Suryaa.co.in

Andhra Pradesh

27 రకాల దళిత సంక్షేమ పథకాలను పునరుద్ధరించి, నిధులు ఇవ్వండి

– అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య విజ్ఞప్తి

విజయవాడ: గత ఐదేళ్ళ వైసీపీ పాలనలో అమలుకు నోచుకోని ఎస్సీ , ఎస్టీ కులాల 27 రకాల సంక్షేమ పథకాలను పునరుద్ధరించి, నిధులను కేటాయించాలని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య ప్రభుత్వాన్ని కోరారు. విజయవాడలోని ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో దగా పడ్డది, దిగాలు పడ్డది ఎస్సీ, ఎస్టీలే అన్నారు. ఐదేళ్ళు నెత్తీ నోరు కొట్టుకొని చెప్పినా జగన్మోహన్ రెడ్డి వినలేదన్నారు. దశాబ్దాలుగా ఆయా ప్రభుత్వాలు అమలు చేసిన సంక్షేమ పథకాలతో పాటు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల కోసం పోరాడామని గుర్తు చేశారు. సంక్షేమ పథకాల అమలు లేక దళిత బిడ్డలు ఊళ్ళు వదిలి హైదరాబాద్ , చెన్నై, బెంగళూరు వలస పోతున్నట్టు చెప్పారు.

దీర్ఘకాలిక జీవనోపాధికి మార్గాలైన 27 రకాల సంక్షేమ పథకాలకు కూటమి ప్రభుత్వం మోక్షం కలిగించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. వైసీపీ రాకాసి పాలనలో ప్రాణాలు, మానాలు పోయిన దళిత బిడ్డలపై విచారణ కమిటీ వేసి న్యాయం చేయాలని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రానని, పది మంది ఎమ్మెల్యేలను కూడా వెళ్ళద్దని అలిగారని, బుంగమూతి పెట్టారని ఎద్దేవా చేశారు. ఐదేళ్ళ పాటు జగన్ చెప్పిన ‘దద్దమ్మల’ శాసనమండలిలో కాలక్షేపం చేసేలా ఉన్నారని, పవిత్రమైన శాసనసభకు మాత్రం రారని తెలిపారు. నేషనల్ నవ క్రాంతి పార్టీ అధ్యక్షులు కనకం శ్రీనివాసరావు మాట్లాడుతూ గత ప్రభుత్వ తప్పిదాలను సరిదిద్దామన్న సందేశం ఇచ్చేందుకు దళితుల సంక్షేమ పథకాల పునరుద్ధరణ ఏకైక మార్గం అన్నారు. వీటి కోసం తాము కూడా నిర్విరామంగా పోరాడినట్టు తెలిపారు. రెల్లి సంక్షేమ సంఘం నాయకులు శిరంశెట్టి నాగేంద్రరావు మాట్లాడుతూ రెల్లి సంక్షేమ కార్పొరేషన్ పోస్టులను వెంటనే నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు.

LEAVE A RESPONSE