Suryaa.co.in

Andhra Pradesh

గుర్తు పెట్టుకో పెద్దిరెడ్డీ.. ఇది బిగినింగ్‌ మాత్రమే: చంద్రబాబు నాయుడు

మంత్రి పెద్దిరెడ్డి ఆగడాలకు అంతేలేకుండా పోయిందని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత, నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.ఆయన అరాచకాల్ని సహించేది లేదని, పుంగనూరులోనే దీటైన జవాబిస్తామన్నారు. కుప్పంలో పోలీసులపై తెలుగుదేశం కార్యకర్తలే దాడి చేశారన్న పెద్దిరెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.తమ జోలికొస్తే తడాఖా చూపుతామని హెచ్చరించారు.

తన రాజకీయ జీవితంలో చాలా మందిని చూశానని.. ఇప్పుడు రాజకీయాల ముసుగులో ఉన్న నేరస్థులతో పోరాడుతున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.కుప్పంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కుప్పంలో బుధవారం జరిగిన ఘటనల నేపథ్యంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన విమర్శలను మీడియా ప్రతినిధులు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజల పక్షాన తెదేపా పోరాటం కొనసాగుతుందని చెప్పారు.

“పెద్దిరెడ్డీ గుర్తు పెట్టుకో.. ఇది బిగినింగ్‌ మాత్రమే. తమాషా ఆటలాడుతున్నావు.. నీ తడాఖా ఏంటో చూస్తా. నేను రెచ్చగొట్టానా? మాపై తప్పుడు కేసులు పెట్టించి పైశాచిక ఆనందం పొందుతున్నావు. అధికారంలో ఉన్న 14 ఏళ్లు నేనూ అలాగే అనుకునుంటే నువ్వు జిల్లాలో తిరిగేవాడివా? ఇప్పుడు ఇష్టప్రకారం అరాచకాలు చేస్తారా? కుప్పంలో కప్పం కట్టాలని బెదిరిస్తావా? నువ్వొక రాజకీయ నాయకుడివా? తమాషా అనుకోవద్దు.. వదిలిపెట్టం. కుప్పంలో రౌడీలను ప్రోత్సహిస్తామంటే ఖబడ్దార్‌..!” అని చంద్రబాబు అన్నారు.

LEAVE A RESPONSE