– ఆమె ప్రలోభాలకు లోనయింది
– తెలంగాణ జాగృతి నాయకుడు రాజారాం యాదవ్
– తెలంగాణ ద్రోహులకు ఆయుధమిస్తున్నాయి: ప్రశాంత్
– మేం పార్టీ వైపే ఉంటామని స్పష్టీకరణ
హైదరాబాద్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చేస్తున్న వ్యాఖ్యలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలకు లబ్ధి చేకూర్చే విధంగా ఉన్నాయని తెలంగాణ జాగృతి నాయకుడు రాజారాం యాదవ్ విమర్శించారు.
తెలంగాణ అస్తిత్వాన్ని వ్యతిరేకించే శక్తులకు ఆమె వ్యాఖ్యలు మద్దతుగా నిలుస్తున్నాయని, మూడు నెలలుగా ఆమె ప్రలోభాలకు గురై మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తోందని, ఆ పరిస్థితి నుంచి బయటకు రావాలని సూచించారు.
కవిత మాట్లాడుతున్న మాటలను ఏ టీవీ ఛానల్స్, ఏ పత్రికలు చూపిస్తున్నాయో తెలుసుకోవాలని.. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన వారికి ఆమె వ్యాఖ్యలు ఊతమిస్తున్నాయని అన్నారు. తమకు తెలంగాణ, కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు నాయకత్వం ముఖ్యమని స్పష్టం చేశారు.
కవిత మాట్లాడుతున్న మాటలు తెలంగాణ ద్రోహులకు ఊతమిచ్చేలా ఉన్నాయని, ఈ విషయాన్ని ఆమె ఆలోచించుకోవాలని జాగృతి నేత ప్రశాంత్ హితవు పలికారు. కేసీఆర్పై విమర్శలు చేసేవారికి ఆమె వ్యాఖ్యలు ఆయుధంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులు నిరంతరం తెలంగాణ అభివృద్ధి కోసం తపనతో పని చేస్తారని అన్నారు.