర్వాత ఆమె తల్లి విజయమ్మ కూడా పోలీసుపై చేయి చేసుకోవడం.. తర్వాత షర్మిలను కోర్టు ఆదేశాలతో, చంచల్‌గూడ జైలుకు పంపిన ఘటన సంచలనం సృష్టించింది. పోలీసులు అతిగా, దౌర్జన్యం చేస్తున్నందుకే తాము ప్రతిఘటించాల్సి వచ్చిందన్నది షర్మిల వివరణ.
నిజానికి చట్టప్రకారం పోలీసులు ఎవరిపైనయినా చేయి వేయకూడదు. మహిళలను అరెస్టు చేసే ముందు మహిళా పోలీసులు ఉండాలి. సాయంత్రం తర్వాత వారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకురాకూడదు. ఈ నిబంధనల్లో వృద్ధులకు సైతం, చట్టం కొన్ని వెసులుబాటునిచ్చింది. కానీ అవి కాగితాలపైనే కనిపిస్తుంటాయి.
పోలీసు లాఠీలకు చట్టం తెలియదు. దానిని ఎలా వాడాలన్నదే తెలుసు. పోలీసులకు రాజన్న బిడ్డనా? రాజన్న భార్యనా? ఇంకో ప్రముఖుడి కుటుంబమా? అన్నది అనవసరం. సదరు ఫ్యామిలీ అధికారంలో ఉందా? లేదా? అన్నదే అవసరం. ఈ సూత్రం ఒక్క తెలంగాణలోనే కాదు. అటు ఆంధ్రాలోనూ విజయవంతంగా అమలవుతోంది. ఆ వాస్తవం గుర్తించకుండా, ఒక్క తెలంగాణలోనే…. ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయన్న షర్మిల ఆవేదన, ఆక్రోశం అర్ధరహిత మన్నది ప్రజాస్వామ్యవాదుల ఉవాచ.
తన సోదరుడు సీఎంగా ఉన్న ఏపీలో.. ఇంతకుమించిన దురదృష్టకర పరిస్థితులు ఉన్నాయని, షర్మిల గుర్తించకపోవడమే విచిత్రమన్నది రాజకీయ పరిశీలకుల ఉవాచ. పెద్దావిడ విజయమ్మను గౌరవించాలన్న సోయ లేదా అని తెలంగాణ సర్కారుకు షర్మిల వేసిన ప్రశ్నలనే.. అక్కడ ఆంధ్రాలోనూ పూదోట రంగనాయకమ్మ అనే ఓ పెద్దావిడ, చాలాకాలం క్రితమే జగనన్న సర్కారుకు సంధించడం ప్రస్తావనార్హం. బోత్ ఆర్ నాట్ సేమ్!
తెలంగాణలో తాను ఎదుర్కొంటున్న పరిస్థితికి మించిన దారుణాలు జరుగుతున్నాయని, ఆమె తెలుసుకోకపోవడమే విస్మయకరం. కానీ ఇప్పటివరకూ షర్మిల గానీ, విజయమ్మ గానీ ఆ ఘటనలపై.. ఒక్కసారి కూడా ఖండించిన దాఖలాలు, భూతద్దం వేసి వెతికినా కనిపించలేదన్నది ఏపీ మహిళామణుల అసంతృప్తి.
అమరావతి ఉద్యమానికి ఏడాది అయిన సందర్భంగా.. బోనం ఎత్తుకుని కనకదుర్గ గుడికి వెళుతున్న మహిళలపై, పోలీసులు అనాగరికంగా వ్యవహరించిన ఘటనలు ఇంకా గుర్తే. రోడ్డుపై మహిళలను ఆపి, కడుపులో బూటుకాలితో తన్నిన దృశ్యాలు ఎవరూ మర్చిపోరు. గర్భిణీలను సైతం గోసపెట్టిన దృశ్యాలు అందరికీ గుర్తే.
పూదోట రంగనాయకమ్మ అనే వృద్ధురాలు, సోషల్‌మీడియాలో పోస్టు పెట్టారని ఒకసారి.. టీడీపీ మహిళా నేత గౌతు శిరీషపై మరోసారి.. తాజాగా సాయికల్యాణి అనే మహిళను బట్టలు కూడా మార్చుకునే అవకాశం ఇవ్వకుండా వేధించిన వైనం సోషల్‌మీడియాను ఫాలో అయ్యే అందరికీ తెలుసు. అయితే పోలీసుల దాడికి గురయిన మహిళలు.. ‘నేను ఫలానా ఆయన బిడ్డను. నేను పులిని. నేను సింహాన్ని’ అని మీడియాకెక్కిన దాఖలాలు లేవు.
ఇవే కాదు. గ్రామాల్లో అధికార పార్టీ కార్యకర్తలు, మహిళల జుట్టు ఈడ్చుకుండా వెళ్లడం, ఇళ్లకు దారిలేకుండా అడ్డంగా గోడ కట్టడం వంటి అనాగరిక దృశ్యాలు, సోషల్‌మీడియాలో తరచూ దర్శనమిస్తూనే ఉన్నాయి. స్వయంగా సీఎం నివాసానికి కూతవేటు దూరంలోనే, మహిళలపై జరిగిన అత్యాచారం గురించి ఎంత తక్కువ చెబితే అంతమంచిది. ఇంకా ఏపీలో మహిళలపై జరుగుతున్న దారుణాల గురించి రాస్తే రామాయణం. చెబితే మహాభారతం అవుతుంది.
ఏపీలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలతో పోలిస్తే, షర్మిల-విజయమ్మకు జరిగిన అవమానం బహు తక్కువేనని చెప్పకతప్పదు. అమరావతి మహిళలను ఈడ్చుకువెళ్లి, కడుపులో తన్నిన దారుణాలతో పోలిస్తే.. షర్మిలకు జరిగిన అవమానం ఏపాటి? ఏపీ మహిళలు పోలీసుల చేతితో దెబ్బలు తినడమే తప్ప, పోలీసులను కొట్టిన సందర్భాలు లేవు. పోలీసులపైనే కారు ఎక్కించిన దాఖలాలు అస్సలు లేవు. పోలీసులను కుక్కలు అని అభివ ర్ణించిన సంఘటనలు లేవు. మరి ఈ విషయంలో షర్మిల-విజయమ్మ అదృష్టవంతురాలే కదా?
పైగా భర్త అనిల్‌ను పోలీసుస్టేషన్‌లో ఉన్న భార్యతో మాట్లాడనిచ్చి, గౌరవించింది కదా? ఇలాంటి సౌకర్యాలు ఆంధ్రాలో ఏ మహిళకూ లేవు కదా? ఆ లెక్కన వారిద్దరికీ కేసీఆర్ సర్కారు, చాలా మినహాయింపులు ఇచ్చినట్లే కదా? అమరావతి మహిళలకు ‘సోదరుడి సర్కారు’ ఇచ్చిన ‘గౌరవ ం’.. కేసీఆర్ సర్కారు, తల్లీకూతుళ్లకు ఇవ్వనందుకు సంతోషించాలికదా? అసలు ఆంధ్రాలో ‘ఇంతకుమించిన’ దారుణాలు జరుగుతుంటే, సాటి మహిళగా ప్రశ్నించని షర్మిల-విజయమ్మకు.. తెలంగాణ సర్కారును విమర్శించే, నైతిక అర్హత ఎక్కడిదన్నది మహిళాలోకం ప్రశ్న.
అయితే బుద్ధిజీవులకు ఇక్కడో ధర్మ సందేహం. పౌరులను కొట్టడం పోలీసుల జన్మహక్కు. దానిని ఎవరూ ప్రశ్నించకూడదు. ఖర్మకాలి ఎవరైనా పోలీసులను రోడ్డుమీద ప్రశ్నించినా.. చివరాఖరకు చలాన్లు వేసే ట్రాఫిక్ పోలీసులను ప్రశ్నించినా, ఇక సదరు పౌరుడికి బడితపూజ తప్పదు.
అలాంటి పోలీసులపై.. పౌరుడెవరయినా చేయి చేసుకుంటే, ఇంకేమైనా ఉందా? లాకప్‌లో వేసి, వాడు వేసే కేకలతో పైకప్పులు ఎగిరేలా చావగొట్టడం ఎన్నోసార్లు చూసిన దృశ్యాలే. కోర్టుకు పంపించకుండా, లాకప్‌లోనే ‘రాచమర్యాదలు’ చేసి పంపించరూ? మరి షర్మిల- విజయమ్మ రివర్స్‌లో, పోలీసుల చెంప ఛెళ్లుమనిపించి.. వెనక్కి నెట్టివేసే సుందర సుమధుర దృశ్యాలు, సోషల్‌మీడియాలో దర్శనమిస్తున్నా హైదరాబాద్ పోలీసులు.. ‘రొటీన్‌కుభిన్నం’గా సహనం వహించడమే గ్రేట్.
షర్మిల-విజయమ్మ జమిలి దాడి ఎపిసోడ్‌లో.. పోలీసుల సహనం చూసి, సీతమ్మవారికీ ఈర్ష్య వచ్చి తీరాలి. అయితే ఒక్కటే సందేహం. ‘ ఈ నయా గౌతమబుద్దుడి సిద్ధాంతం’.. షర్మిల ఫ్యామిలీకే పరిమితమా? పౌరులందరికా? అన్నది జనం ప్రశ్న.