Suryaa.co.in

Telangana

బయటపడిన కాంగ్రెస్‌ హిందూ వ్యతిరేక వైఖరి

-అయోధ్య అంటే భారతీయ ఆత్మకు ప్రతిరూపం
-అయోధ్య ఆహ్వానం తిరస్కరించడం హిందువులను అవమానించడమే
-శ్రీరామ ప్రాణప్రతిష్ట కార్యక్రమం అంటే కాంగ్రెస్ పార్టీకి ఎందుకు కంటగింపు?
-కాంగ్రెస్ పార్టీ గత 75 ఏండ్లుగా శ్రీరాముడి ఉనికినే కొట్టివేసింది
-కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి

శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్టు ఆధ్వర్యంలో జనవరి 22న అయోధ్యలో శ్రీరామ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరుగనుంది. శ్రీరామ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ బహిష్కరించి హిందూ వ్యతిరేక ధోరణిని అవలంభిస్తోంది. కులాలు, భాషలు, ప్రాంతాలకు అతీతంగా జనవరి 22న జరిగే శ్రీరామ ప్రాణప్రతిష్ట కార్యక్రమం సమస్త హిందువులకు ఎంతో ఉద్వేగభరితమైనది.

500 ఏండ్లుగా ప్రజలు ఎదురుచూస్తున్న రామమందిర నిర్మాణం కల సాకారమయింది. న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా, వాస్తవాలకు అనుగుణంగా అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగింది. శ్రీరామ ప్రాణప్రతిష్ట కార్యక్రమం అంటే కాంగ్రెస్ పార్టీకి ఎందుకు కంటగింపుగా ఉంది..? ఎందుకు ఆడిపోసుకుంటోంది..?

శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్టు ఆధ్వర్యంలో రాజకీయాలకు అతీతంగా.. అన్ని వర్గాలకు చెందిన ప్రముఖులు, కవులు, కళాకారులు, సాధుసంతులను, సామాజిక సంస్థలను, ముఖ్యమంత్రులను, రాజకీయ పార్టీలను ఆహ్వానిస్తోంది. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేత సోనియా గాంధీ, లోక్సభలో కాంగ్రెస్ పక్షనేత అధీర్ రంజన్ చౌదరి కి శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్టు ఆహ్వానించింది. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి వచ్చిన ఆహ్వానాన్ని కాంగ్రెస్ పార్టీ తిరస్కరించడం వారి దివాళాకోరుతనమే.

అభద్రతాభావంతో, కుహనాలౌకికవాదంతో, సూడో సెక్యులరిస్టులుగా కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్నారు. హిందుత్వ వ్యతిరేక వైఖరిని చాటుకున్నారు. ఓటుబ్యాంకు, బుజ్జగింపు, మతతత్వ రాజకీయాల కోసం, తమ దుర్మార్గపు ఆలోచనల పరంపరలో భాగంగానే అయోధ్యకు రామంటూ కాంగ్రెస్ చెప్పడం… రాజకీయ దృక్పథంతోనే ఈ నిర్ణయం తీసుకున్నది. ఇది రాజకీయపరమైన, హిందుత్వానికి సంబంధించిన కార్యక్రమం కాదు.. యావత్ జాతికి సంబంధించిన కార్యక్రమం.

అయోధ్య అంటే భారతీయ ఆత్మకు ప్రతిరూపం.యుగయుగాలుగా భారతీయులను నడిపిస్తున్న మహోన్నత విలువల ప్రతిరూపం. స్వధర్మం కోసం శతాబ్దాల పాటు సాగిన హిందువుల పోరాట గాధ అయోధ్యలోని ప్రతి అణువు వినిపిస్తుంది.విదేశీయుల దురాక్రమణదారుల చెరలో ఉన్న బానిస చిహ్నాలను కడిగివేయడమే లక్ష్యంగా రాముడి జన్మభూమిని తిరిగి సాధించడానికి 500 ఏళ్లుగా చేసిన పోరాటాల్లో తెగిపడిన కంఠాల నుంచి వెల్లువెత్తిన ఆత్మగౌరవ నినాదాలు అక్కడ ప్రతిధ్వనిస్తూ ఉంటాయి.

జనవరి 22న జరిగే శ్రీరామ ప్రాణప్రతిష్ట మహోత్సవంతో శ్రీరామమందిర పున:నిర్మాణం కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన అమరవీరుల ఆత్మలకు శాంతి కలగనుంది.అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం వందలాది మంది సాధుసంతులు బలిదానం అయ్యారు. మహాత్మాగాంధీ గారు దేశంలో రామరాజ్యం రావాలని కోరుకున్నారు. కానీ, కాంగ్రెస్ పార్టీ గత 75 ఏండ్లుగా శ్రీరాముడి ఉనికినే కొట్టివేసింది.

సుప్రీంకోర్టులో అయోధ్య సమస్యపై వాదనలు జరుగుతున్నపుడు కాంగ్రెస్ పార్టీ రామమందిరం నిర్మాణం కాకూడదని వితండవాదాలు చేస్తూ అఫిడవిట్ దాఖలు చేసింది.దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, చరిత్రలో జరిగిన వాస్తవ ఘటనలను దృష్టిలో పెట్టుకుని రామ మందిరం నిర్మాణానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే.. కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతున్నది. కాంగ్రెస్ పార్టీ గతంలో జీ 20 సమావేశాలను, పార్లమెంటు సమావేశాలను, ఎన్నికల కమిషన్ ను బహిష్కరించింది. చివరికి ప్రణబ్ ముఖర్జీ కి భారతరత్న ఇస్తే ఆ కార్యక్రమాన్ని బహిష్కరించింది.

కాంగ్రెస్ పార్టీ పూర్తి అభద్రతాభావంతో సహాయనిరాకరణ చేస్తూ, దేశ సామరస్యాన్ని దెబ్బతీసేలా బాధ్యతారహితంగా వ్యవహరిస్తోంది.విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న నాయకత్వంతో కాంగ్రెస్ పార్టీ.. భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు, హిందువుల జీవన విధానంపై ఏమాత్రం గౌరవం లేకుండా వ్యతిరేకంగా మాట్లాడుతోంది. ఆర్టికల్ 370 రద్దు చేసి కశ్మీర్ లో శాంతిభద్రతలను కాపాడితే జీర్ణించుకోలేకపోతున్నారు. శ్రీరామ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి అనేకమంది క్రిస్టియన్ మతగురువులు స్వచ్ఛందంగా వస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ.. హిందువులకు సంబంధించి ప్రతి అంశంపై రాజకీయం చేయడమే ఆనవాయితీగా పెట్టుకుంది.సనాతన ధర్మంపై క్యాన్సర్ అంటూ, కరోనా అంటూ మరికొంతమంది నీచస్థాయిలో మాట్లాడుతున్నారు.1951లో విదేశీయులు ధ్వంసం చేసిన సోమనాథ్ దేవాలయాన్ని పునర్ నిర్మాణం చేసుకున్న తర్వాత ప్రారంభోత్సవ కార్యక్రమానికి నాటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ గారు పాల్గొనకూడదంటూ నెహ్రూ ప్రభుత్వం లేఖ రాసింది. రాష్ట్రపతి పదవినే అగౌరవపర్చే విధంగా సోమనాథ్ దేవాలయ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుని హిందూ వ్యతిరేక ధోరణితో వ్యవహరించారు.

వివిధ దేశాల రాయబారులు కూడా సోమనాథ్ కు ప్రముఖ నదీజలాలను భారత్ కు పంపొద్దని.. రాష్ట్రపతి లేఖలకు స్పందించొద్దంటూ అగౌరవప్రదంగా వ్యవహరించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. హైదరాబాద్ లో అయోధ్య నుంచి వచ్చిన పూజిత అక్షింతలను భక్తిభావనతో ప్రతి ఇంటికి పంపిణీ చేస్తుంటే సికింద్రాబాద్ లో పోలీసులు అడ్డుకుని అరెస్టు చేయడం దుర్మార్గం.

డిసెంబర్ 29వ తేదీన సికింద్రాబాద్ లోని సింధూ కాలనీలో అక్షింతల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న వారిపై కేసులు నమోదు చేశారు.మజ్లిస్ పార్టీ మెప్పు పొందడం కోసం తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది.అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలను ప్రతి ఇంట్లో భక్తిభావంతో తీసుకుంటుంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఇబ్బందేంటి..? ఎందుకు కేసులు బనాయిస్తోంది? భవ్య రామమందిర ప్రారంభోత్సవం నరేంద్ర మోదీ గారి హయాంలో జరుగుతున్న కార్యక్రమం కాబట్టే కాంగ్రెస్ కు కడుపుమంట.కాంగ్రెస్ పార్టీ సూడో సెక్యులరిస్టు వైఖరిని ప్రజలు క్షమించరు. శ్రీరామ ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని కాంగ్రెస్ బహిష్కరించడాన్ని ప్రజలు క్షమించరు.

LEAVE A RESPONSE