ప్రగ తిభవన్‌ గడీలు బద్దలు చేసిన ప్రజాపాలన

– ప్రగతిభవన్‌ గేట్లు బద్దలు చేసిన రేవంత్‌
– జేసీబీలతో నేలపట్టమైన గడీలు
– ఇనుప గేట్లతో ట్రాఫిక్‌ జాం
– అప్పుడు అనుమతి ఉంటేనే లోనికి ప్రవేశం
– ప్రజల రాకను నిషేధించిన కేసీఆర్‌
– ఇప్పుడు మళ్లీ వైఎస్‌ జమానా దృశ్యం
– ప్రగతిభవన్‌ ప్రజలదేనన్న భావన
– తాను ప్రజల మనిషినని సంకేతం ఇచ్చిన రేవంత్‌
– గులాబీ బాసుల వెక్కిరింపులను అధిగమించిన యోధ
– చచ్చిందన్న కాంగ్రెస్‌తోనే చతికిలబడిన బీఆర్‌ఎస్‌
– రేవం‘తుఫాన్‌’కు కొట్టుకుపోయిన గులాబీదండు
( మార్తి సుబ్రహ్మణ్యం)

హైదరాబాద్‌ బేగంపేట ప్రాంతంలోని ప్రగతిభవన్‌ ముందు రోడ్డు సగం వరకూ పెద్ద ఇనుప గేట్లు దర్శమిచ్చేది. ఫలితంగా పదేళ్లు ట్రాఫిక్‌ జామ్‌. అనుమతి లేకుండా ఆ ఇనుప గడీలను దాటడం, మంత్రులకూ సాధ్యమయ్యేది కాదు. లోపలి నుంచి ‘దొర’గారి పిలుపు వస్తే తప్ప, యధేచ్చగా వెళ్లడం అసంభవం. సారు కనికరిస్తేనే రాజకోటలోకి ప్రవేశం. ఊపజాయుద్ధ నౌక గద్దర్‌ పెద్ద దొర దర్శనం కోసం నాలుగుగంటలు కోట ముందు పడిగాపులు కాసిన దృశ్యం. సీనియర్‌నేత జేసీ దివాకర్‌రెడ్డి దొరగారి దర్శనం కుదరదుపొమ్మంటూ తరిమేసిన వైనం. ఇవంతా చెరిగిపోని జ్ఞాపకాలే. ప్రగతిభవన్‌ ఎదుట ఆత్మహత్యాయత్నం చేసిన ఆపన్నులకు లెక్కలేదు. ఇదంతా గత పదేళ్ల నుంచి కొద్ది గంటల క్రితం వరకూ యావత్‌ తెలంగాణ సమాజం చూసిన ముచ్చట.

ఇప్పుడు అక్కడ దృశ్యం మారింది. నిలువెత్తు ఇనుప గేట్లు లేవు. ట్రాఫిక్‌ జామ్‌ లేదు. పోలీసు ఆంక్షలు లేవు. ప్రజలను స్వాగతిస్తూ.. ఇక నుంచీ ఇది మీదే.. మీకోసమేని ఆహ్వానిస్తూ ఇనుప గేట్లు బద్దలయ్యాయి. జేసీబీలు వాటిని నేలకూల్చాయి. ఇక నుంచీ అది ప్రజాభవన్‌! వైఎస్‌ జీవించి ఉన్న సమయం నాటి దృశ్యాలే ఇప్పుడు సాక్షాత్కరిస్తున్నాయి. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత దొరల గడీలు బద్దలు కొట్టి ప్రజలకు ప్రవేశం కల్పిస్తామని, పీసీసీ చీఫ్‌ హోదాలో రేవంత్‌ ఇచ్చిన హామీని.. సీఎంగా అమలుచేసిన సాహసి. ఇప్పుడు తెలంగాణకు గడీలు లేవు. జనం గోడు తప్ప!

నిజంగానే రేవంత్‌ అన్నంతపనీ చేశారు. ప్రగతిభవన్‌ ఇనుప గేట్లు బద్దలు చేయడం ద్వారా ‘‘ఈ ప్రభుత్వం మీది… ప్రజాభవన్‌కు ఎవరైనా రావచ్చు.. మీకూ-ప్రభుత్వానికి అడ్డుగోడలు-గడీలు అడ్డులేవ’’న్న విస్పష్ట సంకేతాలివ్వడంలో, రేవంత్‌ సక్సెస్‌ అయ్యారు.

నిజంగా పదేళ్ల వరకూ జనాలకు-ప్రభత్వానికీ ప్రగతిభవన్‌ ఇనుపగేట్లు అడ్డుగోడగా ఉండేది. రాజరిక వ్యవస్థలో ఒక రాజును దర్శించుకోవడం ప్రజలకు అసాధ్యంగా ఉండేది. కోట ముందు పడిగాపులు కాయవలసి వచ్చేది. ఆయన పురవీధుల్లో, మందీ మార్బలంతో కోట బయటకు వచ్చినప్పుడే రాజదర్శనం అయ్యేది.

అలాంటి రాజరిక వ్యవస్థ స్థానంలో, ప్రజాస్వామ్యపాలన వచ్చినా.. గత పదేళ్లు మాత్రం తెలంగాణ సమాజం అలాంటి నయా నవాబు, రాజుల పాలన అనుభవించిందన్నది, మనం మనుషులం అన్నంత నిజం. ఇప్పుడా దూరాన్ని చెరిపేసి, ప్రజాభవన్‌ను ప్రజలకు చేరువ చేయడంలో రేవంత్‌ విజేతగా నిలిచారు. ఒక్క ఇనుప గేట్లు బద్దలు చేయడం వెనుక ఇన్ని సంకేతాలున్నాయి మరి!

కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించిన సమయంలో, హైదరాబాద్‌లో భారీ సంబరాలు జరిగాయి. కాంగ్రెస్‌ శ్రేణులు రోడ్లపై కొచ్చి ఆనందతాండవం చేశాయి. ఇక తర్వాత అడుగు తెలంగాణలోనే అని, పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి జోస్యం చెప్పారు. ‘దొరల గడీలు బద్దలు కొట్టే కాంగ్రెస్‌ పాలనకు కర్నాటక ఫలితాలు నాంది’ అని వ్యాఖ్యానించారు. దానిని నాటి సభలో మంత్రి- బీఆర్‌ఎస్‌ ఉత్తర కుమారుడు కేటీఆర్‌ తెగ వెటకారం చేశారు.

‘ఊళ్లో వాళ్ల పెళ్లికి వీళ్ల హడావిడి’ అని పరోక్షంగా, కాంగ్రెస్‌ నేతల ఉత్సాహాన్ని కుక్కలతో పోల్చారు. దానిని చచ్చిన పార్టీగా అభివర్ణించారు. ‘‘విశ్వసనీయత అనేది పోతే రాదు. ఆ పార్టీకి ఎక్సపైరీ

డేట్‌ అయిపోయింది. చచ్చిన పాము. ఆ పార్టీని పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా చచ్చిన పాము. కోరలు తీసిన పాము. కానీ వాళ్లేదో ఊహించుకుంటున్నారు. పక్కింటో పెళ్లయితే అదేదే హడావిడి మాదిరిగా చేస్తున్నారు. పక్కనేదో కర్నాటకలో ఏదో జరిగితే ఇక్కడేదో జరుగుతుందని ఊహించుకుంటున్నారు’’ అని నిండు సభలో అత్యుత్సాహంతో ఎకసెక్కాలాడినందుకు, బహుశా ఇప్పుడు బీఆర్‌ఎస్‌ ఉత్తరాధికారి వగచితీరాలి.

అధికారంలో ఉన్నవారందినీ అహంకారం ఆవహిస్తుంది. దానికి కేసీఆర్‌ అండ్‌ ఫ్యామిలీ మినహాయింపు కాదని.. వారు చేసిన ప్రసంగాల తర్వాత వచ్చిన ఫలితాలు, ఇప్పుడు లాల్‌బహుదూర్‌ స్టేడియంలో జనం సాక్షిగా రేవంత్‌ చేసిన ప్రమాణం నిజం చేసినట్టయింది.

కాంగ్రెస్‌ను రాజకీయంగా- నేతలను మానసికంగా-ఆర్ధికంగా దెబ్బతీసి జైలుపాలుచేసి.. మయసభ మాదిరిగా వికటాట్టహాసం చేసిన గులాబీదళం, రేవం‘తుఫాను’లో కొట్టుకుపోవడం కేసీఆర్‌ అండ్‌ ఫ్యామిలీ ఊహించనిదే. తెలంగాణ ఎన్నికల తర్వాత మహారాష్ట్రపై దృష్టి పెడతామన్న కేటీఆర్‌ ఊపు-ఉత్సాహానికి, తెలంగాణలోనే బ్రేకులు వేసిన రేవంత్‌ షాకు నుంచి.. గులాబీ ఎప్పటికి కోలుకుంటుందో చూడాలి.

Leave a Reply