చీరల సెలక్షనా.. మజాకా?

“అత్తయ్య గారూ ! ఎలా వున్నారూ”? ఆషాడమాసంలో పుట్టింటికి వెళ్లిన కొత్త కోడలు మంజూష అత్తగారికి ఫోన్ చేసి కుశలమడిగింది.
“నేను బావున్నానమ్మా! నువ్వెలా వున్నావు?”
“నేనూ బాగున్నానండీ! అత్తయ్య గారూ! మా అమ్మ నేనూ చీరలు కొనడానికి షాపింగ్ మాల్ కి వెళుతున్నామండీ! ఆషాడమాసం కదా చీరలకి డిస్కౌంట్ పెట్టారు. మీకు కూడా చీర కొందామను కుంటున్నాను. మీకు ఎలాంటి చీర కొనమంటారు ?”
“అలాగా! మంచిదమ్మా! నాకు షాపింగ్ కు వెళ్లే శ్రమ తగ్గించావు. నువ్వు అడిగావు కాబట్టి చెపుతున్నాను. చీర మీద నా అభిప్రాయాలు నా ఇష్టాఇష్టాలు చెపుతాను. దాన్ని బట్టి ఒక చీర సెలెక్ట్ చేయమ్మా.
అందరూ ఆ చీర చూసి ఆహా! ఓహో! అనాలి. ఏ షాప్ లో కొన్నారు ? ‘ఏ కాలేజీలో చదువు తున్నారు’ ? అనే లెవెల్ లో ఉండాలి.
చీర మరీ ఎక్కువ ఖరీదు వుండకూడదు. ఎందుకంటే, అంత ఖరీదైన చీర కట్టుకుని బిగుసుకుపోయి, జీవితంలో మొట్ట మొదటి సారి ఫొటో తీయించుకునే వాళ్ల లాగా, ఎక్కడ కూర్చుంటే ఏమి అంటుకుంటుందో అనే భయపడేలా వుండకూడదు.

బెనారస్ చీర, కంచి పట్టు చీర బరువుగా వుంటాయి. అలాంటి చీరలు కొనకమ్మా! జిమ్ కి వెళ్ళి బరువులు ఎత్తినట్టుగా రోజంతా అలా బరువైన చీరలు మోయలేనమ్మా.
కాంజీవరం, కుబేర పట్టు చీరలకు పెద్ద పెద్ద బోర్డర్లు ఉంటాయి. అలాంటివి కొనకమ్మా! ఈ వయసులో పెద్ద బోర్డర్ ఉన్న చీర కట్టుకుంటే చూసే వాళ్ళకి ఎబ్బెట్టుగా ఉండి బావుండదు కదమ్మా!? పైగా దిష్టి తగిలినా తగలచ్చు. అంటే చీరకు కాదమ్మా…, నాకూ….
ఈ మధ్య కుప్పడం చీరలని వస్తున్నాయట. అసలు అదేం పేరమ్మా? అప్పడం లాగా! వద్దమ్మా వద్దు అలాంటి చీరల జోలికి పోనే పోకు.

ఇక పోతే…. చీర అస్సలు పలచగా వుండకూడదు. లోపల పెటీకోట్ రంగు కూడా అసలు ఎవరికీ కనిపించకూడదు. మా చిన్నతనంలో చీర కొంచెం పలుచగా వుంటే చాలు…. దేవతా వస్త్రాలు అంటూ ఎగతాళి చేసే వారు. మరి నాలాంటి వాళ్ళు ఈ వయసులో ఇలా పల్చటి చీరలు కడితే చూడడానికి బావుండదు కదమ్మా!

అన్నట్టు మరచి పోయా… చీర అస్సలు గుచ్చుకో కూడదు. లంబాడీ వాళ్ళలాగా చీరకి అద్దాలు గానీ, పూసలు గానీ, అలాగే మెరిసి పోయే చెమ్కీలు గానీ, ఎంబ్రాయిడరీ వర్క్ గానీ అస్సలు ఉండకూడదు. మే నెలలో మిట్ట మధ్యాహ్నం సూర్య భగవానుడి ఎండ లాగా చీర కట్టుకుంటే చెమటలు పట్టి వళ్ళంతా చిర చిర లాడుతూ చిరాగ్గా వుండకూడదు.

ఆర్గంజా చీర కానీ ఆర్గండీ చీర గానీ నెట్ చీర గానీ కోరా చీర గానీ నాకు అస్సలు నచ్చనే నచ్చవు.
తలబిరుసు తనంతో ఎవరి మాట లెక్క చేయని వాళ్లలా అవి పొగరుగా నిలబడి వుంటాయి ఒక పట్టాన లొంగవు.

అన్నట్టు కోడలు పిల్లా! షిఫాన్, జార్జెట్, టిష్యూ, సాటిన్ మోడల్ లో ఎలాంటి చీరా కొనకమ్మా! అప్పుడప్పుడే బుడిబుడి నడకలు నేర్చుకుంటున్న చిన్న పిల్లలని ఎవరైనా ఎత్తుకుంటే క్రిందకు ఎలా జారిపోతూ వుంటారో, అలాగే సిల్కీగా వున్న చీర కట్టుకుంటూ వుంటే చీర కుచ్చిళ్ళు జారిపోతూ వుంటాయి అలాంటి జారిపోతూ వుండే చీరలు కొనకమ్మా.

చీర రఫ్ గా మొరటుగా గరుక్కాయితంలా గరగర లాడుతూ వుండకూడదు. సినిమాలు, టీవీ సీరియల్స్ లో ఉండే ఆడ విలన్ లా కనిపిస్తాను. అంత మోటుతనం రఫ్ నెస్ నేను క(త)ట్టుకోలేను.
చికెన్ వర్క్ చేసిన లక్నోచీర సంగతైతే నువు మర్చి పోవడమే మంచిది. అవి అస్సలు వద్దమ్మా! ఎందుకంటే, చీరకి అగరబత్తి కాల్చి కన్నాలు పెట్టినట్టుగా కనిపిస్తుంది.
చీర మీద పెద్ద పెద్ద పూలు ఉండకుండా చూడు. మనం పూలతోటలో నిలబడితే బావుంటుంది గానీ మనమే పూలతోటలా కనిపించకూడదు కదా.
చీర మరీ డార్క్ కలర్స్ లో వుండకుండా చూసుకో. మనం కట్టుకున్న చీరని చూసి ఎదుటి వారు వాంతి చేసుకునేలా వుండకూడదు కదమ్మా.
చీర మరీ ప్లెయిన్ కలర్ ఉండకుండా చూడు. మరీ స్కూల్ యూనిఫామ్ లాగ వుంటుంది.
చీర మరీ చిన్నగా ఉండకూడదు. చీర కడితే కుచ్చీళ్ళు ఎక్కువ రావాలి, అలాగే పమిట కొంగు కూడా మోకాళ్ళు దాటేంత పెద్దగా రావాలి.
నైలాన్, క్రేప్ చీర అయితే ఒకోసారి వంటికి చుట్టబెట్టుకు పోతుంది. అడుగు ముందుకు వేయడానికి రాదు. కాళ్ళకి అడ్డంపడి ముందుకు పడి ముఖం పగిలే ప్రమాదం ఉంటుందమ్మా…వద్దు మ్మా వద్దు.
బాందినీ చీర ఊసే వద్దు. పాత గుడ్డలా, మాసికలు పట్టినట్టు ముడతలు పడి ముడుచుకు పోయి ఉంటుంది..
చీర ముడతలు పడకుండా, పదే పదే చీరకి గంజి పెట్టక్కర్లేకుండా, చీర ఐరన్ చేయక పోయినా కట్టుకునేలా ఉండాలి ఇస్త్రీ ఖర్చు కలిసొచ్చేలా.
చీర మరీ ఫేన్సీగా వుండకూడదు. గాజులకీ, మెడలో గొలుసులకీ, కాలి పట్టీలకీ తగులుకొని దారం పోగులు రాకుండా వుండేలా చూడమ్మా!.

కాటన్ చీరలు మాత్రం అసలు కొనకమ్మా! వాటికి గంజి పెట్టడం ఐరన్ చేయడం నా వల్ల కాదు. వాటిని మెయింటైన్ చేయలేను. చీర కట్టుకున్న వెంటనే ఎలక్షన్ లో నిలబడ్డ అభ్యర్థి లాగ చాలా ఠీవిగా నిలబడి వుంటుంది. గంట గడిచాక డిపాజిట్ కోల్పోయిన అభ్యర్థి లాగ డీలా పడిపోతుంది.

మరీ లేత రంగు చీర కొనకమ్మా! (మరక మంచిదే అది టి.వి.లో ప్రకటన వరకే) దాని మీద మరకలు చాలా క్లియర్ గా కనిపిస్తాయి. ఉతికితే ఒక పట్టాన మరకలు పోవు.
కలంకారీ ప్రింట్ చీర వద్దు. ఎందుకంటే అమ్మవారి ఫేస్ తో, బుద్ధుడు ఫేస్ తో, దేవుడి ఫేస్ తో వున్న చీర కట్టుకుంటే ఆ బొమ్మ కుచ్చీళ్ళు వున్న చోట కాళ్ళకి తగులుతూ ఉంటే దేవుడిని తన్నుతున్న ఫీలింగ్ తన్నుకొస్తుంది.. అది చాలా తప్పు అనిపిస్తుంది. అందుకని కలంకారీ గానీ, దేవుడి బొమ్మలతో వున్న ఏ చీరలు కొనకమ్మా!
చీరకి అడ్డ గళ్ళు వుంటే మాత్రం కొనకమ్మా! మరీ పొట్టిగా లావుగా కనిపిస్తాను.
అలాగే వెంకటగిరి చీర గానీ, ఖాదీలో గానీ, గుంటూరు నేత చీర గానీ అసలు ఎటువంటి నేత చీర గానీ కొనకమ్మా! మరీ వయసులో పెద్ద దానిలా కనిపిస్తానని మీ మామగారు అస్సలు కట్టనివ్వరు.
చీర కొంటే డ్రై వాష్ కి డబ్బులు పోసే అవసరం లేకుండా ఉండాలి.

అన్నట్టు మంజూ! నీతో అతి ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను.చీరలో వాళ్లు ఎటాచ్ చేసిన జాకెట్ ముక్క కట్టు చెంగు వైపు వుండాలి. పమిట చెంగు వైపు వుండ కుండా చూసుకో.ఎందుకంటే నేనూ చీరలో ఇచ్చిన జాకెట్ ముక్క కట్ చేయకుండా విడిగా మేచింగ్ బ్లౌజ్ పీస్ తీసుకుని కుట్టించు కుంటాను. దాని వలన చీర నిడివి పెరిగి ఎక్కువ కుచ్చిళ్ళు వస్తాయి. అందుకని చీర రన్నింగులోనే జాకెట్ పీస్ కూడా వుండాలి.అలా లేదనుకో నేను మళ్లీ దానిని కట్ చేసి కట్టు చెంగు దగ్గర అతుకు పెట్టి కుట్టించు కోవాలి. అలా చేస్తే మళ్లీ అది అతుకుల చీరలా అవుతుంది. ‘అతుకుల చీర కట్టుకోకూడదు’ అని మా అమ్మ చెప్పేది.

అర్థం….. అవుతోందా? మంజూ! అయినా నాదేముందమ్మా నేను షాపింగ్ కి వెళ్ళక్కర లేకుండా నేను ఇప్పుడు చెప్పినట్టుగా నువ్వే ఒక మంచి చీర సెలెక్ట్ చేసి కొనేసేయి….
మంజూ! వింటున్నావా?…. నేను చెప్పింది అర్ధం అయిందా!?
ఎంతసేపూ నేను మాట్లాడడమే కానీ నువ్వు ఏమీ మాట్లాడడం లేదు. హలో! హలో! నేను చెప్పింది విన్నావా?…
ఏమి కోడలో ఏమో!? “ఫోన్ పెట్టేస్తున్నాను అత్తయ్యా” అని చెప్పకుండానే మర్యాద లేకుండా ఫోన్ కట్ చేసింది.

అప్పుడే వియ్యపు రాలి నుండి ఫోన్ వచ్చింది…
“వదిన గారూ! ఇప్పటివరకూ మీ కోడలితో మీరేం మాట్లాడారో ఏమి షాకింగ్ న్యూస్ చెప్పారో గానీ మంజూ ఇక్కడ స్పృహ తప్పి పడిపోయింది.
అక్కడ మీ ఇంట్లో వాళ్ళు మీ చుట్టు పక్కల ఉన్న వాళ్ళు అందరూ బాగానే వున్నారుగా?” ఆదుర్దాగా అడిగింది వియ్యపురాలు….

– సేకరణ
పద్మ, నర్సరావుపేట

Leave a Reply