– కాంగ్రెస్-బీజేపీల కుట్రలో భాగమే కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగింత
– కాళేశ్వరాన్ని కనుమరుగు చేసి ఆంధ్రాకు నీళ్లు తరలించే ఎజెండా
– మోడీ-బాబు చెప్పినట్టు ఆడుతున్న రేవంత్
– రాహుల్ గాంధీ సీబీఐకి కేసు అప్పగింతపై నోరుమెదపాలి
– కేసీఆర్ ను టచ్ చేస్తే తెలంగాణ నిప్పుల కుంపటే
– బీఆర్ఎస్ నేత , మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
హైదరాబాద్: పైకి కాంగ్రెస్ భజన చేస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది, బీజేపీది ఎవరూ విడదీయలేని ఫెవికాల్ బంధమని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి మండిపడ్డారు.
కేసీఆర్ ను కుప్పకూల్చి తెలంగాణ రాష్ట్ర సంపదను దోచుకుతిన్నాలని ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుల కలను సాకారం చేసే కుతంత్రంలో భాగంగానే ఏ మాత్రం తప్పు జరగని కాళేశ్వరం విచారణల పేరుతో బురదజల్లి ఇప్పుడు కేసును సీబీఐ చేతిలో పెట్టి రేవంత్ గురుదక్షిణం సమర్పించుకున్నారని ఆయన ధ్వజమెత్తారు.
కాళేశ్వరాన్ని కనుమరుగు చేసి ఆంధ్రాకు నీళ్లు తరలించే ఎజెండా కూడా ఈ కుట్రలో దాగివుందని జీవన్ రెడ్డి సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో నిప్పులు చెరిగారు. మోడీ-బాబు చెప్పినట్టుఆడుతున్న రేవంత్ రెడ్డి తెలంగాణ విద్రోహిగా మారారని ఆరోపించారు.
బీజేపీ, కాంగ్రెస్ కలిసి చేస్తున్న ఈ కుట్రలను ఎదుర్కోవాలని పార్టీ క్యాడర్‌కు జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇది కేసీఆర్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్ర మాత్రమే కాదని, తెలంగాణ నదీ జలాలను పక్క రాష్ట్రాలకు తరలించి, కాళేశ్వరాన్ని ఎండబెట్టే ప్రయత్నంలో భాగంగానే ఈ కుట్ర జరుగుతున్నదని ఆయన విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టును సీబీఐకి అప్పజెప్పడం అంటే ఆ ప్రాజెక్టును పూర్తిగా మూసేయడమేనని ఆయన విస్పష్టంగా చెప్పారు.
నిన్నటిదాకా సీబీఐ గురించి వ్యతిరేకంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఒక్క రోజులోనే మాట ఎందుకు మార్చాడని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. దీని వెనుక ఉన్న శక్తులు ఏవో, వాటి ఉద్దేశాలు ఏమిటో ప్రజలకు తెలియజెప్పాలని పార్టీ శ్రేణులను ఆయన కోరారు. కాళేశ్వరం కేసును కాంగ్రెస్ పార్టీ సీబీఐకి ఇచ్చినా, మరే ఏజెన్సీకి ఇచ్చినా భయపడేది లేదని ఆయన పేర్కొన్నారు.
కేంద్రంతో కలిసి కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను ఎదుర్కొంటామని, బెదిరింపులు కేసులు తమ పార్టీకి కొత్త కాదని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్ని పోరాటాలైనా, త్యాగాలైనా చేస్తామని ఆయన ప్రకటించారు. పొద్దున లేస్తే సీబీఐ బీజేపీ చేతిలో అస్త్రంగా మారి ప్రత్యర్థులను అంతమొందిస్తోందని పదే పదే చెబుతున్న రాహుల్ గాంధీ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై నోరుమెదపాలని డిమాండ్ చేశారు. రాజకీయ కుట్రతో కేసీఆర్ ను టచ్ చేస్తే తెలంగాణ నిప్పుల కుంపటిలా మారుతుందని జీవన్ రెడ్డి హెచ్చరించారు.