– భూ కేటాయింపులపై సమగ్ర విధానం
– లీగల్ అడ్డంకులను అధిగమించి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు
– వచ్చే జూన్ నాటికి అన్ని టిడ్కో ఇళ్లు పూర్తి
– మంత్రులు అనగాని, నారాయణ, పార్థసారథి వెల్లడి
అమరావతి : సర్వీసు ఇనాం భూముల సమస్యల పరిష్కారానికి సమగ్ర విధానం తేవాలని నిర్ణయించినట్టు రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. సర్వీసు ఇనాం భూములపై పూర్తి స్థాయి అధ్యయనం కోసం దేవాదాయశాఖ అధికారులు, తాహశీల్దార్లతో కమిటీలు వేస్తున్నామని, ఈ కమిటీలు సమగ్ర అధ్యయనం చేసి 45 రోజుల్లోగా నివేదిక ఇస్తాయని చెప్పారు. ఆ నివేదకను చర్చించి ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయాలు తీసుకొని సర్వీసు ఇనాం భూముల సమస్యకు పరిష్కారం చూపిస్తామని చెప్పారు.
వెలగపూడి సచివాలయంలో శుక్రవారం రెవెన్యూ వ్యవస్థలో సంస్కరణలపై గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం జరగగా మంత్రులు అనగాని సత్యప్రసాద్, పి.నారాయణ, పయ్యావుల కేశవ్, ఎన్ఎండి ఫరూక్ పాల్గొన్నారు. అనంతరం జరిగిన అందరికీ ఇళ్లు పై ఏర్పాటైన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశంలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, పి.నారాయణ, కె. పార్ధసారధి పాల్గొన్నారు. అనంతరం మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ చంద్రబాబు, లోకేష్ అనేక పర్యటనలు చేస్తూ రాత్రింబవళ్లు కష్టపడి రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు తెస్తున్నారని, ఈ నేపథ్యంలో పరిశ్రమలకు, ఇతర అవసరాలకు భూముల కేటాయింపుపై ఒక సమగ్ర విధానాన్ని రూపొందించాలని నిర్ణయించామని, దీనిపై సమావేశంలో చర్చించామని, త్వరలోనే విధానాన్ని ప్రకటిస్తామని చెప్పారు.
ప్రీహోల్డ్ భూముల సమస్యపై కూడా చర్చించామని, ఆ భూముల విధానాన్ని మరింత సరళతరం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు చెప్పారు. వక్ఫ్ భూమలపై కూడా సమగ్రంగా చర్చించినట్లు చెప్పారు. అనంతరం పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ మాట్లాడుతూ 2014-19 కాలంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం పేదలకు ఏడు లక్షల టిడ్కో ఇళ్లను అన్ని సౌకర్యాలతో నిర్మించి ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఐదు లక్షల ఇళ్లకు పరిపాలనా అనుమతినిచ్చి గ్రౌండ్ చేస్తే గత వైసీపీ ప్రభుత్వం 2 లక్షల 60 వేలకు కుదించి వాటిని కూడా పూర్తి చేయలేదని చెప్పారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు పేదలకు న్యాయం చేయాలని చెప్పారని, గత ప్రభుత్వం చేసిన తప్పులు చేయకూడదని అన్నారని, మొత్తం రెండు లక్షల 60 వేల టిడ్కో ఇళ్లను వచ్చే జూన్ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారని చెప్పారు. అందుకు గాను తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించినట్లు చెప్పారు.
అనంతరం సమాచార, పౌరసరఫరాల సంబంధాలు, హౌసింగ్ శాఖా మంత్రి కె. పార్థసారథి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఆలోచనతో రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇళ్లు, ఇళ్లస్థలాలు ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు. అర్హులైన వారందరికీ రెండు సెంట్లు, మూడు సెంట్లు స్థలాలు ఎలా ఇవ్వాలో ఈ సమావేశంలో చర్చించినట్టు చెప్పారు. గత ప్రభుత్వం సెంటు, సెంటున్నర స్థలాలు మాత్రమే ఇచ్చారని అన్నారు. అయితే కొన్ని లేవుట్లలో ఇళ్ల నిర్మాణాలు జరగని చోట లబ్ధిదారులను ఒప్పించి వారికి రెండు, మూడు సెంట్లు స్థలాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు నిర్మించి ఇవ్వాలనేది తమ ప్రభుత్వ విధానమని తెలిపారు. అయితే సుప్రీంకోర్టు తీర్పు ఉన్న నేపథ్యంలో లీగల్ గా ఉన్న అడ్డుంకులను అధిగమించి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనుకుంటున్నామని, అందు కోసం అడ్వకేట్ జనరల్ అభిప్రాయం అడుగుతామని, ఆయన తన అభిప్రాయాన్ని ఇవ్వగానే ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించి తదుపరి సమావేశంలో ఒక నిర్ణయం తీసుకునే దిశగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. జర్నలిస్టులకు ఇచ్చిన స్థలాల్లో ఇళ్లు కూడా కట్టించి ఇవ్వాలని నిర్ణయించినట్టు మంత్రి పార్థసారథి చెప్పారు