రైతు దోపిడీ కేంద్రాలుగా ఆర్బీకేలు..

– ధాన్యం కొనుగోలులో వైసిపి దళారుల రాజ్యం క్వింటాకు 200 దోపిడి
– నియంత్రణలో లేకుంటే పోరాటం తప్పదు
– పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీ.వీ ఆంజనేయులు డిమాండ్

రైతు భరోసా కల్పిస్తామని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్. బి.కే లు రైతు దోపిడి కేంద్రాలుగా మారాయని పల్నాడు టిడిపి జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆరోపించారు. స్థానిక టిడిపి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో రైతులను దగా చేస్తున్నారని, క్వింటాకు 200 రూపాయలు దోచుకుంటూ మోసం చేస్తున్నారని విమర్శించారు.

మిల్లర్లు రైతుల మధ్య వైసిపి దళారులు తయారై ధాన్యం కొనుగోలులో వ్యత్యాసాలు చెబుతూ రైతుకు అన్యాయం చేస్తూ వందల కోట్లు రాష్ట్రవ్యాప్తంగా దోచుకుంటున్నారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎంపీ సుభాష్ చంద్రబోస్ ధాన్యం కొనుగోళ్లలో దోపిడి జరుగుతుందని వెల్లడించడం జరిగిందన్నారు.

నాడు ఎరువులను కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయించిన ఘనత వైసిపి ప్రభుత్వానిదే అన్నారు. ఆర్. బి. కె కేంద్రాలు నేడు రైతుల దోపిడి కేంద్రాలుగా మారాయని, ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలు లేకుండా నియంత్రణ చేపట్టకపోతే టిడిపి రైతులకు అండగా నిలిచి పోరాటం చేస్తుందని హెచ్చరించారు.

Leave a Reply