– సింగరేణి ధర అందుబాటులో లేనందునే వేరే చోట కొనుగోలు చేస్తున్నాం
– మాపై ఆధారపడిన వేల మంది చిన్న ఉద్యోగుల ఉపాధి కూడా మాకు ముఖ్యమే
– సింగరేణితో ఏళ్ల తరబడి ఉన్న అనుబంధం కోల్పోవాలని కూడా లేదు
– సింగరేణి భవన్ లో సీఎండీ ఎన్.బలరామ్ కు విద్యుత్తేతర బొగ్గు వినియోగదారుల విజ్ఞప్తి
హైదరాబాద్: బొగ్గు ఆధారిత సిమెంటు, స్పాంజ్, ఐరన్, సిరామిక్స్, ఫార్మా వంటి పరిశ్రమలు నేటి క్లిష్ట మార్కెట్ పరిస్థితుల్లో మనుగడ సాగించాలంటే సింగరేణి సంస్థ తన బొగ్గు ధరను తగ్గించాల్సిన అవసరం ఉందని విద్యుత్తేతర పరిశ్రమల యాజమాన్యాలు సింగరేణి సంస్థకు మొర పెట్టుకున్నాయి. ముఖ్యంగా తమ పరిశ్రమల మనుగడ, తమపై ఆధారపడిన వేల మంది స్థానిక చిరు ఉద్యోగుల భవిష్యత్ దృష్ట్యా తక్కువ ధరకు బొగ్గును విదేశాల నుంచి లేదా ఇతర బొగ్గు సంస్థల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోందన్నారు.
తొలిసారిగా అన్ని ఏరియాల జీఎంలు, క్వాలిటీ జీఎంలు, క్వాలిటీ ఇన్ఛార్జీలతో కలిసి సింగరేణి భవన్ లో గురువారం సంస్థ నిర్వహించిన విద్యుత్తేతర వినియోగదారుల సమావేశంలో దాదాపు 60కి పైగా సంస్థల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు. గత ఏడాది సింగరేణి ఉత్పత్తి చేసిన 70 మిలియన్ టన్నుల బొగ్గులో 9 మిలియన్ టన్నులను విద్యుత్తేతర వినియోగదారులు కొనుగోలు చేశారని, ఈ ఏడాది కేవలం 5 మిలియన్ టన్నులను మాత్రమే తీసుకోవడానికి కారణాలను ఈ సందర్భంగా సీఎండీ ఎన్.బలరామ్ తెలుసుకున్నారు.
దీనిపై అన్ని సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ… సింగరేణి తో తమకు దశాబ్దాల అనుబంధం ఉందన్నారు. రవాణా సమస్యలు లేకుండానే సింగరేణి నుంచి బొగ్గు తీసుకునే అవకాశం కూడా ఉందన్నారు. కానీ, పోటీ మార్కెట్లో ఇప్పటికే తాము ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నామని, సింగరేణి బొగ్గు ధరలు ఎక్కువ ఉన్నందున తాము అంతకన్నా తక్కువ ధరకు లభిస్తున్న కోలిండియా మరియు విదేశీ బొగ్గు వైపు మొగ్గు చూపాల్సి వస్తుందని పేర్కొన్నారు. దూర ప్రాంతాల నుంచి బొగ్గును కొనుగోలు చేస్తున్నప్పటికీ సింగరేణి ధరతో పోల్చితే తక్కువకే లభిస్తోందన్నారు. బొగ్గు ధరను తగ్గిస్తే సింగరేణి నుంచి స్వీకరించడానికి సంసిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
బొగ్గు నాణ్యత విషయంలోనూ లేవనెత్తిన అంశాలపై సంబంధిత అధికారులకు సీఎండీ ఎన్.బలరామ్ ఆదేశాలు జారీ చేశారు. నాణ్యత విషయంలో కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. వినియోగదారుల ప్రయోజనాలను, సింగరేణి మార్కెట్ను రక్షించుకునేందుకు అవసరమైన అన్ని చర్యలపై సమాలోచనలు జరిపి తగిన నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన రోజుల్లో సింగరేణి నుంచి బొగ్గును స్వీకరించాలని కోరారు. త్వరలో మరొక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు.
సమావేశంలో డైరెక్టర్లు డి.సత్యనారాయణ రావు (ఈ అండ్ ఎం), ఎల్వీ సూర్యనారాయణ (ఆపరేషన్స్), ఎగ్జిక్యూటివ్ కోల్ మూమెంట్ ఎస్.డి.ఎం.సుభానీ , జీఎం(మార్కెటింగ్) డి.రవి ప్రసాద్, జీఎం(సీపీపీ) మనోహర్, ఓఎస్డీ (మార్కెటింగ్) ఎన్.వి.రాజశేఖరరావు, డీజీఎంలు సురేందర్ రాజు, శ్రీవాస్తవ, అడిషనల్ మేనేజర్ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నవభారత్, ఐటీసీ, ఓరియంట్ సిమెంట్, అల్ట్రా టెక్ సిమెంట్, దివీస్ ల్యాబరేటరీస్, హెటిరో ఫార్మా, సిర్పూర్ పేపర్ మిల్స్ తదితర సంస్థల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు.