గోదారి జిల్లాలో మొదలైన సంక్రాంతి సంబరాలు

– ఆరు టన్నుల గో పేడతో గుమ్మిలేరులో కిలోమీటరు భోగి దండ
( కొంగర దుర్గాప్రసాద్‌)

తెలుగు లోగిళ్లల్లో జరుపుకునే సంక్రాంతి సంబరాలు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందులోనూ గోదావరి జిల్లాల వాసులు ఈ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. ఈ జిల్లాల్లో కూడా కొన్ని గ్రామాల్లో సంక్రాంతి సంబరాలకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. అలాంటి గ్రామాల్లో అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం గుమ్మిలూరు గ్రామం ఒక్కటి. పశుపోషణకు దేశంలోనే ప్రసిద్ధిగాంచిన ఈ గ్రామంలోని గోవుల పేడను సేకరించి ఎంతో భక్తిశ్రద్ధలతో ఈ బోగిదండను తయారు చేస్తుంటారు.భోగి దండ అంటే చిన్న పిల్లల చేతిలో పట్టుకుని వేసే రెండు మూడడుగులది కాదండోయ్. ఏకంగా కిలోమీటరు పొడవైన దండను తయారు చేసి భోగి వేడుకకు సిద్దం చేశారు. ఈ దండ తయారీకి ఆరు టన్నుల గో పేడను వినియోగించారు.

ఆ పల్లెలో కోలాహలంగా బోగి పండుగ
బాజాభజంత్రీలు, కోలాట నృత్యాలు, బాణాసంచ కాల్పుల మధ్య ఈ భోగి దండను గ్రామస్తులందరూ ఊరేగింపుగా తీసుకెళ్లి మంటల్లో వేసే దృశ్యాలు సంక్రాంతి సంబరాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తాయి. దేశ విదేశాల నుంచి సంక్రాంతి పండుగకు సొంతూరు వచ్చే వారందరూ ఈ వేడుకలు చూడటానికి వస్తారు. అలాగే అనేక మీడియా ఛానల్స్ కెమెరాలు గుమ్మిలేరు గుమ్మంలో వాలతాయి.ఈ సుందర దృశ్యాలు ప్రపంచానికి చూపించడానికి పోటీ పడుతుంటారు. సంస్కృతి సాంప్రదాయాలకు ఆ ఊరు పెట్టింది పేరుగా చెప్పవచ్చు. ప్రతి ఎటా భోగి పండుగకు గుమ్మిలేరు గ్రామం ప్రత్యేక గుర్తింపు పొందుతుంది.

ఆరేళ్లుగా ఈ భోగి దండను ప్రత్యేకంగా తయారు చేస్తూ ఆ గ్రామస్తులు పురాతన సంస్కృతీ సంప్రదాయాలు,పండుగల గోడలకు బీటలు వారకుండా కాపాడుతున్నారు.అందుకునే ఎంత కష్టమైనప్పటికీ ఈ బోగి పిడకల దండను తయారు చేస్తున్నారు. చింతలూరు గోశాలతో పాటు గుమ్మిలేరు లో పెద్ద పాడి రైతుల నుంచి ఈ ఆవు పేడను సేకరించి ఇంటికో మహిళ చొప్పున వచ్చి పిడకలు తయారు చేశారు. వాటిని ఎండబెట్టి ఆరిన తర్వాత దండగా తయారు చేశారు. ధనుర్మాసం ప్రారంభం నుంచి ఈ బోగి పిడకల తయారీలో ఆ గ్రామస్తులు, రైతులు, మహిళలు నిమగ్నమయ్యారు. మండపేట పట్టణం సమీపంలో గల ఈ గ్రామం అచ్చ పల్లెటూరుకు జిరాక్స్ లా ఉంటుంది. ఒక్క సంక్రాంతే కాదు ప్రతి పండుగలను ఆ గ్రామంలో పురాతన కాలం నుంచి వస్తున్న సాంప్రదాయాలతో నిర్వహిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.

Leave a Reply