Suryaa.co.in

Telangana

జనంతో కిక్కిరిసిన రేవంత్‌ ప్రజాదర్బార్‌

-ఇనుప గడీలు బద్దలైన తర్వాత పోటెత్తిన జనప్రవాహం
-రేవంత్‌కు వెల్లువెత్తిన సమస్యలు
-అందరి వద్దా ఓపికగా వినతులు స్వీకరించిన రేవంత్‌
-రేవంత్‌ వెళ్లిన తర్వాత వినతులు తీసుకున్న సీతక్క
-విజ్ఞాపనల కోసం స్పెషల్‌ డెస్క్‌

హైదరాబాద్: దొరల గడీలు బద్దలై.. ప్రజాస్వామ్య ప్రభుత్వం ఆవిర్భవించిన మరుసటిరోజు ప్రజాభవన్‌ ప్రజలరాకతో కిటకిటలాడింది. పదేళ్ల పాటు ప్రగతిభవన్‌లో ప్రజలను నిషేధించిన తర్వాత.. వందలాది మంది అందులో కాలుబెట్టిన ప్రజాస్వామిక దృశ్యాలు అందరినీ ఆకర్షించాయి. సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఓపికగా వారి సమస్యలు విన్నారు. వాటిని సంబంధిత అధికారులకు ఇచ్చి, పరిష్కారమార్గం చూడాలని ఆదేశించారు. మధ్యలో సెక్రటేరియేట్‌కు వెళ్లిపోయినప్పటికీ, వినతుల స్వీకరణ ప్రక్రియ ఆగలే దు. రేవంత్‌ స్థానంలో మంత్రి సీతక్క ప్రజల నుంచి వినతులు తీసుకున్నారు.

పదేళ్ల తర్వాత ప్రజలు ప్రజాభవన్‌లోకి వెళ్లేందుకు పోటీలు పడ్డారు. దానితో వారిని నియంత్రించడం పోలీసులకు కష్టమైంది. దానితో విడతల వారీగా లోపలికి పంపించారు. సీఎంగా ప్రమాణం చేసిన మరుసటిరోజునే ముందుగా చెప్పినట్లు రేవంత్‌రెడ్డి.. ప్రగ తిభవన్‌ను ప్రజాభవన్‌గా మార్చడమే విశేషం. కేసీఆర్‌ నిర్మించిన ఇనుప గోడలు బద్దలు కొట్టి.. నియంతృత్వ నిర్ణయాన్ని కాలరాసి, కేసీఆర్‌ సర్కారు ప్రజలపై పెట్టిన నిషేధం ఎత్తివేయడంతో, ప్రజల్లో ఆనందం తొంగిచూసింది. తమ రాష్ట్ర సీఎంను స్వయంగా దగ్గరుండి చూసి, మాట్లాడామన్న ఆనందం వారిలో తొంగిచూసింది. ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో కనిపించిన దృశ్యాలే ప్రజాభవన్‌ వద్ద దర్శనమిచ్చాయి. ఇప్పుడక్క ఇనుగ గడీలు లేవు.. గజానికో పోలీసు లేడు. ఉన్నదల్లా జనం.. వారి ఈతిబాధలు వినే జననేత రేవంత్‌ ఇద్దరే!

రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే ప్రజాసమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి అధికార నివాసమైన మహాత్మా జ్యోతిభా పూలే ప్రజాభవన్ లో శుక్రవారం ప్రజాదర్బార్ నిర్వహించారు. మొదటగా దివ్యాంగులకు ప్రాధాన్యం ఇచ్చి వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని వినతులను స్వీకరించారు.

ప్రజాదర్బార్ వేదికకు వివిధ సమస్యలపై విన్నవించుటకు పెద్ద ఎత్తున వచ్చిన ప్రజల విజ్ఞాపనలు ముఖ్యమంత్రి స్వీకరించి, వారి సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకున్నారు. వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దనసరి అనసూయ (సీతక్క) ఉన్నారు.

ముఖ్యమంత్రి అత్యవసర సమావేశం నిమిత్తం సెక్రటేరియట్ బయలుదేరారు. అనంతరం ప్రజా దర్బార్ కు వివిధ సమస్యల పరిష్కారానికై వచ్చిన ప్రతిఒక్కరి నుండి మంత్రి సీతక్క విజ్ఞాపనలు స్వీకరించారు.

ప్రజాదర్బార్ నిర్వహణకు ప్రభుత్వం విసృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్యకార్యదర్శి శేషాద్రి, డీజీపీ రవిగుప్తా, జలండలి ఎం.డి. దాన కిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, ముషార్రాఫ్ తదితర అధికారులు ప్రజాదర్బార్ నిర్వహణను సమన్వయం చేశారు.

గ్రీవెన్స్ రిజిస్ట్రేషన్ లకు 15 డెస్కులను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ప్రతి విజ్ఞాపన పత్రాన్ని ఆన్ లైన్ ఎంట్రీ చేసి, ప్రతి విజ్ఞాపన కు ప్రత్యేక గ్రీవెన్స్ నెంబర్ ఇచ్చి, ప్రింటెడ్ ఎకనాలెడ్జిమెంట్ ఇవ్వడం, , పిటిషన్ దారులకు SMS ద్వారా కూడా ఎకనాలెడ్జిమెంట్ పంపేవిధంగా ఏర్పాటు చేశారు. ప్రజాదర్బార్ లోపల ప్రజలు కూర్చోవడానికి 320 సీట్లను ఏర్పాటు చేశారు. బయట కూడా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఎండ నుంచి రక్షణకై క్యూలైన్ల పైన నీడను కల్పించారు. ద్వారాల వద్ద నిలుచున్న వారికి , ప్రజాదర్బార్ లోకి వచ్చిన ప్రజలకు తాగునీటి వసతి, ఇతర మౌలిక సదుపాయాలను కల్పించారు. హైదరాబాద్ నగరం నుండే కాకుండా వివిధ జిల్లాల నుంచి విజ్ఞాపనలతో వచ్చిన ప్రజలతో ప్రజాదర్బార్ కిక్కిరిసింది.

LEAVE A RESPONSE