-దళితులు వైసీపీకి సమాధి కడతారు
– టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డా. సప్తగిరి ప్రసాద్
దళితుల భిక్షతో గద్దెనెక్కి దళితులపైనే కక్షా? అని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డా. సప్తగిరి ప్రసాద్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని ప్రశ్నించారు. శనివారం తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డా. సప్తగిరి ప్రసాద్ మాట్లాడుతూ… టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు దళిత నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి దళితుల సంక్షేమం, అభివృద్ధి, రక్షణ కోసం మేమేం చేశామో చర్చించడం జరిగింది. జగన్ దళితులను వాడుకుంటున్నాడే తప్ప చేసిందేమీ లేదు. పైగా గత టీటీపీ ప్రభుత్వంపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు.
వైసీపీ నాయకుడు జగన్ దేవుడి దయతోపాటు దళితుల వల్ల ముఖ్యమంత్రి అయ్యాననే విషయం మరవకూడదు. సవాళ్లు, ప్రతిసవాళ్లు, కరాళ నృత్యాలు, పులివేశాలు మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేశ్, నారాయణస్వామి తేల్చుకుందాం రా.. అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం తగదు. దళితులపై దాడులు, అత్యాచారాలు, అరాచకాలు జరుగుతుంటే దళిత మంత్రులు మారు మాటాడరే?. డాక్కా మాణిక్య వరప్రసాద్ అభివృద్ధిపై చర్చ పెడదాం అని పిలుపునిచ్చారు. ఎప్పుడు పెడదాం? ఎక్కడ పెడదాం? మీ పులివెందులలో పెట్టడానికైనా సిద్ధమే.
దళితులపై జరిగిన దాడుల్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ స్థానంలో ఉందని నేషనల్ క్రైం రికార్డు బ్యూరోనే తెలిపింది. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు దేశంలో ఎక్కడా జరగని ఘటనను చేసి చూపించారు. తన వద్ద పనిచేసే దళిత డ్రైవర్ ను చంపి దహన సంస్కారాలు చేసుకొండని డోర్ డెలివరి చేసిన సంఘటన ఎక్కడైనా జరిగిందా? ముఖ్యమంత్రి సొంత జిల్లాలో అనిమల్ హస్బెండరీ శాఖలో డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేసే అచ్చెన్న అనే ఓ దళితుడు చంపబడ్డాడు. ఆయన భార్య శోభారాణి దయచేసి తన భర్తను వెతికిపెట్టండని హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. దానిపై చర్యలు లేవు.
రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉందా? అనే అనుమానం కలుగుతోంది. అచ్చెన్న ఆచూకీ కనుక్కోలేకపోయారు. సిగ్గుతో తల దించుకోవాలి. ఒక డిప్యూటి డైరెక్టర్ కే రక్షణ లేదు. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? దళితులకు జగన్ చేసిందేమీ లేదని పాదయాత్రలో లోకేశ్ తెలిపారు. అది అక్షరాల నిజం. భూమి కొనుగోలు పథకాన్ని రద్దు చేశారు, ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ నిధులలు కాజేశారు. అంబేద్కర్ విద్యానిధి స్కీమ్ ను తీసేశారు, ఉద్యోగులకు స్టడీ లీవ్స్ లేవు. బుక్ బ్యాంక్ స్కీమ్ లేదు, పేదలకు ఇళ్ల పట్టాల కొరకు ఇచ్చే రూ.50వేలు నగదు లేదు. ఎస్సీ కార్పొరేషన్ లేదు, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పేరుతో ఎస్సీలకు జీవో నెం. 77 ఇచ్చి దగా చేశారు. ఎస్సీ ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులు లేవు.
ఇలా దళితులకు ఉండే 27 పథకాలను రద్దు చేశారు. చంద్రబాబునాయుడు ఎర్రగొండపాలెంకు వస్తే మంత్రి ఆదిమూలపు సురేష్ బట్టలు చించుకొని నానా యాగి చేశారు. అనంతబాబు ఓ దళితుడి శవాన్ని డోర్ డెలివరి చేసినప్పుడు ఆదిమూలపు సురేష్ ఎందుకు చొక్కా చించుకొని నిరసన తెలియజేయలేదు? దళితులను దారుణంగా అవమానిస్తూ ఆ నిందలు టీడీపీ నాయకులపై వేస్తున్నారు. తిరుమల తిరుపతి లో జగన్ వేదికపై ఉంటే మంత్రి పెద్దిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలు దర్జాగా కుర్చీలపై కూర్చొని వుంటే దళిత కులానికి చెందిన డిప్యూటీ సీఎం నారాయణస్వామి బిళ్ల బంట్రోతులా వెనకాల చేతులు కట్టుకొని నిలబడి వున్నారు.
ఎస్సీ సబ్ ప్లాన్ యాక్టుకు విరుద్ధంగా రూ. 700 కోట్లు ఎస్సీ కార్పొరేషన్ నిధుల్ని ఇతర పథకాలకు దారిమళ్లించారు. దళితుల నోరు కొడితే ఏదళిత మంత్రి నోరు విప్పి మాట్లాడలేదు. వైసీపీ మంత్రులకు మినిమమ్ కామన్ సెన్స్ లేదు. టీడీపీ హయాంలో 127 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని వంద కోట్లు నిధులు మంజూరు చేసి దాదాపు పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పనులు మొదలు పెడితే ఇప్పుడు పనులు ఎక్కడికక్కడ ఆపేశారు. సాంఘీక సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి చాలా దుర్భరంగా తయారైంది.
సంఘీక సంక్షేమ శాఖ మంత్రి ఏరోజైనా హాస్టళ్లకు వెళ్లి చూశారా? దళితుల్ని పొట్టన పెట్టుకుంటుంటే దళితుల ఆశీస్సులు ఎలా లభిస్తాయి? జగన్ కు రాజకీయంగా పునాది వేసింది దళితులు. వారికి వైసీపీని దళితులు సమాధి చేయబోతున్నారు. దళితులు జగన్ కు రాజకీయ బిక్ష పెడితే.. జగన్ దళితులపై కక్ష కట్టారు. త్వరలో దళితులు వైసీపీని బంగాళాఖాతంలో కలపనున్నారు. ఎందుకూ పనికిరాని మంత్రులు చంద్రబాబు, లోకేశ్ ల గురించి పిచ్చి వాగుడు వాగుతున్నారు. దళితుల్లో వెలుగులు నింపామని సీఎం చెబుతున్నారు.
ఆదిమూలపు సురేశ్, మేరుగ నాగార్జున, నారాయణస్వామిలకు మంత్రిపదవులు ఇచ్చినంత మాత్రాన దళితుల జీవితాల్లో వెలుగులు నింపేసినట్లేనా? జగన్ పని అయపోయింది. ఆరు నెలల్లో ఇల్లు, జైలు తప్పదు. ఇప్పటికైనా మంత్రులు కళ్లు తెరవాలని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డా. సప్తగిరి ప్రసాద్ తెలిపారు.