40 కోట్లు అధిష్టానం ఇవ్వనందుకే పోటీచేయడం లేదంటారా?

– ధన్య వాదాలు చెప్పకపోగా, విమర్శిస్తారా?
– గోవిందరెడ్డి వైసీపీని దెబ్బ తీయాలని చూస్తున్నరా?
– గోవిందరెడ్డి పై విరుచుకుపడ్డ “రెడ్యం”
మరణించిన శాసనసభ సభ్యుల కుటుంబాలవారు పోటీ చేస్తే తెదేపా పోటీ చేయకూడదని తేదేపా అనుసరిస్తున్న సాంప్రదాయాన్ని అధినేత నారా చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయాన్ని అనుసరించి, బద్వేలులో తెదేపా పోటీ చేయడం లేదని వైసిపి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సైతం మరణించిన శాసనసభ్యులు డాక్టర్ వెంకటసుబ్బయ్య సతీమణి డాక్టర్ సుధా పోటీ చేస్తున్నందున … పోటీ చేయకుండా సహకరించాలని కోరడంతో, తెదేపా పోటీ చేయకపోవడంపై అభినందించాల్సింది పోయి.. మాజీ శాసనమండలి సభ్యులు డిసి గోవిందరెడ్డి 40 కోట్లు అధిష్టానవర్గం ఇవ్వనందున బద్వేల్ లో తెదేపా పోటీ చేయడం లేదని వ్యాఖ్యానించడం గోవిందరెడ్డి కి సంస్కారం, సంస్కృతి లేదని తెదేపా రాష్ట్ర కార్య నిర్వహణ కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
బుధవారం సాయంత్రం విజయవాడలోని పత్రికా కార్యాలయాలకు రెడ్యం ఒక ప్రకటన విడుదల చేశారు.
స్థానిక తెదేపా నేతలు 40 కోట్లు అడిగినందుకు తెదేపా పోటీ చేయడం లేదని డీసీ గోవిందరెడ్డి “చింతామణి — శ్రీరంగనీతులు” చెబుతున్నారని ఆయన విమర్శిస్తూ.. బద్వేల్ మాజీ ఎమ్మెల్యే కొని రెడ్డి విజయమ్మ కుటుంబం డబ్బు కోసం ఏనాడు ప్రాకులాడ లేదని తన సొంత డబ్బులు వెచ్చించి ఎందరినో ఆదుకున్న ఘనత విజయమ్మదేనని.. బిజివేముల వీరారెడ్డి సేవా ట్రస్టు ద్వారా కోట్లు ఖర్చు చేసిన కుటుంబం వారిదన్నారు.
దమ్ము,ధైర్యం ఉంటే గోవిందరెడ్డి దీనిని నిరూపించాలని లేకుంటే రాజకీయాల నుండి తప్పుకోవాలని రెడ్యం సవాల్ విసిరారు. డీసీ గోవిందరెడ్డి బృందం చేసిన భూదందాలు, అక్రమాలపై వైసిపి అధిష్టానం కన్నెర్ర చేసి డీసీ గోవిందరెడ్డి ఇన్చార్జి పదవి నుండి తొలగించారని,దాంతో వైసీపీని దెబ్బతీసేందుకే గోవింద రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని రెడ్యం ధ్వజమెత్తారు.
బద్వేలు లో తెదేపా పోటీచేయవద్దని బహిరంగంగా అభ్యర్థించిన సజ్జల నిజంగా తేదేపాకు బలం ఉంటే బద్వేలులో ఎందుకు పోటీ చేయలేదనడం “ఏటి లో ఉన్నప్పుడు ఏటి మల్లన్న– దాటాక బోడి మల్లన్న” అన్నట్టు ఉందని ఇది వైసిపి మార్కు నీచ రాజకీయమని ఆయన మండిపడ్డారు. వీరి విమర్శలతో తెదేపా శ్రేణుల్లో ఆగ్రహావేశాలు ఉన్నాయని దీనికి వైసిపి వారే బాధ్యత వహించాలని రెడ్యం హెచ్చరించారు.