– త్యాగాలు కాంగ్రెస్‌కు అలవాటే
– దేశం కోసం ప్రాణాలర్పించిన ఘనత రాజీవ్‌దే
– రాజీవ్ వర్థంతి సభలో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్: కేంద్ర మంత్రిగా కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలబడాల్సిన సమయంలో కిషన్ రెడ్డి దుప్పటి కప్పుకుని పడుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
బుధవారం మాజీ ప్రధాని, భారతరత్న రాజీవ్ గాంధీ 34వ వర్థంతి సందర్భంగా హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి రేవంత్ రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, దేశ ప్రధానిగా రాజీవ్ గాంధీ చేసిన సేవలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. సెక్రటేరియట్ వద్ద రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే కొందరు విమర్శలు చేశారని, సంకుచిత మనస్తత్వం కలిగిన కొందరు రాజీవ్ గాంధీని విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన చరిత్ర గాంధీ కుటుంబంతోపాటు కాంగ్రెస్ పార్టీదని.. దేశ రక్షణ కోసం భారత జవాన్లకు అండగా నిలబడతామని, అది తమ బాధ్యత అని స్పష్టం చేశారు. దేశ సమగ్రత విషయంలో మేం రాజకీయాలు చేయం. దేశ భద్రతకు తాము కట్టుబడి పని చేస్తామన్నారు.
లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీని విమర్శించడం ద్వారా బీజేపీ నాయకులు తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని, తాము బయటకు వచ్చి కేంద్రానికి అండగా ఉన్నామని ప్రకటించి, మద్దతు తెలిపామని గుర్తు చేశారు.
ఆనాడు కనీసం మమ్మల్ని అభినందించని వ్యక్తి ఇవాళ రాహుల్ గాంధీ ని విమర్శిస్తున్నారంటూ కిషన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన చేతగానితనాన్ని కప్పి పుచ్చుకునేందుకే రాహుల్ గాంధీపై కిషన్ రెడ్డి విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.