Suryaa.co.in

Andhra Pradesh

భూవివాదాలను త్వరగా పరిష్కరించండి

  • సంబంధిత శాఖతో సమన్వయం చేసుకోవాలని మంత్రి ఆదేశం
  • 28వ రోజు మంత్రి నారా లోకేష్ ‘ప్రజాదర్బార్’ కు క్యూ కట్టిన ప్రజలు
  • బాధితుల నుంచి వినతుల స్వీకరణ

అమరావతి, మహానాడు: భూవివాదాలపై ప్రజల నుంచి ఎక్కువ విజ్ఞప్తులు వస్తున్నందున ఆయా సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. సంబంధిత శాఖతో సమన్వయం చేసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఉండవల్లిలోని నివాసంలో 28వ రోజు మంత్రి నారా లోకేష్ ‘ప్రజాదర్బార్’ కు మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. తమ సమస్యలను విన్నవించారు. ఆయా విజ్ఞప్తులను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అమరావతి నిర్మాణం కోసం పెదవడ్లపూడికి చెందిన 40 మంది వృద్ధులు కలిసి సేకరించిన రూ. 28 వేల విరాళాన్ని మంత్రి నారా లోకేష్ ను కలిసి అందజేశారు. ఈ సందర్భంగా వారికి మంత్రి అభినందనలు తెలిపారు.

మంగళగిరి నియోజకవర్గం నుంచి విన్నపాలు

మంగళగిరి నియోజకవర్గం పెదవడ్లపూడికి చెందిన రైతులు మంత్రి నారా లోకేష్ ను కలిశారు. వైకాపా అండతో గ్రామంలోని ఉప్పలపాటి చెరువు కట్టను కొంతమంది ఆక్రమించారని, దీంతో వ్యవసాయ పనులకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోందని ఫిర్యాదు చేశారు. ఆక్రమణలు తొలగించి రహదారి సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు.

పెద్దవడ్లపూడిలో దశాబ్దాలుగా సాగుచేసుకుంటున్న 40 ఎకరాల రైతు పట్టా భూములను 2010లో నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, రికార్డులు పరిశీలించి 22-ఏ నుంచి తమ భూములు తొలగించాలని గ్రామానికి చెందిన బాధిత రైతులు కోరారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.

దివ్యాంగుడనైన తనకు ఎలాంటి ఆధారం లేదని, ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని మంగళగిరికి చెందిన షేక్ మౌలాలి విజ్ఞప్తి చేశారు.

చిట్యాల ఐలమ్మ రజక ఫంక్షన్ హాల్ నిర్మాణానికి ఆర్థిక సాయం చేయాలని ఉండవల్లి గ్రామానికి చెందిన రజక సోదరులు కోరారు.

బీకామ్ కంప్యూటర్స్ చదివిన తనకు ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని దుగ్గిరాలకు చెందిన చల్లపల్లి వినోద్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఆయా విజ్ఞప్తులను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన వినతులు

నెల్లూరు జిల్లా సైదాపురం రెవెన్యూ పరిధిలో వంశపారంపర్యంగా వచ్చిన తన రెండెకరాల భూమిని మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి అండతో కబ్జా చేశారని, విచారించి తగిన న్యాయం చేయాలని నెల్లూరుకు చెందిన రావిళ్ల శ్రీనివాస నాయుడు విజ్ఞప్తి చేశారు.

పోలియో వ్యాధి బారినపడి మంచానికే పరిమితమైన తనకు ఆర్థికసాయం చేసి ఆదుకోవాలని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఎమ్.మల్లికార్జునరావు విజ్ఞప్తి చేశారు.

పుట్టుకతో దీర్ఘకాలిక చర్మవ్యాధి బారినపడిన తమ కుమారుడికి పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన మద్దిగుంట జగదీష్ చంద్రప్రసాద్ కోరారు.

చీరాల లారీ ఓనర్స్ అసోసియేషన్ కు చెందిన యూనియన్ రిజిస్ట్రేషన్ రెన్యువల్ కు ఆదేశాలు ఇవ్వాలని అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. లాక్ డౌన్ సమయంలో అధికారులు రెన్యువల్ చేయలేదని, ఇప్పుడు జిల్లా మారడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

స్టీల్ ఎక్స్ చేంజ్ ఇండియా లిమిటెడ్ యాజమాన్యం సేకరించిన తన 18 సెంట్ల స్థలానికి నష్టపరిహారం చెల్లించలేదని, విచారించి తగిన న్యాయం చేయాలని విజయవాడకు చెందిన కళ్లేపల్లి కృష్ణ విజ్ఞప్తి చేశారు.

అనియత విద్య బోధక, పర్యవేక్షకులకు అర్హతను బట్టి వయస్సుతో నిమిత్తం లేకుండా విద్యాశాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలలో నియమించాలని నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ సూపర్ వైజర్స్ అండ్ ఇన్ స్ట్రక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.

శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న బీఈడీ, రికార్డు ఫీజులు తగ్గించాలని ఎన్ఎస్ యూఐ ప్రతినిధులు కోరారు.

పార్ట్ టైం జాబ్ ఆశచూపి నకిలీ బ్యాంక్ అకౌంట్ ద్వారా రూ.16 లక్షల వరకు సైబర్ మోసానికి పాల్పడ్డారని, విచారించి తగిన న్యాయం చేయాలని తిరుపతి జిల్లా కామకూరుకు చెందిన వి.గురేష్ విజ్ఞప్తి చేశారు.

కజకిస్థాన్ లో ఎంబీబీఎస్ చదువుతున్న తన కుమార్తెకు గత వైసీపీ ప్రభుత్వం విదేశీ విద్య సాయం నిలిపివేయడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తిరిగి మంజూరు చేయాలని కృష్ణా జిల్లా నూజివీడుకు చెందిన గొల్లమందల శ్రీను కోరారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.

ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందికి మినిమమ్ టైం స్కేల్ వర్తింపజేయాలని కాంట్రాక్ట్ నాన్ టీచింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఆయా విన్నపాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.

LEAVE A RESPONSE