ప్రతిపక్షాలపై అణచివేత చర్యలు ఆత్మహత్యాసదృశం వంటివి

-జనసేనకు భాజపా అండగా ఉంటుంది.
-రాహుల్‌గాంధీది విహారయాత్ర
-రాష్ట్రాన్ని ముంచింది కాంగ్రెస్సే
-రాహుల్‌కు రాష్ట్రంలో పర్యటించే నైతిక అర్హత లేదు
-భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి

ప్రతిపక్షాలను పోలీసుల సాయంతో అణచివేద్దామనే వైకాపా తీరు ఆత్మహత్యాసదృశం వంటిదిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. సమస్యల పరిష్కారం కోసం పనిచేసే విపక్షాలపై పగ ప్రతీకారాలతో నిర్మూలించాలని ప్రయత్నిస్తే, ప్రజాగ్రహానికి గురికాక తప్పదని అన్నారు. అధికారం శాశ్వతం కాదని, రేపు అధికారం కోల్పోతే మీకు ఆ గతి పట్టవచ్చని హెచ్చరించారు. జనసేన కార్యకర్తలపై కేసులు పెట్టి భయబ్రాంతులకు గురిచేద్దామనుకుంటున్న ప్రభుత్వ నిర్ణయాన్ని విష్ణువర్ధనరెడ్డి తప్పుపట్టారు. జనసేనపై ప్రభుత్వ దాడులను ఖండిస్తూ, ఆ పార్టీ వెంటే భాజపా ఉంటుందని భరోసా ఇచ్చారు. భాజపా ` జనసేన కలసి ప్రభుత్వ ప్రజా వ్యతిరేకవిధానాలపై పోరాడి గద్దె దించుతాయనే ఆశాభవం వ్యక్తం చేశారు. ఆంధ్రులకు అన్ని రకాలుగా అన్యాయం, దగా చేసిన కాంగ్రెస్‌, రాహుల్‌గాంధీలకు రాష్ట్రంలో పర్యటించే నైతిక హక్కుల లేదని విమర్శించారు. ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే రాష్ట్రంలో పర్యటించాలని సూచించారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో విష్ణువర్ధనరెడ్డి మంగళవారం ఉదయం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇలా మాట్లాడారు…..

జనసేన వెనుక భాజపా ఉంది
పవన్‌ కల్యాణ్‌, జనసేన ఒంటరి కాదు. వారి వెనుక భాజపా ఉంది. విశాఖ పర్యటనలో వున్న పవన్‌కల్యాణ్‌ను ఒంటరిని చేయడానిక,ి జనసేన పార్టీని భయభ్రాంతులకు గురిచేయడానికి వైకాపా మంత్రులు ప్రయత్నించారు. పిచ్చి ప్రేలాపనలు చేశారు. వైకాపా కుట్రను భాజపా రాష్ట్ర, జాతీయ నాయకత్వం ఖండిరచింది. జనసేనకు సంఫీుభావం తెలిపింది. కష్టకాలంలో జనసేనకు భాజపా వెన్నటి వుంటుంది. జనసేన నాయకులపై జరిగిన దాడిపై భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు ఖండిరచి రాష్ట్ర రాజకీయాలకు నూతన సంకేతాలిచ్చారు. ప్రజలు భాజపా ` జనసేనకే మద్దతివ్వాలి. వైకాపా చేస్తున్న దుర్మార్గ రాజకీయాలను ప్రజలు క్షమించరు.

తోపులాటతో వైకాపా రాజకీయం
విశాఖలో పవన్‌ పర్యటనలో జరిగిన చిన్న తోపులాటను రాజకీయ అవసరాలకు వైకాపా వాడుకుంది. పోలీసులకు , వైకాపా మంత్రులకు, నాయకులకు తీవ్ర గాయాలైనట్లు, అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహించినట్లు పోలీసులు పవన్‌కు ఇచ్చిన నోటీసులో పేర్కొన్నారు. గాయపడిన మంత్రులు రోజా, జోగిరమేష్‌, సుబ్బారెడ్డి, పోలీసుల పరిస్థితి ఎలా ఉంది? వారెక్కడ చికిత్స తీసుకుంటున్నారో చెబితే అక్కడికి వెళ్లి పరామర్శిస్తాం. వారు నవ్వుకుంటూ తిరుగుతూ మీడియా ముందే విపక్షాలపై దుర్భాషలాడుతున్నారు. వైకాపా ఈ డ్రామాను ఆపాలి. ప్రతిపక్షాలను నిర్మూలించాలని, అణచివేయాలని భావించవద్దు. తప్పుడు కేసులు పెట్టి భయబ్రాంతులకు గురిచేస్తామంటే కుదరదు. గతంలో పోలీసులను అడ్డుపెట్టుకుని నల్లబెలూన్లు ఎగరేసి మోదిని విమర్శించిన తెదేపా ఇంటికెళ్లిపోయింది. మీకే అదే గతి పడుతుంది.

భాజపా ప్రతిపక్షాలను గౌరవిస్తోంది
దేశాన్ని పాలిస్తూ, 18 రాష్ట్రాల్లో అధికారంలో వున్న భాజపా ప్రతిపక్షాలను ఏనాడూ అణచివేయలేదు. వారి ఉద్యమాలను గౌరవించి, చర్చించి సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిసో ్తంది. జనసేన ఆత్మస్థైర్యాన్ని ఎవరూ దెబ్బతీయలేరు. విశాఖ సంఘటనపై సిట్టింగ్‌ జడ్జితో నిష్పక్షపాతంగా విచారణ జరపాలి. భాజపా జనసేన వెంటే ఉంటుంది. జనసైనికులకు సహకారం అందిస్తాం. అధికారం శాశ్వతం కాదు. ఆ భ్రమలో బతుకుతున్న వైకాపా తను తీసుకున్న కుట్రలు పన్నుకుంటూ తను తీసిన గోతిలో తానే పడుతోంది.

రాహుల్‌కు రాష్ట్రంలో పర్యటించే నైతిక ఆర్హత లేదు
కుటుంబ రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్‌ను ప్రజలు వదిలించుకున్నా, ప్రజలను కలుపుతామని రాహుల్‌ జోడో పేరుతో దేశంలో పర్యటిస్తున్నారు. ఆయన అయిదు రోజులు రాజకీయం చేస్తే, 25 రోజులు విదేశాల్లో విహారయాత్ర చేస్తుంటాడు. ఎక్కడికీ వెళ్లింది ఎవరికీ చెప్పడు. విదేశాల్లో బోరుకొట్టి దేశంలో పర్యటిస్తున్నారు. ఆది భారత జోడో యాత్ర కాదు. విహారయాత్ర. రాహల్‌ గాంధీకి, కాంగ్రెస్‌ నాయకులకు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించే నైతిక హక్కు లేదు. తెలుగువారిని అన్నివిధాలుగా వంచించిన, మోసం చేసిన రాహుల్‌, ఆ పార్టీ నేతలు ముందుగా క్షమాపణ చెప్పి రాష్ట్రంలో అడుగుపెట్టాలి. మోకాళ్లతో యాత్ర చేయాలి. అసలు రాష్ట్రంలో పర్యటించే నైతిక హక్కును కాంగ్రెస్‌, రాహుల్‌ కోల్పోయారు. 2004 నుంచి 2014 వరకు రాష్ట్రంల పాలించారు. ప్రజల మనోభావాలు దెబ్బతీశారు. ప్రత్యేకహోదా ఇవ్వలేదు. అధికారం ఇస్తే, వెంటనే ఇస్తామని 2019 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు.

దళితులను అవమానించారు
కాంగ్రెస్‌ ఎప్పుడూ దళితులను అవమానిస్తూనే ఉంది. అధికారం ఉన్నప్పుడు ఉన్నతస్ధాయి పదవులు తీసుకుని అధికారం లేనప్పుడు దళితులకు పదవులివ్వడం కాంగ్రెస్‌కు రివాజు. ప్రతిపక్ష హోదా లేనప్పుడు, పార్టీ ఓడిపోయినప్పుడు వారికి పదవులిచ్చి కాంగ్రెస్‌ వారిని బలిపశువుల్ని చేస్తోంది. ఈ ద్రోహాన్ని దళిత సమాజం గమనిస్తోంది. భాజపా దళిత సమాజంలో ప్రతిభ కలిగిన వారికి రాష్ట్రపతి వంటి అత్యున్నత పదవులు ఇచ్చింది. దామోదరం సంజీవరయ్యను అవమానించారు. ఆయనను పుట్టిన కర్నూలు జిల్లాలో రాహుల్‌ ప్రవేశిస్తున్నారు. దళిత జాతిని అవమానించిన కాంగ్రెస్‌ దళితులకు క్షమాపణ చెప్పాలి.