Suryaa.co.in

Telangana

మింగ మెతుకు లేదు .. మీసాలకి సంపెంగ నూనె అన్నట్లు కేసిఆర్ షో

– 200 కి.మీ దూరం లోని గోదావరి నుంచి కేసీఆర్ ఫామ్ హౌస్ కి నీళ్లు వస్తాయి, కానీ పక్కనే ఉన్న మంజీరా నుంచి మంజీరా నుంచి ఖేడ్ కు నీళ్లు ఎందుకు రావు?
– నాగిల్ గిద్ద కార్నర్ మీటింగ్లో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి జె.సంగప్ప

నారాయణఖేడ్ నియోజకవర్గం నాగిల్గిద్ద మండలానికి కేవలం మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో మందిరా నది పారుతున్నప్పటికీ నారాయణఖేడ్ భూములన్నీ ఇంకా పడావుగా ఉండటం ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం అని సంగప్ప ఆరోపించారు.200 కి.మీ దూరంలో ఉన్న గోదావరి నుంచి కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా కేసీఆర్ ఫామ్హౌస్కు నీళ్లు తెచ్చుకుని క్యాప్సికం లాంటి పంటలు పండించుకుంటున్నారని ఆయన ఆరోపించారు.

కేవలం 10 నుంచి 15 కోట్లు ఖర్చుపెడితే తమ నియోజకవర్గంలోని కారాముంగి, షాపూర్, దోర్నాల, బోరంచ, గట్టు లింగంపల్లి లిఫ్ట్ పథకాలు పూర్తి చేయొచ్చని, తద్వారా కనీసం 15 నుంచి 20 వేల ఎకరాలకు సాగునీరు అందించొచ్చని ఆయన పేర్కొన్నారు.ఈ లిఫ్టులు బాగు చేయడం చేతకాదు కానీ వేలకోట్లతో సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టు కడతామంటూ ఒకసారి శంకుస్థాపన, మరోసారి భూమి పూజ అంటూ నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజల చెవుల్లో మామ, అల్లుడు పూలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని సంగప్ప విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం చేతకాని పరిస్థితిలో ఈ సర్కార్ ఉంది, కానీ వేలకోట్లతో ప్రాజెక్టు నిర్మిస్తానంటే కేసీఅర్ ను నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరని ఆయన అన్నారు.

పక్కనే ఉన్న కర్ణాటకలో సోయా విత్తనాలు రూ. 2 వేలకు దొరుకుతుంటే మన దగ్గర రూ. 4,500 పెట్టి కొనాల్సిన పరిస్థితి ఏర్పడిందని సంగప్ప అన్నారు.కేంద్ర ప్రభుత్వం సీఎంఏవై కింద అన్ని రాష్ట్రాలకు లక్షల ఇళ్లు ఇస్తుంటే మన దగ్గర డబల్ బెడ్ రూమ్ ఇల్లు పేరు చెప్పి ఏదీ రాకుండా కేసీఅర్ అడ్డుపడ్డాడని సంగప్ప మండిపడ్డారు.

బిజెపి అధికారంలోకి రాగానే ఇల్లు లేని ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు నిర్మించి ఇస్తామని ఆయన చెప్పారు. అతివృష్టి, అనావృష్టి వల్ల వేల ఎకరాల్లో పంట నష్టపోతుంటే ఫసల్ బీమా యోజన అమలు చేయకపోవడం వల్ల రైతులకు నష్టపరిహారం అందకుండా పోతుందని ఆయన అన్నారు. తొమ్మిది ఏళ్లలో నారాయణఖేడ్ నుంచి వలసలు పెరిగాయి తప్ప తగ్గాలేదని సంగప్ప ఆవేదన వ్యక్తం చేశారు.బిజెపి అధికారంలోకి రాగానే నారాయణఖేడ్ కు ఫ్యాక్టరీలు ఫుడ్ పార్కులు తీసుకొచ్చి స్థానిక యువతకి ఉద్యోగ కల్పన చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో శక్తి కేంద్రం సహా ఇంచార్జీ రమేష్ యాదవ్, బూత్ అధ్యక్షుడు రాజు స్వామి, నారాయణఖేడ్ అసెంబ్లీ కన్వీనర్ రజనీకాంత్, పార్టీ సీనియర్ నేతలు సిద్దయ్య స్వామి, కాశీనాథ్ పటేల్, శ్రీనివాస్ రెడ్డి, రాజు పటేల్, సంగమేశ్వర్, సంజు పటేల్, సుధాకర్, రాజు గౌడ్, వినయ్ తదితరులు పాల్గొన్నారు

LEAVE A RESPONSE