– రెడ్కో మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ ముఖం పెట్టుకుని మేడారం వెళ్తున్నారు. ఆ అమ్మవార్లను అవమానించిన వ్యక్తి.. ఎలా వారి ఆలయానికి వెళ్తారు. రుణమాఫీ విషయంలో మేడారం అమ్మవార్లపై రేవంత్ రెడ్డి ఒట్టు పెట్టారు. భూమి బద్ధలైనా… అటు ఉన్న సూర్యుడు ఇటువైపు ఉదయించినా.. సమ్మక్క ఆలయం సాక్షిగా రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి ఎన్నికల నాడు ప్రమాణంచేశారని రెడ్కో మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆయన మంగళవారం విలేఖర్లతో మాట్లాడారు.
రామప్ప ఆలయం మీదకూడా ప్రమాణం చేశారు. కానీ రెండేళ్లు కావొస్తున్న ఇచ్చిన హామీలేవి అమలు కాలేదు. సమ్మక్క సారలమ్మలు వెలసిన గ్రామంలో, రామప్ప ఆలయం ఉన్న గ్రామంలో.. జిల్లాలో కూడా రుణమాఫీ కాలేదు. సర్కారు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ హామీలు అమలు కాలేదు. ప్రత్యేకంగా మేడారం, రామప్ప ఆలయాలపై ఒట్టుపెట్టి.. రుణమాఫీ చేస్తానని ఆనాడు పెద్ద పెద్ద మాటలు చెప్పారు.
ఇవేవో రాజకీయ విమర్శలు కాదు. ఓ స్వచ్ఛంద సంస్థ చేసిన సర్వేలో వెల్లడైన విషయాలు. పది రోజుల పాటు వారు చేసిన సర్వేలో సంచలన విషయాలు బయటపడ్డాయి. మంత్రి సీతక్క సొంతూరుకు చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కూడా రుణమాఫీతో పాటు సర్కారు హామీలు అందలేదు. రామయ్యపల్లె, కొత్తూర్, పొట్లాపూర్ బరిగెనలోనిపల్లిలో సర్వే చేస్తే సర్కారు బండారం మొత్తం బయటపడింది.
పొట్లాపూర్ లో 109 మందికి వ్యవసాయ రుణాలు ఉంటే.. అందులో 51 మందికి మాత్రమే రుణమాఫీ జరిగింది. కొత్తూర్ లో 122 మంది రైతులు ఉంటే.. ఏడుగురికి రుణమాఫీ జరిగింది. రాయమ్యపల్లిలో 80 మందికి లోన్లు ఉంటే 26 మందికి మాత్రమే రుణమాఫీ జరిగింది. బరిగెనలోనిపల్లిలో కూడా సగం కంటే తక్కువ మందికే రుణమాఫీ అయ్యింది.
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఏ ఒక్కటి కూడా సరిగా అమలు కాలేదు. అలాంటప్పుడు ఏ ముఖం పెట్టుకుని రేవంత్ రెడ్డి మేడారం వచ్చారు. అమ్మవార్లపై ఒట్టుపెట్టి మాట తప్పి మోసం చేశారు. రాష్ట్ర ప్రజలనే కాదు.. వన దేవతలను మోసం చేసిన వ్యక్తిగా రేవంత్ రెడ్డి రికార్డుల్లోకెక్కాడు. ఇలా అమ్మవార్లను మోసం చేసినందుకే కావొచ్చు.. గతేడాది ఆ అమ్మవార్లు ఆగ్రహించారు. వారి ఆగ్రహానికి వందల ఎకరాల్లో చెట్లు నేలమల్లమయ్యాయి.
అమ్మవార్లు తమ కోపాన్ని గ్రామాలపై చూపించి ఉంటే ఎంత ప్రాణ నష్టంజరిగి ఉండేది. దీనికంతటికి కారణం రేవంత్ రెడ్డే. ఆనాడు అమ్మవార్లపై, రామప్పలోని శివుడిపై ఒట్లు పెట్టి మాట తప్పినందుకే ఇంత విధ్వంసం జరిగింది. ఇప్పుడు ఏకంగా ఆయన అక్కడి వెళ్లారు ఇప్పుడు ఇంకెంత విధ్వంసం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన పడుతున్నారు.
తన మీద ఒట్టు పెట్టి మాట తప్పిన వాడిని తన గుడిలోకి ఎలా రానిచ్చారని ఆ అమ్మవార్లు గ్రామాలపై తమ కోపం చూపిస్తుందేమోనని అంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి మొదట సమ్మక్క, సారలమ్మ అమ్మవార్ల పాదాలపై, రామప్పలోని శివుడి పాదాలపై పడి తనను క్షమించమని కోరాలి. చేసిన తప్పునకు పొర్లు దండాలతో పాప పరిహారం చేసుకోవాలి. తాను చేసిన తప్పుకు ప్రజలను, అడవిలోని ప్రాణులను ఇబ్బంది పెట్టొద్దని దేవుళ్లను క్షమాపణ వేడుకోవాలని ఆయన హితవు పలికారు.