Suryaa.co.in

Telangana

ప్రజలను బిచ్చగాళ్లుగా మార్చిన రేవంత్ పాలన

– ఫీజు రీఇంబర్స్‌మెంట్ లేక రోడ్డున పడ్డ విద్యార్ధులు
– ఫూలేకు పూలదండ కాదు.. ఆయన ఆశయాలు అమలు చేయండి
– కేంద్రమంత్రి బండి సంజయ్‌కుమార్
– పూలే ఆశయాలకు విరుద్ధంగా తెలంగాణలో పాలన
– కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

హైదరాబాద్: ‘‘మహాత్ములకు నివాళులు అర్పించడమంటే వారి జయంతి, వర్దంతిలను ఘనంగా నిర్వహించుకోవడమే కాదు. వారి ఆశయాలను, ఆకాంక్షలను నెరవేర్చడమనే విషయాన్ని కాంగ్రెస్ పాలకులు గుర్తుంచుకోవాలి’’అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు.

మహాత్మా జ్యోతిరావు పూలె జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కేంద్ర మంత్రితోపాటు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, కార్యదర్శి డాక్టర్ ప్రకాశ్ రెడ్డి, కోశాధికారి శాంతకుమార్, అధికార ప్రతినిధి జె.సంగప్ప పూలె చిత్రపటానికి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ ఏమన్నారంటే.. అణచివేత పై తిరుగుబాటుకు కేరాఫ్ అడ్రస్…. బడుగు, బలహీన వర్గాలకు కొండంత ధైర్యం… మహాత్మా జ్యోతిరావు పూలె. ఏ సమాజమైతే చదువు పరంగా, ఆర్థికంగా ఎదుగుతుందో అప్పుడే ఆ సమాజం అభివృద్ధి చెందుతుందని ఆశించిడమే కాకుండా అందుకోసం చివరిదాకా కృషి చేసిన మహనీయుడు.

ఛత్రపతి శివాజీ మహారాజ్ ను అభిమానించే జ్యోతిరావు పూలె కుల వివక్షపై అలుపెరగని పోరాటం చేశారు. ఆరోజుల్లోనే వితంతు పునర్వివాహాలు జరపడంతోపాటు బాల్య‌వివాహాల‌కు వ్య‌తిరేకంగా ప్ర‌జ‌ల్లో చైత‌న్యం తీసుకొచ్చారు. మ‌హిళ‌ల చ‌దువు కోసం నిరంతరం పాటుప‌డ్డారు.

‘‘దీనబంధు’’ అనే పత్రికను స్థాపించి బీదల, కార్మికుల సమస్యలను సమాజానికి తెలిసేలా చేశారు. అట్టడుగు వర్గాల్లో విజ్ఞానాన్ని నింపడానికి, పేదలను ఆదుకోవడానికి సర్వస్వం త్యాగం చేసిన మహోన్నతుడు జ్యోతిబా పూలె. భారత రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బీఆర్‌ అంబేద్కర్ పూలెను గురువుగా ప్రకటించుకున్నారంటే, ఆయన గొప్పదనం ఏంటో అర్థమవుతుంది.

సతీమణి సావిత్రీబాయి పూలెతో కలిసి విద్యా ఉద్యమాన్ని ప్రారంభించి ఆనాడే ఏకంగా 52 పాఠశాలలను ప్రారంభించి వేలాది మంది పేదలకు అక్షర జ్ఝానాన్ని అందించిన మహనీయుడు జ్యోతిరావుపూలె. స్వాతంత్య్రంరాని రోజుల్లోనే నిర్బంధాలను, అణిచివేతలను తట్టుకుంటూ అణగారిన వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగులు తెచ్చేందుకు జ్యోతిరావు చేసిన కృషి చిరస్మరణీయం.

మన దురద్రష్టమేమిటంటే…జ్యోతిరావు పూలే ఆశయాలకు విరుద్ధంగా తెలంగాణలో పాలన సాగుతోంది. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ మిగులు రాష్ట్రంగా ఉంటే నాటి బీఆర్ఎస్, నేటి కాంగ్రెస్ పాలనా పుణ్యమా అని రాష్ట్రాన్ని నిండా అప్పుల్లో ముంచారు. ప్రజలు బిచ్చమెత్తుకునే దుస్థితికి తీసుకొచ్చారు.

స్వాతంత్ర్యానికి పూర్వమే పూలే మహానుభావుడు అక్షర వెలుగులు నింపితే… కానీ మన తెలంగాణలో అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ పాలనలో విద్యా రంగాన్ని పూర్తిగా వెనక్కు నెట్టేశారు. ఇయాళ తెలంగాణలో నూటికి 34 మంది ఇంకా చదువుకు నోచుకోని వాళ్లున్నారు. ఇగ మహిళల సంగతి చెప్పనక్కర్లేదు. నూటికి 40 మందికిపైగా చదువుకు దూరంగా ఉన్నారంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు.

దళిత, బడుగు బలహీనర్గాల పేదలకు విద్య, వైద్యం అందకుండా పోయే పరిస్థితి దాపురించింది. ఏళ్ల తరబడి ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో పేద, మధ్యతరగతి ప్రజలు ఉన్నత చదువులకు దూరమైతున్నారు. పాలకుల నిర్లక్ష్యం మూలంగా వేలాది కోట్ల ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు పేరుకుపోవడంతో అటు విద్యార్థులు చదువుకు దూరమయ్యారు.

ప్రైవేటు కాలేజీలు మూసివేసుకునే దౌర్భాగ్య స్థితి ఏర్పడినా పట్టించుకోని దౌర్భాగ్య పాలన కొనసాగుతోంది. అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే చదువుకునే ప్రతి విద్యార్ధికి 5 లక్షల రూపాయల భరోసా కార్డు ఇస్తామని, ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ వాటిని గాలికొదిలేసింది. 6 గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలను నట్టేట ముంచింది.

మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా తక్షణమే ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలన్నీ చెల్లించి విద్యార్థుల ఉన్నత చదువులకు ఢోకా లేకుండా చర్యలు తీసుకోవాలి. వంద శాతం అక్షరాస్యత దిశగా క్రుషి చేయాలి. విద్యా రంగాన్ని మరింత బలోపేతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా.

LEAVE A RESPONSE