Suryaa.co.in

Andhra Pradesh

సీబీఐ, ఎన్.ఐ.ఏ సంస్థలు సీఐడీలా పనిచేయడం లేదన్నదే సజ్జల బాధ

-వివేకా హత్య కేసు విచారణ సీబీఐకి అప్పగించాలని జగన్ అంటే, ప్రభుత్వం సీబీఐని తప్పపట్టడం ఏమిటి?
• వివేకానందరెడ్డిని కూతురు, అల్లుడే చంపారనడం కంటే దుర్మార్గం మరోటి ఉంటుందా?
• పులివెందులలో ఏ ఇంటికెళ్లి అడిగినా వివేకానందరెడ్డిని జగన్మోహన్ రెడ్డే చంపించాడని చెబుతారు
• జగన్ సొంత చెల్లి షర్మిలే వివేకాది రాజకీయ హత్య అంటుంటే, సిగ్గులేకుండా ఏదిపడితే అది మాట్లాడితే సరిపోతుందా?
• వివేకానందరెడ్డి హత్యకేసే వచ్చేఎన్నికల్లో జగన్, అతని ప్రభుత్వం మెడకు చుట్టుకోనుంది
– టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి బరితెగించి మాట్లాడుతున్నాడని, వివే కానంద రెడ్డి హత్యకేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ తప్పుడుదర్యాప్తు చేసిందంటున్న సజ్జల, ఏపీ సీఐడి మాదిరే సీబీఐకూడా పనిచేయాలని కోరుకుంటు న్నట్టు ఉందని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎద్దేవాచేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే ..

“ తప్పుచేయకపోయినా కేసులు పెట్టాలి.. ఎంపీ రఘురామరాజుని ఇబ్బందిపెట్టినట్టు అందరినీ ఇబ్బంది పెట్టాలి.. దళితుల్ని చంపిన అనంతబాబు లాంటి వారిని ఊరేగించా లా.. జగన్ అభిమానినని చెప్పిన కోడికత్తి శ్రీనివాస్ ను నాలుగున్నర సంవత్సరాలు జైల్లో పెట్టినట్టుగా సీఐడీ పనిచేయాలన్నట్టు సజ్జల వైఖరి ఉంది.

ఒక ఎంపీని అరెస్ట్ చేసి దుర్మార్గంగా కొట్టి, ముఖ్యమంత్రికి వీడియో కాల్ లో చూపించిన సీఐడీ లాగా సీబీఐ పనిచేయాలా? ఎన్.ఐ.ఏ, సీబీఐ కంటే సీఐడీనే బాగా పనిచేస్తుందన్నది సజ్జల అభిప్రాయం. వివేకా నందరెడ్డిని ఆయన కూతురు, అల్లుడే చంపారని సజ్జల అనడం ఎంత దుర్మార్గం. ఇంత కంటే ఘోరం పాపం ఉంటుందా? సీబీఐ తప్పుడు దర్యాప్తుచేస్తే కేసువిచారణలో మీకు అనుకూలంగానే జరుగుతుంది కదా! ఎందుకు మరి ఇంతలా భయపడుతున్నారు?

సీబీఐ దర్యాప్తుపై కథనాలు రాస్తున్నాయని, ఆ మీడియా.. ఈ మీడియా అని నిందిస్తున్న సజ్జలకు వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు సాక్షిలో ఏం ప్రచారంచేశారో తెలియదా? ఆ రోజున గుండెజబ్బు అని, నారాసుర వధ అని, చంద్రబాబే చంపించడా ని దుష్ప్రచారం చేశారు. సాక్షి పత్రికలో చంద్రబాబుకత్తి పట్టుకున్న ఫొటో వేసి రక్తపు మరకలు అంటించారు. ఏ మీడియా తప్పుదోవ పట్టించిందో తెలియదా? సీబీఐ ఛార్జ్ షీట్ ఫైల్ చేశాక, దానిలోని వివరాలు ప్రజలకు తెలియచేయడం తప్పా…ఏమీలేని దాన్ని, ఎలాంటి ఆధారాలు లేనిదాన్ని ఇతరులకు ఆపాదించి దుష్ప్రచారం చేయడం తప్పా?

గతంలో వివేకాహత్య కేసువిచారణ సీబీఐ చేపట్టాలని జగన్ కోర్టులో పిటిషన్ వేశాడా లేదా? అప్పుడు సీబీఐ దర్యాప్తు కావాలన్నవారికి, ఇప్పుడు అదే సీబీఐ విచారణ తప్పుగా కనిపిస్తోందా? సీబీఐ, ఎన్.ఐ.ఏ మీ కేసుల్లో సరిగా చేయడంలేదని మీకు అని పిస్తే కేంద్ర దర్యాప్తు సంస్థల్ని తప్పుపడతారా?

కోడికత్తి కేసులో ఎలాంటి కుట్రలేదని, ఏ శక్తులు, ఏపార్టీలు ఆ ఘటన వెనుకలేవని ఎన్.ఐ.ఏ తేల్చింది. శ్రీనివాస్ ఎన్నాళ్ల నుంచి జైల్లో మగ్గుతున్నాడు? మీరు చెప్పినట్టు మీ కాళ్ల కింద చట్టాలు నలిగిపోవా లంటే మీకు సీఐడీ విచారణే కావాలి.

వివేకాహత్య జరిగిన నాటినుంచీ ప్రజల వేళ్లు మొత్తం మీవైపే చూపిస్తున్నాయి. ఇది అందరికీ తెలిసిన సత్యం. సాక్షాత్తూ రాజశేఖర్ రెడ్డి సొంతతమ్ముడు, ముఖ్యమంత్రి చిన్నాన్నను పులివెందుల గడ్డపై ఆయనింట్లోకి వెళ్లి, నరికి చంపే ధైర్యం ఎవరికైనా ఉంటుందా? సజ్జల వ్యాఖ్యలు వింటే జనం నవ్విపోతారు. జగన్ సొంతచెల్లి షర్మిలే వివే కాహత్య రాజకీయ కారణాలతో జరిగింది అంటుంటే సజ్జల ఏదిపడితే అది మాట్లాడితే ఎలా?

మీరు అధికారంలోకి వచ్చాక హైకోర్టులో కొన్నివేలకోర్టు ధిక్కరణ పిటిషన్లు పడ్డాయి. చట్టాలంటే మీకు, మీ ముఖ్యమంత్రికి లెక్కలేదు అనడానికి ఇవే నిదర్శనం. అమా యకులు బలైపోవాలి.. ముద్దాయిలు బయటతిరగాలి అదే జగన్ రూల్. దానిప్రకారమే సీఐడీ పనిచేస్తోంది. అలానే సీబీఐ చేస్తే అప్పుడు ఆ సంస్థ బాగా పనిచేస్తున్నట్టు.

వివేకానందరెడ్డి హత్యకేసే వచ్చేఎన్నికల్లో మీ మెడకు చుట్టుకుంటుందని తెలుసుకో సజ్జలా. సొంత చిన్నాన్నను చంపినవారిని ప్రజలు సమర్థించరు. కచ్చితంగా గుణపాఠం చెబుతారు.

విలేకరులు అడిగిన ప్రశ్నలకు సోమిరెడ్డి స్పందన…
సీబీఐ దర్యాప్తు చేస్తోంది ఆషామాషీ కేసు విచారణ కాదు. చంద్రబాబు చెప్పినట్టు సీబీఐ దర్యాప్తు చేస్తోందా? ఏమన్నా బుర్ర ఉండే మాట్లాడుతున్నాడా? టీడీపీప్రభుత్వం ఎన్.డీ ఏ ప్రభుత్వంలో భాగస్వాములం అయ్యుంటే మాత్రం, ఒక ముఖ్యమంత్రి తమ్ము డిని నరికేసిన కేసు విచారణను మార్చేయడం సాధ్యమా? అసలు ముద్దాయిల్ని వది లేసి, ఎవర్నిపడితే వారిని లోపలేయమంటే వేస్తారా? అసలు జరిగేదేనా? కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలో కేంద్రమంత్రుల్ని అరెస్ట్ చేయలేదా?

ఎంపీలను అరెస్ట్ చేయలేదా? దర్యాప్తులో ఒకరిద్దరు తప్పించుకోవచ్చు గానీ, అసలు హంతకులు ఎలా తప్పించుకుంటారు? కడప జిల్లాలో పులివెందుల నియోజకవర్గంలో ఎవరిని అడిగినా వివేకానందరెడ్డిహత్య జగన్మోహన్ రెడ్డి ద్వారానే జరిగిందని చెబుతారు. తండ్రి మరణంపై రాజీలేకుండా పోరాడుతున్న సునీతమ్మను నిజంగా అభినందించాల్సిందే. వీళ్లసంగతి తెలిసిఆడబిడ్డ ధైర్యంగా నిలబడింది.

అనంతబాబు మీద పోలీసులు ఫైల్ చేసిన ఛార్జ్ షీట్ చాలా బలహీనంగా ఉంది. అందుకే నాలుగునెలల్లోనే బయటకు వచ్చాడు. దళిత బిడ్డ, అమాయకుడు శ్రీనివాస్ మాత్రం నాలుగేళ్లుగా జైల్లో మగ్గిపోవాలా?” అని సోమిరెడ్డి ప్రశ్నించారు.

LEAVE A RESPONSE