శాఖ పునర్వవస్థీకరణ పనులు వేగంగా చేయాలి

0
13

-కొత్తగా ఏర్పడిన ప్రాంతాల్లో కొత్త రోడ్లు, సిబ్బంది నియామకం ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
-రోడ్ల మరమ్మత్తులు, నిర్వహణపై డిసెంబర్ 10లోపు టెండర్ల -ప్రతిపాదనలు పూర్తి కావాలి, డిసెంబర్ 15 నాటికి పనులు ప్రారంభించాలి
-వరదనీటితో దెబ్బతిన్న రోడ్లకు ప్రాధాన్యత ఇవ్వాలి..అటవీ భూముల సమస్యపై దృష్టి పెట్టాలి
-గుంతల వల్ల ప్రజలకు అసౌకర్యం కలగకుండా వేగంగా పనులు చేపట్టాలి
-పంచాయతీరాజ్ ఉన్నతాధికారులతో మంత్రి ఎర్రబెల్లి సమీక్షా సమావేశం

రాష్ట్రంలోని పంచాయతీ రాజ్ రోడ్లను అందంగా, అద్దంలా ఉంచాలన్న గౌరవ ముఖ్యమంత్రి కేసిఆర్  ఆదేశాల మేరకు పంచాయతీరాజ్ శాఖ పునర్వవస్థీకరణ వేగవంతం చేయాలని, అధికారాలను, బాధ్యతలను వికేంద్రీకరంచి, అవసరమైన పోస్టులు భర్తీ చేసేందుకు వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ మేరకు హైదరాబాద్, మంత్రుల నివాస ప్రాంగణంలో పంచాయతీరాజ్ కార్యదర్శి రఘునందన్ రావు, ఇంజనీర్ ఇన్ ఛీఫ్ సంజీవరావు, ఇతర అధికారులతో నేడు సమీక్ష నిర్వహించారు.

రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన మండలాలు, గ్రామ పంచాయతీలలో కొత్త సర్కిళ్లు, డివిజన్ల వారిగా వేయాల్సిన కొత్త రోడ్లను, అవసరమైన సిబ్బంది కోసం కొత్త పోస్టుల భర్తీకి సంబంధించి 24వ తేదీ సాయంత్రంలోగా నివేదిక ఇవ్వాలన్నారు.

ఈ నెల 19వ తేదీన జరిగిన పంచాయతీ రాజ్ ఇంజనీర్స్ వర్క్ షాప్ లో చర్చించిన దాని ప్రకారం రోడ్ల తక్షణ మరమ్మత్తులు, నిర్వహణ ప్రతిపాదనలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలు, నియోజక వర్గాల వారిగా అత్యవసరమైన పనుల జాబితా రూపొందించాలన్నారు. డిసెంబర్ 10వ తేదీ నాటికి రోడ్ల మరమ్మత్తుల టెండర్లు పిలిచేందుకు సిద్ధం చేయాలన్నారు. పనులకు సంబంధించి ఈ నెల 30వ తేదీలోపు మంజూరు తీసుకుని డిసెంబర్ 15 నాటికి పనులు ప్రారంభించాలన్నారు.

వరదనీటితో దెబ్బతిన్న రోడ్ల మరమ్మత్తులు, నిర్వహణకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రోడ్ల నిర్మాణంలో అటవీ భూముల సమస్యను గుర్తించి…తగిన ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. నాణ్యతలో రాజీ పడకుండా ఆధునిక విధానాల ద్వారా పనులు చేయాలన్నారు.

రోడ్లపై ప్రయాణించే ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు వెంటనే రోడ్ల మరమ్మత్తులు, నిర్వహణ చేపట్టాలన్నారు. రాష్ట్రంలో పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 67 వేల కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయని, వీటిని అద్దంలా ఉంచాలన్నారు. ఇందుకోసం పని వికేంద్రీకరణ చేసి పైనుంచి కింది స్థాయి వరకు గల ఇంజనీర్లకు బాధ్యతలు, అధికారాలు ఇవ్వాలన్నారు.

శాఖ పునర్వవస్థీకరణ కోసం ముఖ్యమంత్రి కేసిఆర్ అవసరం అయితే మరో వంద కోట్ల రూపాయలు అదనంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని, దీనిని దృష్టిలో పెట్టుకుని వెంటనే ప్రతిపాదనలు సిద్దం చేయాలని చెప్పారు.