Suryaa.co.in

Features

కమ్యూనిస్టులూ.. కార్ల్‌మార్క్స్ కన్నా గొప్పవాడు రజనీకాంత్

సూపర్ స్టార్ అవడం అంటే మాటలు కాదు.‌ 1980కే రజనీకాంత్ తమిళ్ష్ సినిమా సూపర్ స్టార్. చలన చిత్ర నటుల్లో వైలక్షణ్య వైప్లవ్యం రజనీకాంత్. Actor of design రజనీకాంత్.‌ ఆయన గొప్ప నటుడు‌‌ కూడా. కొన్ని సినిమాల్లో ఉన్నతమైన నటనను ప్రదర్శించారు‌.

కమల్ హాసన్ అన్నయ్య చారుహాసన్ నాతో ఒకసారి ఇలా అన్నారు:‌ “నాకు మా‌ తమ్ముడు తరువాత రజనీకాంత్‌ గొప్ప నటుడుగా నచ్చుతాడు”.
మన దేశంలో Rough and rugged హీరోగా రాణించిన తొలి నటుడు రజనీకాంత్! కుప్పత్తు రాజా (మురికి‌వాడ రాజు) అన్న పేరుతో రజనీకాంత్‌ హీరోగా సినిమా వచ్చింది. ఇలాంటి పాత్ర నాయకుడుగా సినిమా‌ రావడం రజనీకాంత్ తోటే మొదలయింది. అలాంటి రజనీకాంత్ రాఘవేంద్రస్వామిగా కూడా చేశారు! రజనీకాంత్ పాటలకు లిప్ మూమెంట్ బాగా చేస్తారు. ఈ విషయంలో కమల్ హాసన్ కన్నా రజనీకాంత్ గొప్ప.

నమ్రత… ఈ నమ్రత రజనీకాంత్ లో మెండుగా ఉంటుంది. నేను కళ్లారా చూసిన ఒక సందర్భం: రజనీకాంత్‌ ఒక షూటింగ్ సమయంలో ఫ్లోర్ లోంచి బయటకు వస్తున్నారు. అక్కడ గచ్చు చిమ్ముతున్న ఒక మహిళ గబుక్కున చీపురు చాటున పెట్టేసి , తన‌ రెండు చేతులు జోడించి “అయ్యా వణక్కం” అంది. రజనీకాంత్ ప్రతిస్పందించే లోపు ఒక వ్యక్తి మధ్యలోకి వచ్చాడు. రజనికాంత్ ఆ వ్యక్తిని దాటుకుని ఆ గచ్చు చిమ్మే మహిళకు తన రెండు చేతులూ జోడించి “వణక్కం” అని బదులిచ్చారు. నాకు ఇప్పటికీ ఆ దృశ్యం కళ్లకు కట్టినట్టు ఉంది. అదీ రజనీ‌కాంత్.

కృతజ్ఞత… ఇది పుష్కలంగా ఉంది రజనీకాంత్‌లో. నా చిన్నప్పటి నుంచీ వేర్వేఱు సందర్భాల్లో ఆయన కృతజ్ఞత‌ను వెలిబుచ్చిన తీరు నన్నేంతో కదిలించింది. చిన్న చిన్న అసిస్టెంట్ డైరక్టర్స్ ను గుర్తుంచుకుని వాళ్లకు కృతజ్ఞత తెలుపుతూంటారు. ఆయనకు ఇంగితమూ ఎక్కువగానే ఉంటుంది.

నేను నా చిన్నతనం నుంచీ‌ రజనీకాంత్ అభిమానిని చాల మందిలాగా. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత రజనీకాంత్ అభిమానే. ఎన్ని పనులున్నా , ఎంత ఒత్తిడిలో‌ ఉన్నా రజనీకాంత్ సినిమాలు చూసే వారట ఆమె.

తన విజయానికీ, తన ఈ స్థితికి తానూ‍, తన ప్రతిభ కారణాలు కావు‌ అంతా భగవంతుడు ఇచ్చిందన్న సత్యాన్ని అర్థం‌ చేసుకోగలిగారు రజనీకాంత్. అదీ ఆయన నిజమైన గొప్పతనం. కాలం లేదా సమయం లేదా time గొప్పతనాన్ని అర్థం చేసుకున్నవారు రజనీకాంత్.

నేనూ, నా మిత్రులూ చిన్నప్పటి నుంచీ రజనీకాంత్ గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. పెద్దలంటే రజనీకాంత్ కు గౌరవం. తనకు పూర్వం ఉన్న నటులపై, పెద్దలపై ఆయనకున్న మర్యాద మన తెలుగు నటుల్లో కనిపించదు.

షారూఖాన్ లాంటి వాళ్లు రజనీకాంత్ పై “తలైవా” అంటూ పాటలు చెయ్యడం చాల గొప్ప విషయం.‌ మన చిరంజీవికి కూడా రజనీకాంత్ ప్రేరణ.

భారతదేశంలో గొప్ప screen presense ఉన్న ఎన్.టీ. రామారావు, ఎస్.వి. రంగారావు, కన్నడ రాజకుమార్, దిలీప్ కుమార్, ఉత్తమ్ కుమార్, బలరాజ్ సాహ్నీ, షమ్మీకపూర్, అమితాబచన్, మమ్ముట్టి, మోహన్ లాల్, చిరంజీవి వంటి కొద్దిమంది నటుల్లో రజనీకాంత్ ఒకరు. రజనీకాంత్ screen presense చాల గొప్పది.

రజనికాంత్ సేవా కార్యక్రమాలు చెప్పుకోతగ్గవి. కమ్యూనిస్టులకన్నా, Karl Marx కన్నా, తెలుగు సాహితీ వేత్తలకన్నా , ఎమ్.ఎ., ఎమ్.ఫిల్., పీహెచ్.డీ.ల వాళ్లకన్నా, మేధావులకన్నా సమాజానికి, సాటి మనిషికి రజనీకాంత్ ఉపయోగకరమైన మనిషి. సాటి, సగటు మనిషికి, సమాజానికి ప్రయోజనకరంగా బతికారు రజనీకాంత్.

రజనీకాంత్ మూటలు మోసిన కూలీ స్థాయి నుంచి వందల కోట్ల సంపద ఉత్పత్తికి మూలకం, కీలకం ఐన శక్తి. తానొక శక్తై , పలువురికి ఉపాధి కల్పించిన వ్యక్తి. రజనీకాంత్ జీవితంలో అట్టడుగు స్థాయి నుంచి ఉచ్చస్థాయికి ఎదిగిన వ్యక్తి. రజనీకాంత్ కులంతోనూ, మతంతోనూ ఎదిగిన, బతుకుతున్న వ్యక్తి కాదు. అక్రమంగానూ, అనర్హతతోనూ, పనికిమాలినతనంతోనూ పబ్బం గడుపుకుంటున్న వ్యక్తి కాదు రజనీకాంత్.
రజనీకాంత్ జాతీయతా భావాల వ్యక్తి.
“తన విజయం తనది కాదు”, “తాను ఒక సామాన్యుణ్ణి” అన్న భావన, ఆలోచన ఉన్న విజయవంతమైన వ్యక్తి రజనీకాంత్.

Rajanikant, a cult actor and a desirable human.

– రోచిష్మాన్
9444012279

LEAVE A RESPONSE