- మునుగోడు పాదయాత్రకు దూరం
- మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పాదయాత్ర
- నారాయణపూర్ నుంచి చౌటుప్పల్ దాకా సాగనున్న యాత్ర
- కరోనా లక్షణాలతో సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లిన రేవంత్
- పాదయాత్రకు రాలేకపోతున్న కారణాన్ని పార్టీ శ్రేణులకు వివరించిన టీపీసీసీ చీఫ్
హైదరాబాద్ : నల్లగొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శనివారం మొదలుపెట్టిన పాదయాత్రకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దూరమయ్యారు. నారాయణపూర్ నుంచి చౌటుప్పల్ దాకా సాగనున్న పాదయాత్ర వాస్తవానికి రేవంత్ రెడ్డి నేతృత్వంలోనే మొదలు కావాల్సి ఉంది. ఈ మేరకు యాత్రకు అన్ని ఏర్పాట్లు సిద్ధం కాగా రేవంత్ రెడ్డి కూడా యాత్రకు పార్టీ నేతలను ఆహ్వానిస్తూ తాను కూడా సిద్ధమైపోయారు. యాత్రకు రానన్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి సారీ కూడా చెప్పారు. ఇలాంటి కీలక తరుణంలో రేవంత్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. శనివారం ఉదయం రేవంత్ రెడ్డిలో స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో తన ఇంటిలోనే సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లిన ఆయన తాను యాత్రకు రాలేనని, అందుకు గల కారణాలను వివరిస్తూ పార్టీ నేతలు, శ్రేణులకు సందేశం పంపారు.