రాష్ట్రంలో సీఎంఆర్ ధాన్యం కుంభకోణం- టీఆర్ఎస్ ప్రభుత్వ ముఖ్యుల పాత్ర

– సీబీఐ విచారణకు రేవంత్ రెడ్డి డిమాండ్
– కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

తెలంగాణలో టీఆర్‌ఎస్ నేతలు, ప్రభుత్వ ముఖ్యుల ప్రమేయంతో జరుగుతున్న ధాన్యం కుంభకోణంపై దమ్ముంటే సీబీఐతో విచారణ జరిపించాలని టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆ మేరకు ఆయన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.
రేవంత్‌రెడ్డి లేఖ సారాంశం ఇదీ.

రాష్ట్రంలో సీఎంఆర్ పేరుతో రైస్ మిల్లుల్లో జరుగుతోన్న అవక తవకలు, బియ్యం రీ సైక్లింగ్ పై తక్షణం సీబీఐ విచారణ చేయాలి. 2014 నుండి ఇప్పటి వరకు సీఎంఆర్ కేటాయింపులు, ఎఫ్ సీఐకి చేసిన సప్లై, గాయబ్ అయిన బియ్యం నిల్వలు… అన్నింటిపైనా విచారణ సమగ్రంగా జరగాలి.బాధ్యులైన మిల్లులను సీజ్ చేసి… రెవెన్యూ రికవరీ యాక్టు కింద జరిగిన దోపిడీ సొమ్ము మొత్తాన్ని వసూలు చేయాలి.రైస్ మిల్లర్లతో కుమ్మక్కై ఈ కుంభకోణానికి సూత్రధారులుగా ఉన్న టీఆర్ఎస్ ముఖ్యుల పై కూడా క్రిమినల్ చర్యులు తీసుకోవాలి. టీఆర్ఎస్ పై ఉత్తుత్తి పోరాటాలు చేస్తూ ప్రజలను మభ్య పెట్టడం కాదు. తక్షణం బియ్యం కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి.