-రేవంత్ మళ్లీ పోటీ చేస్తే ఓడిపోవడం ఖాయం
– దమ్ముంటే రాజీనామా చేసి సొంత నియోజకవర్గంలో పోటీ చేయాలి
– రేవంత్ రెడ్డి పచ్చి అవకాశవాద రాజకీయ నేత
– రేవంత్ రెడ్డి ఏ మొహంతో విజయోత్సవాలు నిర్వహిస్తున్నారో చెప్పాలి
– ఖబడ్దార్ రేవంత్ … మోదీని, మా నాయకులను విమర్శిస్తే ఊరుకునేది లేదు
– సోనియా గాంధీని బలిదేవత అన్న వ్యక్తి కూడా ఈ రేవంత్ రెడ్డే
– బీజేపీ శాసన సభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి
హైదరాబాద్ :‘ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో ఈసారి గెలిచే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే రాజీనామా చేసి సొంత నియోజకవర్గంలో పోటీ చేయాలి. ఆయన మళ్లీ పోటీ చేస్తే ఓడిపోవడం ఖాయం ‘ అని బీజేపీ శాసన సభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి జోస్యం చెప్పారు. హామీలు నెరవేర్చని రేవంత్ రెడ్డి ఏ మొహంతో విజయోత్సవాలు నిర్వహిస్తున్నారో చెప్పాలన్నారు. ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదు కాబట్టి బీజేపీపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.
ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ హామీని కూడా ప్రభుత్వం నెరవేర్చలేదని, లగచర్లలో భూసేకరణ పేరుతో గిరిజనులను వేధిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నిర్వహిస్తున్నవి ప్రజా విజయోత్సవాలు కాదని… వంచనోత్సవాలు అని ఎద్దేవా చేశారు. ఒక అసమర్థుడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏవిధంగా దెబ్బతింటుందో ఇందుకు రేవంత్ రెడ్డి ఉదాహరణ అన్నారు. హామీలపై ఎక్కడ సభ పెట్టినా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్లను ప్రస్తావించే నైతిక అర్హత కూడా ముఖ్యమంత్రికి లేదన్నారు. కిషన్ రెడ్డి మోదీ బానిస అని తీవ్ర విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి, అదే సభలో సోనియా కాళ్లు కడిగి నెత్తిమీద పోసుకుంటానని వ్యాఖ్యానించడం గమనార్హమన్నారు. గతంలో సోనియా గాంధీని బలిదేవత అన్న వ్యక్తి కూడా ఈ రేవంత్ రెడ్డే అని గుర్తు చేశారు.
తన పదవిని కాపాడుకోవడానికి రేవంత్ ఏ స్థాయికి దిగజారారో తెలిసిపోతోందన్నారు. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లోకి వెళ్లి తెలుసుకోవాలని సూచించారు. పోలీసుల భద్రత మధ్య విజయోత్సవాలు జరుపుకుంటే విజయం అవుతుందా? అన్నారు. ‘ఆరు గ్యారెంటీలలో ఒక్క హామీనైనా నెరవేర్చారా? అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది అవుతున్నప్పటికీ ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించని రేవంత్ రెడ్డి అసమర్థ సీఎం కాదా? మోసపూరిత హామీలతో ప్రజలను మోసగించామని చెప్పి ఈ విజయోత్సవాలు జరుపుకుంటున్నారా? అని ప్రశ్నించారు.
‘ఖబడ్దార్ రేవంత్ రెడ్డి… మోదీని, మా నాయకులను విమర్శిస్తే ఊరుకునేది లేదు. ప్రధాని మోదీ ఏ రోజు కూడా తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. అప్పటి యూపీఏ ప్రభుత్వం అనాలోచితంగా రూపొందించిన ఏపీ పునర్విభజన బిల్లును ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు నష్టం జరగకుండా రూపొందించి ఉండాల్సిందని మాత్రమే ప్రధాని మోదీ మాట్లాడారు తప్పితే.. తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా ఏనాడూ మాట్లాడలేదు. పునర్విభజన చట్టం విషయంలో బిజెపి గురించి ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడటం సరికాదని హెచ్చరిస్తున్నం. రేవంత్… ఇష్టమొచ్చినట్లు మాట్లాడి ప్రజల్లో అభాసుపాలుకావొద్దు. బీజేపీ మద్దతు లేకుంటే తెలంగాణ ఏర్పడి ఉండేదా? రేవంత్ రెడ్డి పచ్చి అవకాశవాద రాజకీయ నేత. అవకాశవాద రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం రేవంత్ రెడ్డి. ఆయన ఏదో అదృష్టం కొద్ది సీఎం అయ్యారు. కాబట్టి బాధ్యతాయుతంగా మాట్లాడాల’ని మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ఏడాది పాటు తుగ్లక్ పాలన పూర్తి చేసుకున్నడు.
బీఆర్ఎస్ పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పేరుతో లక్షల కోట్ల రూపాయల దోపిడీ జరిగిందని… అధికారంలోకి రాగానే దోపిడీ చేసిన సొమ్మును కక్కించి జైళ్లకు పంపిస్తానని రేవంత్ రెడ్డి చెప్పిండు. ఇప్పటివరకు బీఆర్ఎస్ దోపిడీపై విచారణ ఎందుకు పూర్తిచేయలేదు?
ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది? రేవంత్ రెడ్డి.. ఇవన్నింటిపై మాటమార్చి సెటిల్ మెంట్లు చేసుకున్నందుకా.. విజయోత్సవాలు జరుపుకునేది? ఏడాది కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో బాగుపడ్డది కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వారి ఆస్థాన మంత్రులు మాత్రమే. సీఎం రేవంత్ రెడ్డి అంటేనే ‘ట్రిపుల్ ఆర్’ ట్యాక్స్.. ఫోర్త్ సిటీ, మూసీ సుందరీకరణ అంటూ వేలకోట్ల అవినీతి చేయడంగా మారింది.
విపక్ష ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని చట్టాలకు తూట్లు పొడుస్తున్నందుకా కాంగ్రెస్ విజయోత్సవాలు జరుపుకుంటున్నది? దమ్ముంటే ప్రజల్లోకి వెళ్లి విజయోత్సవాలు జరుపుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంఎస్ పీ, బోనస్ ఇవ్వకపోవడంతో రాష్ట్రంలో రైతన్నలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
రైతు డిక్లరేషన్ పేరుతో అనేక హామీలిచ్చి అమలు చేయకుండా రైతులను మోసం చేశారు. రైతు కూలీలకు ఇస్తామన్న రూ. 12 వేలు ఏమయ్యాయి? రైతుల దగ్గరకు వెళ్లి విజయోత్సవ సభ జరుపుకునే దమ్ము, ధైర్యం రేవంత్ రెడ్డికి ఉందా? పోలీసులు లేకుండా సభ నిర్వహించాలి.
2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకుండా, రూ. 4 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇవ్వకుండా యువతను మోసం చేశారు. వృద్ధులకు రూ. 4 వేల చొప్పున పెన్షన్ ఇస్తమని చెప్పి, ఇవ్వకుండా మోసం చేశారు. మహాలక్ష్మీ పేరుతో మహిళలకు రూ. 2500 చొప్పున ఇస్తామని హామీ ఇచ్చి, అమలు చేయకుండా మోసం చేశారు. రేవంత్ రెడ్డి ఏడాది పాటు తుగ్లక్ పాలన పూర్తి చేసుకున్నడు.