Suryaa.co.in

Telangana

సీఎంగా కుండా పార్టీ రెబెల్ నేతగా రేవంత్

– పచ్చబడ్డ పాలమూరుకు చిరునామా కేసీఆర్
– రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి వచ్చింది ఏడేండ్ల కిందటే
– మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

 హైదరాబాద్: పచ్చబడ్డ పాలమూరుకు చిరునామా కేసీఆర్. దీని పండిన పంటలు, పండించిన రైతులే సాక్ష్యం. రూ.వెయ్యి లేదా రూ.1200 కోట్ల నిధులు ఇచ్చి నాలుగైదు నెలలు పనిచేస్తే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తయి రైతాంగానికి సాగునీరు అందుతుంది. పాలమూరు రంగారెడ్డి పనులు ఆపి ప్రభుత్వం చోద్యం చూస్తున్నది. పాలమూరును పూర్తి చేసి నిబద్దత, చిత్తశుద్దిని చాటుకోవాలి. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి వచ్చింది ఏడేండ్ల కిందటే.

ఏదో తన వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని రేవంత్ రెడ్డి భ్రమ పడుతుంటారు అబద్దాలు చెప్పడం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారింది. ప్రభుత్వ సభకు, పార్టీ సభకు తేడా తెలియని వారు మన పాలకులు కావడం దౌర్భాగ్యం. కేసీఆర్ ని తిట్టాలి అనుకుంటే పార్టీ సభ పెట్టుకో. ఎలాగూ తిట్టడానికే కదా సభలు పెట్టేది చెప్పిందేంటి, చేయాల్సిందేమిటో వదిలేసి వెళ్లిన చోటల్లా అబద్దాలు చెప్పడమే సీఎం రేవంత్ దినచర్యగా మారింది. గత ప్రభుత్వం మీద, కేసీఆర్ మీద అభాండాలు వేయకపోతే రేవంత్ దినం గడవడం లేదు. అధికారంలోకి వచ్చి 15 నెలలు దాటింది. అయినా కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేయడం మీద, పాలన మీద దృష్టి పెట్టడం లేదు.

ఇందిరాగాంధీ హయాంలో దేశంలో ప్రతి విషయానికి విదేశీహస్తం అని ఆరోపణలు చేసేవారు. తర్వాత అది హస్యాస్పదంగా మారి పత్రికల్లో కార్టూన్లు వచ్చే పరిస్థితి ఏర్పడింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చింది అంతిమంగా మహాత్మాగాంధీ నాయకత్వం వహించిన తర్వాతనే .. అందుకే ఆయన జాతిపిత అయ్యాడు . స్వాతంత్య్ర ఉద్యమంలో మహాత్మాగాంధీ ఆరేళ్లు జైలు జీవితం గడిపితే, జవహర్ లాల్ నెహ్రూ తొమ్మిదిన్నరేళ్లు జైలు జీవితం గడిపారు. నెహ్రూ ప్రధాని అయిన తర్వాత , ఆయన హయాంలో దేశంలోని అనేక అంశాలలో వారి పాత్ర విస్మరించలేనిది.

దేశంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న వారు గాంధీ మహాత్ముడు, జవహర్ లాల్ నెహ్రూను ఎంతో చిన్నగా చేసి చూపిస్తున్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో వారి పాత్ర లేదు కాబట్టి, తమను తాము పెద్దగా చేసుకోవడానికి గాంధీ, నెహ్రూలను చిన్నగ చేసి చూపిస్తున్నారు.

తెలంగాణ ఉద్యమంలో పాత్ర లేనివారు, వ్యతిరేక పార్టీలను మోసిన వారు కేసీఆర్ ని చిన్నగ చేసి చూపే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ వచ్చింది కేసీఆర్ వల్లనే అని ఏపీ ప్రజలే చెబుతారు. ప్రతి దానికి కేసీఆర్ ని నిందిస్తే సమయం వచ్చినప్పుడు వడ్డీతో సహా చెల్లిస్తాం. వనపర్తి పర్యటనలో జిల్లాకు కొత్తగా ఒరిగింది ఏమీ లేదు. వెయ్యి కోట్ల అభివృద్ధి పనులు అని డబ్బా కొట్టుకుంటున్నారు. కేసీఆర్ హయాంలో కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. అక్కడ జరిగిన అభివృద్ధి పనులకే తిరిగి శంకుస్థాపన చేయడం సిగ్గు చేటు.

గత ముఖ్యమంత్రి కేసీఆర్ వనపర్తికి మెడికల్ కళాశాల మంజూరు చేశారు. మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల, ప్రభుత్వ ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. అవి ఇప్పుడు నిర్మాణంలో వివిధ దశలలో ఉన్నాయి. వాటికి తిరిగి శంకుస్థాపన చేయడం విడ్డూరం. వెనకటికి ఎన్ని లెంకల వ్యవసాయం అంటే 101 అన్నాడట. ఏది అని అడిగితే మా దొరది 100 నాది ఒకటి అన్నాడట.

రూ.550 కోట్లతో మెడికల్ కళాశాల మంజూరు చేసింది గత ప్రభుత్వం .. కొత్తగా రహదారులు, ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు శ్రీకారం చుట్టడాన్ని స్వాగతిస్తున్నాం. రూ.21 కోట్లతో ఐటీ టవర్ కు కేటీఆర్ శంకుస్థాపన చేస్తే, దాని శిలాఫలకం పగలగొట్టి తిరిగి సీఎంతో శంకుస్థాపన చేయడం సమంజసమా ? అసలు ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు ? నిఘా విభాగం అధికారులు ఏం చేస్తున్నారు ? సీఎంఓ అధికారులు ఏం పనిచేస్తున్నారు ?

ఉమ్మడి రాష్ట్రంలో వనపర్తి పాలిటెక్నిక్ కళాశాల ఎంతో ప్రాచుర్యం పొందింది. అక్కడ చదివిన వారు ప్రపంచ దేశాలలో ఉన్నారు. శిథిలావస్థకు చేరిన కళాశాల, కళాశాల వసతిగృహాల నిర్మాణం కోసం కేటీఆర్ తో రూ.22 కోట్లతో శంకుస్థాపన చేశాం .వనపర్తికి జేఎన్ టీయూ ఇంజనీరింగ్ కళాశాల వచ్చి మూడేళ్లు అవుతుంది .. మొదటి దశలో ఏడు కోట్ల పనులు చేపట్టాం. రెండో దశ పనులను ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేసింది

దేశంలోనే తొలిసారి బీసీ వ్యవసాయ డిగ్రీ కళాశాలలు కేసీఆర్ ని ఒప్పించి కరీంనగర్, వనపర్తిలో ఏర్పాటు చేశాం. వ్యవసాయ విశ్వవిద్యాలయ చట్టాలను సవరించి వీటిని ఏర్పాటు చేశాం. అది ఇప్పటికీ అద్దె భవనంలోనే కొనసాగుతుంది .. అధికారంలోకి వచ్చి 15 నెలలు అయినా దానికి కనీసం భవనం నిర్మించే ప్రయత్నం చేయడం లేదు. వనపర్తిలో జరిగిన మార్పులు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాతనే అన్న విషయం రేవంత్ రెడ్డికి తెలియదా ? అప్పుడు రేవంత్ తిరిగిన రహదారులు ఎలా ఉన్నాయి ? ఇప్పుడు ఎలా ఉన్నాయి ?

తనకు చిన్నారెడ్డి ఆదర్శం అని రేవంత్ రెడ్డి చెప్పుకున్నాడు. మరి చిన్నారెడ్డికి ఏఐసీసీ ఇచ్చిన టికెట్ అమ్ముకున్నారని చిన్నారెడ్డే చెప్పారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఎన్నేళ్లయింది ? డీసీసీ కార్యాలయాన్ని జూపల్లి క్రిష్ణారావు తగులబెట్టింది వాస్తవం కాదా ? వనపర్తి సభలో రూ.500 సిలిండర్ వస్తుందా ? అని రేవంత్ అడిగితే రావడం లేదని సభలోనే మహిళలు చేతులు ఎత్తి చెప్పారు.ఒక్క వనపర్తి నియోజకవర్గంలోనే 15,185 మంది రైతులకు రుణమాఫీ కావాల్సి ఉంది

డాక్టర్ బాలకిష్టయ్య వనపర్తికి విశేష సేవలు అందించారు. మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి అక్కడి క్రీడా ప్రాంగణానికి ఆయన పేరు పెట్టడం జరిగింది. ఆయన ఆసుపత్రి సమీపంలో ఆయన విగ్రహం ఏర్పాటు చేయించారు. తెలంగాణ వచ్చిన తర్వాత జిల్లా ఆసుపత్రిలో డాక్టర్ బాలకిష్టయ్య కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది

తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అంజయ్య యాదవ్, జైపాల్ యాదవ్ తదితరులు..

LEAVE A RESPONSE