– రేవంత్ రెడ్డి ధన దాహం వల్లనే ప్రమాదంలో 8 మంది కార్మికులు
– పరిపాలనను పక్కనపెట్టి టైంపాస్
– కార్మికులను రక్షించాల్సింది పోయి బ్లేమ్ గేమ్
– రేవంత్ రెడ్డికి ఆర్థిక వ్యవస్థ గురించి అవగాహన లేదు
– ఢిల్లీలో రేవంత్ రెడ్డి చిట్ చాట్ పేరిట చేసిన చిల్లర వ్యాఖ్యల పై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్
– ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రమాదం పైన రేవంత్ రెడ్డి చేసిన అడ్డగోలు వ్యాఖ్యల పైన మండిపడిన కేటీఆర్
తన అసమర్ధతను పాలనా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం పైన నెపం నెడుతున్నారు. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు ఉన్నది రేవంత్ రెడ్డి వ్యవహారం. జి ఎస్ ఐ, ఇంజనీరింగ్ నిపుణులు వంటి సంస్థలతో సంప్రదించకుండానే ఆగిపోయిన ప్రాజెక్టుని ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా, అవినీతి సొమ్ముల కోసం లాలూచీ పడి పాత యంత్రాలతో ప్రారంభించారు.
కేవలం రేవంత్ రెడ్డి ధన దాహం వల్లనే ఈరోజు 8 మంది కార్మికులు ప్రమాదంలో చిక్కుకున్నారు. వారు బతికున్నారో లేదో అనే ఆందోళనకరమైన పరిస్థితి నెలకొని ఉంది దీనికి పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డిదే. రేవంత్ రెడ్డి కార్మికులను రక్షించాల్సింది పోయి బ్లేమ్ గేమ్ ప్రారంభించారు. దేవుడిచ్చిన ముఖ్యమంత్రి అవకాశాన్ని వాడుకొని ప్రజలకు మంచి చేయాల్సింది పోయి రాజకీయాలకు పాల్పడుతున్నారు.
ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చింది కాబట్టి తెలంగాణకు మంచి జరిగేలా ప్రజలకు మంచి జరిగేలా వ్యవహరించాలని సూచిస్తున్నాను. ఛీఫ్ మినిస్టర్ గా మాట్లాడాలి కానీ ఒక చీప్ మినిస్టర్ గా మాట్లాడవద్దని రేవంత్ రెడ్డికి సూచిస్తున్నాను. రేవంత్ రెడ్డికి పరిపాలన చేతకాకనే రాష్ట్రంలో జరుగుతున్న మరణాలపైన ఇతరుల పేరును ప్రస్తావిస్తున్నారు. అధికారంలో తామే ఉన్నామన్నది మరిచిపోయి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు.
రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే కావాల్సిన విచారణలు దర్యాప్తులు చేసుకోవచ్చు. కానీ కేవలం టైంపాస్ చేసేందుకు పరిపాలనను పక్కనపెట్టి చేతకాకనే ఇవన్నీ మాట్లాడుతున్నారు. అరచేతిలో స్వర్గం చూపించేలా ఇచ్చిన హామీలను అమలు చేయడం చేతకాకనే ప్రజల టెన్షన్ డైవర్షన్ కోసం ముఖ్యమంత్రి ఇవన్నీ మాట్లాడుతున్నారు. 15 నెలల నుంచి కేవలం ప్రజల అటెన్షన్ డైవర్షన్ పేరుతో ఆటలాడుతున్న రేవంత్ రెడ్డి పాలనను పక్కనపెట్టారు
రేవంత్ రెడ్డి అన్ని విషయాల్లో అబద్ధాలు ఆడుతున్నారు. రాష్ట్ర అప్పుల విషయంలో కూడా అబద్ధాలు ఆడుతున్నారు. 6500 కోట్లు కేవలం వడ్డీ లెక్క అయిపోతుందంటూ రాష్ట్ర ప్రజలను, దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. రేవంత్ రెడ్డికి ఆర్థిక వ్యవస్థ గురించి అవగాహన లేదు.